e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News ప్రవచన బ్రహ్మ మల్లాది

ప్రవచన బ్రహ్మ మల్లాది

కొందరి గురించి చెప్పాలంటే ఎక్కడ మొదలు పెట్టాలో, ఎలా మొదలు పెట్టాలో తెలియదు. ఎంత చెప్పినా చెప్పాల్సింది ఇంకా ఎంతో మిగిలిపోయే వ్యక్తులు కోటికొక్కరే ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి శ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు. ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవగానే కన్నుమూసిన పురాణ ప్రవచన భీష్ముడు మల్లాది వారు. దాదాపు నిండు నూరేండ్లు బతుకు పండించుకున్న ధన్యజీవి మల్లాది వారు.

ఇప్పుడంటే మైకు పట్టిన ప్రతివారూ ప్రవచనకర్తలే. వారిలో కోప తాపాలను ఎలా అణచుకోవాలో ప్రవచిస్తూ నిప్పులు చెరుగుతూ శపించేవారు కొందరు. ప్రాసల పంచు డైలాగులతో మూలానికి మైళ్ల దూరంలో నడిచేవారు కొందరు. పురాణాలను ఆధునిక కాలానికి అన్వయించడం తెలియక…సమాజాన్ని పాతరాతి యుగం వైపు వేగంగా తీసుకెళ్లేవారు కొందరు. ఆధ్యాత్మిక తాదాత్మ్యంలో భాష- ధ్వని- అంతరార్థం అర్థం చేసుకోలేక మోకాటి లోతు నీళ్లల్లోనే ఈదేవారు కొందరు. ఒకే అంశాన్ని అనేక పురాణాల ఆధారంగా ఎలా సమన్వయిస్తూ చెప్పాలో తెలియక తాము అయోమయంలో పడి, శ్రోతలను ఇంకా అయోమయంలో ముంచేవారు కొందరు. చెప్పేవారికి వినేవారు లోకువ అన్నట్లు ఏదో ఒకటి చెప్పి చేతులు దులుకొనేవారు కొందరు.

- Advertisement -

న్యూస్‌ చానెళ్లు, ఆధ్యాత్మిక ప్రత్యేక చానెళ్లు వచ్చాక ప్రవచనం ఒక అమ్మకపు వస్తువు అయ్యింది. అమ్మదగ్గ స్లాట్‌ అయ్యింది. స్పాన్సర్‌ చేయదగ్గ ప్రత్యేక వాణిజ్య కార్యక్రమం అయ్యింది. ప్రవచనకర్తలకు మీడియా మార్కెట్‌ డిమాండ్‌ కల్పించింది.

ఇలాంటి మీడియా లేని రోజుల్లోనే, ఇలాంటి డిజిటల్‌ దుకాణాల హోరు లేని రోజుల్లోనే మల్లాది వారు పురాణ ప్రవచనంలో హిమవన్నగం. భద్రాచలం సీతారామ కళ్యాణం ఆలిండియా రేడియోలో ప్రత్యక్ష వ్యాఖ్యానం వస్తోందంటే అది మల్లాది వారి వాణి అయి ఉండాలి. ఆపై దూరదర్శన్‌లో దృశ్యరూపంలో ఆ కల్యాణాన్ని మన కండ్ల ముందు ఉంచింది మల్లాది వారే. వాల్మీకి రామాయణం…ప్రత్యేకించి సుందరకాండ చెబితే వారే చెప్పాలి. మహా భారతం చెబితే వారే చెప్పాలి. పోతన భాగవతం చెబితే వారే చెప్పాలి.
పురాణ ప్రవచనానికి ఒక స్థాయి కల్పించిన మహానుభావుడు మల్లాది వారు. వేద వేదాంగ వేదాంత రహస్యాలను సామాన్యులకు, పండిత, పామరులకు అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ సాగుతుంది మల్లాది వారి ప్రవచనం. పురాణ ప్రవచనానికి శ్రోతలను ప్రోది చేసి పెట్టిన పుణ్యజీవి మల్లాది వారు. హరికథ, నాటకం, పురాణం కలిపి శ్రోతలను ఆకట్టుకునేలా పురాణ ప్రవచనం చేయడంలో మల్లాది వారే సుప్రసిద్ధులు. రామాయణం చెప్తూ సీతారామ లక్ష్మణులు మన దండకారణ్యంలో ఎక్కడెక్కడ తిరిగారో? భౌగోళికంగా తెలుగు ప్రాంతాల్లో ఎక్కడెక్కడ విడిది చేశారో? వివరిస్తారు. భారతం చెప్తూ పాండవులకు తెలుగువారికి ఉన్న సంబంధాన్ని వెలికి తీస్తారు. పోతన భాగవతం చెప్తుంటే తనను తాను మరచిపోతారు. అన్నమయ్య, రామదాసు, త్యాగయ్యలను అడుగడుగునా మన ముందు నిలుపుతారు.

వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, మంత్ర వ్యాకరణ శాస్ర్తాలు, తర్కం, మీమాంస, జోతిషం, వాస్తు…ఇలా అన్నీ పెనవేసుకుని ప్రవహించే గంగా ప్రవాహం వారి ప్రవచనం. ఏది ధర్మమో, ఏది కర్మమో వివరిస్తూ ఏది వేద విహితమో, ఏది వేద రహితమో కచ్చితంగా చెప్పగలిగే వేదాంత వేత్త మల్లాది వారు. పంతొమ్మిదేండ్ల వయసులో మొదలు పెట్టిన వారి ప్రవచన జైత్రయాత్ర ఆరు దశాబ్దాలకు పైబడి సాగింది. టీవీ చానెళ్లు, యూ ట్యూబులు వచ్చే నాటికి వయసు రీత్యా వారి ఉపన్యాసాల ఉధృతి తగ్గింది. అనేక మంది శిష్యులు ఆయన వద్ద శిక్షణ పొంది ప్రవచనకర్తలయ్యారు. తన శిష్యులు చక్కగా చెప్తున్నారు కాబట్టి…తను ప్రవచనాల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించిన తృప్తిపరుడు మల్లాది వారు. 97 ఏండ్ల నిండు వయసులో వారు భౌతికంగా మనకు దూరం అయి ఉండవచ్చు కానీ…వారి ప్రవచనాలు మన చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. అపర వ్యాసుడిలా అపార పురాణ పాండిత్యం ఉన్నా…నాకు తెలిసినంతవరకు…అని చెప్పుకొనే మల్లాది వారి వినయం నుంచి నేటి తరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.

అర్థ భంగం కలగకుండా శ్లోకం, పద్యం ఎలా పాడాలో, ఎక్కడ విరవాలో మల్లాది వారి వాణి విని నేర్చుకోవాలి. మనదైన ఒక సంస్కృతిలో పెనవేసుకున్న అనేకానేక సంక్లిష్ట విషయాలను అరటిపండు ఒలిచిపెట్టినట్టు సులభంగా, సరళంగా, ఆకట్టుకునేలా ఎలా చెప్పాలో మల్లాదివారిని చూసి నేర్చుకోవాలి. తన వాక్కుతో తెలుగువారికి పురాణాల రుచి చూపించిన మల్లాది వారికి నివాళి.

పమిడికాల్వ మధుసూదన్‌

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement