తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక ఆవేశపూరిత, ఉద్వేగపూరిత రాజకీయ సంఘటన కాదు. అది ఒక దీర్ఘకాలిక నైతిక ప్రజా ఉద్యమ ఫలితం. ఆ ఉద్యమానికి ప్రాణం పోసి, ప్రజల ఆకాంక్షలను తన భుజస్కంధాలపై మోసి, అనేక త్యాగాలతో రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన తొలి ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌ను తమ మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అది కేవలం ఒక అసాధారణ వ్యక్తికి కృతజ్ఞతాపూర్వకంగా, విశ్వాసంతో అప్పగించిన బాధ్యత. ఒక ఉద్యమానికి, ఒక ఆశయానికి తెలంగాణ ప్రజలు ఇచ్చిన గౌరవం.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు, పరిశ్రమలు, సంక్షేమం, మౌలిక వసతులు వంటి రంగాల్లో దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కోట్ల ఎకరాలకు సాగునీరు అందించడం, రైతుబంధు ద్వారా రైతును గౌరవించడం, 24 గంటల ఉచిత విద్యుత్తు ద్వారా వ్యవసాయాన్ని బలోపేతం చేయడం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించడం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన వాస్తవాలు.
బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో తెలంగాణ అభివృద్ధిని చూసి అనేక రాష్ర్టాలు నివ్వెరపోయిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అధిగమించలేక, ఓర్వలేక కొన్ని జాతీయ పార్టీలు కక్షగట్టి చీకటి ఒప్పందాలతో ఒక్కటయ్యాయి. ప్రగతిని పరుగెట్టించి చరిత్రను సృష్టించిన కేసీఆర్ స్థానంలో, అబద్ధాల పునాదులపై, హామీల మోసాలపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కక్షపూరిత రాజకీయాలకు పరాకాష్టగా మారింది.
పాలనలో వైఫల్యాలు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అసమర్థత, ప్రజాసమస్యలపై దృష్టిలేమి ఇవన్నీ ప్రజల ముందు బయటపడుతున్నాయి. దీంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ను, కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని నీతిమాలిన భాషతో బూతులు మాట్లాడటం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారింది. కమిటీలు, కమిషన్ల పేరుతో రాజకీయ వేధింపులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే కేసీఆర్ మంత్రి వర్గంలో కీలకంగా పనిచేసిన కేటీఆర్, హరీశ్‌రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్‌కుమార్‌కు సిట్ నోటీసులు జారీ చేసి విచారించింది. ఇప్పుడు కేసీఆర్‌కు కూడా నోటీసులు జారీ చేయడం రాజకీయ ప్రతీకారానికి నిదర్శనం కాక మరేమిటి?
ప్రజల దృష్టి మళ్లించేందుకే సిట్ రాజకీయాలు ఈ చర్యలన్నింటి వెనుక ఒకే లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. తమ ప్రభుత్వ వైఫల్యాలపై, అవినీతి ఆరోపణలపై, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల దృష్టి నిలవకుండా చేయడం. ప్రజల పక్షాన గట్టిగా ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ను బలహీనపర్చడం. కేసీఆర్ ఇమేజ్ను దెబ్బతీయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని భావించడం. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్నికలకు ముందు స్వయంగా తన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేశారని, తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారని రేవంత్‌రెడ్డి పదేపదే ఆరోపించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ‘నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే నన్ను సిట్ విచారణకు పిలిచేవారు కదా; నన్ను పిలవలేదు అంటే ట్యాపింగ్ జరగలేదని అర్థం’ అని స్వయంగా వ్యాఖ్యానించడం ఆయన రాజకీయ ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేస్తున్నది.
అభివృద్ధిని ప్రశ్నించలేక, వ్యక్తిత్వ హననం: కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి ప్రజల కండ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నది. దానిని తార్కికంగా ప్రశ్నించలేని పరిస్థితిలో, వ్యక్తిగతంగా ద్వేషాన్ని పెంచుకుని, తప్పుడు ప్రచారాలు, దూషణలు, అనవసర ఆరోపణలు చేయడం నేటి పాలకుల ఆయుధంగా మారింది. కేసీఆర్ చేసిన అభివృద్ధిని తమ పాలనలో పునరావృతం చేయలేని నాయకులకు, పార్టీలకు కేసీఆర్ ఒక కంటగింపుగా మారారు. ఈ దుష్ప్రచారాల వెనుక కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ శక్తుల హస్తం ఉందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. తెలంగాణ అస్తిత్వాన్ని, స్వతంత్రతను జీర్ణించుకోలేని శక్తులు, ఇక్కడి రాజకీయాలను ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నాయనే అనుమానం నిరాధారమైనది కాదు.
దేశ రాజకీయాల్లో తెలంగాణ స్థానం పడిపోయిందా?: రెండేండ్లుగా తెలంగాణ పాలన ఏ విధంగా అథోగతి పాలవుతున్నదో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఒకప్పుడు దేశ రాజధానిలో తెలంగాణ మాడల్‌పై చర్చ జరిగితే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి మాత్రమే చర్చ జరుగుతున్నది తప్ప అభివృద్ధి గురించి ఎలాంటి చర్చ లేకపోవడం కాంగ్రెస్ పాలన ఎంత వేగంగా దిగజారిందో తెలియజేస్తున్నది. ఇది సీఎంగా రేవంత్‌రెడ్డి వ్యక్తిగత వైఫల్యం మాత్రమే కాదు రాష్ర్టానికి జరిగిన, జరుగుతున్న తీరని నష్టం.
కేసీఆర్‌పై జరుగుతున్న ఈ రాజకీయ వేధింపులు కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదు. అది తెలంగాణ ప్రజాస్వామ్యంపై, ప్రజల తీర్పుపై, రాష్ట్ర అస్తిత్వంపై జరుగుతున్న దాడి. అభివృద్ధిని అడ్డుకోలేక, ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, రాజకీయ కక్షతో విచారణలు, నోటీసులు జారీ చేయడం చరిత్రలో ఎప్పుడూ నిలబడదు. తెలంగాణ ప్రజలు ఉద్యమ చైతన్యంతో ఉన్నారు. వారు నిజాన్ని, అబద్ధాన్ని వేరుచేసే శక్తి కలిగినవారు. కాలమే ఈ కక్షపూరిత రాజకీయాలకు సరైన సమాధానం ఇస్తుంది. కేసీఆర్‌కు జారీ చేసిన సిట్ నోటీసులు, వాటికి గల చట్టబద్ధత, బాధ్యతా సూత్రాల ఉల్లంఘన, రాజకీయ దుర్వినియోగాన్ని బట్టబయలు చేస్తుంది.
కేసీఆర్‌కు సిట్ ద్వారా జారీ చేసిన నోటీసులు, భారత క్రిమినల్ న్యాయ వ్యవస్థలోని మౌలిక సూత్రాలపై, ముఖ్యంగా క్రిమినల్ బాధ్యత, కార్యనిర్వాహక అధికార పరిధి, రాజకీయ బాధ్యత వ్యక్తిగత బాధ్యతల మధ్య తేడాలపై కీలకమైన చర్చను ప్రారంభించాయి. ఈ నోటీసులు కేవలం ఒక వ్యక్తిని విచారణకు పిలిచిన ప్రక్రియగా మాత్రమే చూడాలా, లేక రాజకీయ ప్రతీకారానికి చట్టాన్ని ఉపయోగించడానికి ఉదాహరణగా అర్థం చేసుకోవాలా అన్నది చట్టపరంగా విశ్లేషించాల్సిన అంశం.
సిట్ నోటీసుల చట్టపరమైన స్వభావం: కేసీఆర్‌కు జారీ చేసిన నోటీసులు సెక్షన్ 160 సీఆర్పీసీ (ప్రస్తుతం భారతీయ న్యాయ సురక్ష సంహిత 2023 సెక్షన్ 179) కింద జారీ అయినవిగా తెలుస్తున్నది. సెక్షన్ 160 సీఆర్పీసీ/సెక్షన్ 179 బీఎన్ఎస్ఎస్ ఉద్దేశం.. నేరానికి సంబంధించిన సమాచారం తెలిసిన వ్యక్తిని విచారణకు పిలవడం. ఇది నిందితుడిగా గుర్తించడం కాదు. ఇది అరెస్ట్ నోటీసు కాదు. ఇది కేవలం సమాచార సేకరణ కోసం మాత్రమే. అందువల్ల, చట్టపరంగా కేసీఆర్‌ను నిందితుడిగా పేర్కొన్నట్టు ఈ నోటీసులు సూచించవు. అయినప్పటికీ, పత్రికలలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రజావేదికలపై దీనిని నేరారోపణగా చిత్రీకరించడం ప్రక్రియాత్మక న్యాయానికి విరుద్ధమైన ప్రచారంగా పరిగణించాలి. ముఖ్యమంత్రి హోదా అధికారుల చర్యలకు బాధ్యత వహించాలా? ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన న్యాయ ప్రశ్న ఇది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సమయంలో, అధికారులు తమ అధికారిక విధుల నిర్వహణలో భాగంగా చేసిన చర్యలకు, ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా క్రిమినల్ బాధ్యత వహించాలని ఏ చట్టమూ చెప్పట్లేదు.
రాజకీయ బాధ్యత వర్సెస్ క్రిమినల్ బాధ్యత: భారత రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గం శాసనసభకు సామూహిక రాజకీయ బాధ్యత వహిస్తుంది. ఇది పాలసీ నిర్ణయాల పరంగా మాత్రమే. ఇది క్రిమినల్ బాధ్యతగా మారదు. రాజకీయ బాధ్యత అంటే.. విధానాలపై విమర్శలు, ఎన్నికల ద్వారా తీర్పు. క్రిమినల్ బాధ్యత అంటే.. వ్యక్తిగత పాత్ర, నేర ఉద్దేశం, ప్రత్యక్ష చర్య. ఈ రెండింటిని కలపడం రాజ్యాంగ ఆత్మకు విరుద్ధం.
అధికారుల స్వతంత్ర హోదా, చట్టపరమైన స్థితి: ఐఏఎస్, ఐపీఎస్ తదితర అధికారులు ఆల్ ఇండియా స్వసెస్ రూల్స్ కింద పనిచేస్తారు. వారు తీసుకునే నిర్ణయాలు చట్టాల ప్రకారం, నిబంధనల ప్రకారం, ఫైల్ నోటింగ్స్, ప్రొసీజర్ల ఆధారంగా ఉండాలి. ఒక అధికారి చట్టవిరుద్ధంగా వ్యవహరించినట్టయితే సదరు అధికారిపై శాఖాపరమైన చర్య లేదా క్రిమినల్ చర్య తీసుకోవచ్చు. కానీ అధికారి పనిచేశాడు కాబట్టి, ముఖ్యమంత్రి బాధ్యుడు అనే సిద్ధాంతం క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో లేదు. పరోక్ష బాధ్యత క్రిమినల్ చట్టంలో వర్తిస్తుందా? భారత న్యాయస్థానాలు స్థిరంగా చెప్పిన సూత్రం.. సాధారణంగా క్రిమినల్ న్యాయంలో ఒకరు చేసిన నేరానికి మరొకరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. కానీ చట్టం ప్రత్యేకంగా అలా చెప్పినప్పుడు మాత్రమే పరోక్ష బాధ్యత వర్తిస్తుంది.
అంటే స్పష్టమైన చట్ట ప్రావధానం లేకుండా ఇతరుల చర్యలకు వ్యక్తిని నేరస్థుడిగా చేయలేం. ముఖ్యమంత్రిపై బాధ్యత విధించాలంటే తప్పనిసరిగా ప్రత్యక్ష ఆదేశం, వ్యక్తిగత లాభం, కుట్రలో ప్రత్యక్ష పాత్ర లేకపోతే నోటీసులు కూడా చట్టపరంగా పరిమితి కలిగినవే. సిట్ విచారణలు రాజకీయ ప్రతీకారమా? అంటే ప్రస్తుత పరిస్థితుల్లో నిజమేననిపిస్తున్నది. న్యాయ ప్రక్రియలో సెలెక్టివ్ టార్గెటింగ్ అనేది తీవ్రమైన అంశం. ఈ క్రమం గమనిస్తే ముందుగా మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్‌కుమార్, ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్. ఇది చైన్ ఇన్వెస్టిగేషన్ అనడం కంటే ‘పొలిటికల్ ఇంటిమిడేషన్ ప్యాటర్న్’ను సూచిస్తున్నది.
ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలులో లోపాలు, అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి విచారణ సంస్థలను ఉపయోగించడం రూల్ ఆఫ్ లాకు విరుద్ధం. ఫోన్‌ట్యాపింగ్ అంశంలో ద్వంద్వ ప్రమాణాలు గమనించవచ్చు. ఎన్నికల ముందు నా కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేశారు అనే ఆరోపణలు. అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను సిట్ పిలవలేదు కాబట్టి ట్యాపింగ్ జరగలేదు అనే వాదన. ఇదే సిట్ ఇప్పుడు కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం.
చట్టాన్ని రాజకీయ సౌలభ్యానికి అనుగుణంగా వాడుకుంటున్నారనే భావన ప్రజల్లో బలంగా ఉన్నది. కేసీఆర్‌కు జారీ చేసిన సిట్ నోటీసులు, చట్టపరంగా ఒక పరిమిత ప్రక్రియ మాత్రమే. కానీ వాటిని రాజకీయంగా విస్తరించి, ముఖ్యమంత్రి హోదాలో అధికారుల చర్యలకు వ్యక్తిగత క్రిమినల్ బాధ్యత మోపే ప్రయత్నాలు రాజ్యాంగ సూత్రాలకు, క్రిమినల్ న్యాయానికి విరుద్ధం. ఇది కేవలం ఒక వ్యక్తి గురించి కాదు. ఇది ప్రతిపక్ష నాయకుడి హక్కుల గురించి, విచారణ సంస్థల స్వతంత్రత గురించి, ప్రజాస్వామ్యంలో చట్ట వినియోగ పరిమితుల గురించి. చట్టం రాజకీయ కక్షకు సాధనంగా మారితే, అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. న్యాయవ్యవస్థే చివరి ఆశ. చట్టం తన పరిమితుల్లోనే పనిచేయాలి. అదే రాజ్యాం గం కోరుకునే ధర్మం.
వ్యాసకర్త: సీనియర్ న్యాయవాది
-తన్నీరు శ్రీరంగారావు