పెత్రమాస నాడు పెద్దలకు బియ్యం ఇచ్చుడు తెలంగాణల అంతెన. కొందరు పెత్రమాస నాడు ఇచ్చుకుంటే, ఇంకొందరేమో తిథులను బట్టి ఇచ్చుకుంటరు. బియ్యం ఇచ్చుడంటే చనిపోయిన పెద్దల్ని తల్సుకోవడం. కాలంజేసిన మనుషులను మర్శిపోకుండా తనతో ఉన్న బంధాన్ని యాజ్జేసుకోవడం. ఆ రోజు ఇంటికి అయ్యగారొస్తడు. జరిగిపోయిన పెద్దల ఆశీర్వాదాలు ఆ ఇంటి మనుషులపై ఎప్పుడూ ఉండాలని మంత్రాలు సదువుకుంట దీవెనలిస్తడు.
గూడెం రాజన్న సిరిసిల్లకు 15 కిలోమీటర్ల దూరం. ఆ రోజు ఐతారం.. ‘తమ్మీ గీ గూడెం దాక పొయ్యొద్దాం.. పా’ అని మనోహరన్న ఫోన్జేసిండు. ‘ఎందుకన్నా..’ అనడిగితే అమ్మమ్మకు బియ్యం ఇస్తుర్రట పెద్దమావ ఫోన్జేసిండు, రాంగరాంగ నిన్ను కూడా తోల్కరమ్మన్నడు’ అనేసరికి పానం గూడెం దిక్కు గుంజింది. ‘సరే పొయ్యొద్దాం పాయె..’ అన్న.
మనోహరన్న, నేను కన్నారం నుంచి బైలెల్లినం. మా కారు కొదురుపాక కొత్త బ్రిడ్జి దాటి ఎములాడ ఎక్స్ రోడ్డు కాడ ఆగింది. రాజన్నకు అక్కణ్నుంచే చేతులెత్తి మొక్కినంక.. మళ్లా చాల్ అయిన కారు సిరిసిల్ల మీదుగా గూడెం చేరింది. చేరేయాళ్లకు ఒంటిగంట దాటింది. అమ్మమ్మోల్ల ఇంటిముందే చేదబాయి. ఆ బాయి ముందు చేదివెట్టిన నీళ్లు బకీట్లున్నయి. కాల్రెక్కల్ కడుక్కొని ఇంట్లకు వొయ్యేసరికి.. అయ్యగారొచ్చి వోయినట్టున్నడు. అంద రు నొసళ్లకు తెల్లబొట్టు వెట్టుకొని కనవడ్తున్నరు. ఎదురంగ గోడకేసున్న కుర్చీ మీద బొప్ప మల్లవ్వ పోట్వ (మనోహరన్నోళ్ల అమ్మమ్మ) కనవడ్తున్నది. సీద పోట్వ కాడికే వొయి రెండుచేతులా దండం వెట్టుకున్నం. మా కోసం ఎదిరిసూత్తున్న రమేషన్న (మల్లవ్వ పెద్దబిడ్డ ఎంకటలచ్చవ్వ సిన్న కొడుకు) ‘అప్పుడనంగా బైలెల్లినమన్నరు. అచ్చేసరికి గీయాల్లయింది. సింగ సముద్రం చెర్వు (తెలంగాణ నయగరా ఫాల్స్) సిందులేస్తున్నదట సూసొద్దాం పార్రి’.. అంటే నలుగురైదుగురం గల్సి సిరిసిల్ల జిల్లా సిగలో ఉన్న సింగ సముద్రం అందాలను సూసేటందుకు బైలెల్లినం.
సింగ సముద్రం చెర్వు గురించి రమేషన్న చెప్తుంటే సంబురం
అనిపించింది. అటు సింగ సముద్రం సిందులేస్తున్నది. ఇటు నర్మాల చెర్వూ నర్తిస్తున్నది. ఇంకేంది.. సిరిసిల్ల జిల్లాల ఉన్న ఊర్లన్నీ దాదాపు మత్తళ్లు దున్కుతున్నయి. సింగ సముద్రం ఉన్నది తక్కువ దూరమే అయినా నీళ్ల తాకిడికి రోడ్లన్ని బందువెట్టేసరికి సుట్టూ
తిరుగుకుంటా వొయ్నం. సింగ సముద్రం చేరేసరికి నాలుగున్నర గొట్టింది. ఐదు మత్తళ్ల నీళ్లు గలగలా సప్పుడు జేసుకుంటా కింద దున్కుతున్నయి. సింగ సముద్రపు అందాలను బుద్ధిదీరా జూసి, చెర్వొడ్డుకున్న నీళ్లల్ల ఎగిరి, దున్కినం. ఇగ చీకటి వడుతదనంగా
సింగ సముద్రం నుంచి బైలెల్లినం.
‘గన్నె నర్సయ్యది ముస్తాబాద్ మండలం గన్నెవారిపల్లి. రెండున్నరేండ్ల కిందటనుకుంటా.. ఇంకా కాళేశ్వరం నీళ్లు సిరిసిల్ల మొకాన రాలె. ఏడెకరాల భూమిని నీళ్లు లేక ఏండ్లవట్టి పడావుంచుతున్నడు. ఈ ఎల్లీఎల్లని సంసారానికి ఎవుసం జేత్తే తిండికి తిప్పలుండదని నర్సయ్య ఆలోచన. అప్పుజేసైనా మంచిదే బోరెయ్యాల్నని ఎంబడివడ్డడట. ‘బోర్ ఏస్తే నీళ్లు వడుతయని నమ్మకమేందుల్లా, నీళ్లు వడకుంటే అప్పులోళ్ల బాధకు ఉరేసుకొని సచ్చేకాలం’ అని వాళ్లింటామె అప్పటికే మొత్తుకున్నదట. అయి నా నర్సయ్య ఇన్లే. బోరెయ్యాల్నని నా దగ్గరికొచ్చిండు. ఓ రోజు ఇట్ల సూర్యుడు గూట్లె సొచ్చిండో లేదో, అట్ల బోర్ బండి షురూ జేసినం. వంద ఫీట్ల లోతు మొత్తం దుమ్మే బయటికొస్తున్నది గని నీళ్ల జాడ మాత్రం లేదు. లోతువోయినా కొద్దీ నర్సయ్య పానం కిందిమీదైతంది. నీళ్లు వడ్తే యాటతోని జేత్తనని మైసమ్మకు, పోషమ్మకు మొక్కుతనే ఉన్నడు. బోరు రెండు వందల ఫీట్లలోతు వోయినా రెండుసుక్కల నీళ్లు రాళ్లే. అట్లా ఏడు వందల లోతు వోయింది. అయినా.. సుక్క నీళ్లు లెవ్వు. నర్సయ్య పెండ్లాం ‘ఈ భూమి పాడుగాను నీళ్లు వడయి, మన్ను వడయి ఇగాపుర్రి బిడ్డా’ అంటే మోటర్ బంజేసినం. తెల్లారి ఏడుగొట్టంగా ఏడ్సుకుంటా లచ్చ రూపాలు నా చేతిల వెట్టిర్రు. పాపం వాళ్లకొచ్చిన బాధ పగోనిగ్గూడ రావద్దనుకున్న. పైసల్ తీస్కోవడానికి ధైర్న్యం రాలె. కానీ మా సేటు ఊకుంటడా..?’ సిరిసిల్ల సుట్టూరా ఉన్న ఊరు చెరువులల్ల నీళ్లన్నీ గలాగలా దున్కుతుంటే రమేషన్న చేదు జ్ఞాపకాలు నీళ్ల రూపంలో కండ్లళ్లకెళ్లి రాలిపోతున్నయి.
ఇదిట్లా ఉంటే మూణ్ణెల్ల కిందటి ముచ్చట ఇంకోటి చెప్పిండు రమేషన్న. బైతి ఎల్లయ్యది తెర్లుమద్ది, ముస్తాబాద్ మండలమే. ఎల్లయ్యకు నాలుగెకరాల ఎవుసం భూమున్నది. బోరెయ్యాల్నని మా దగ్గరికొస్తే ఓ రాత్రి షురూ జేసినం. బోర్ 60 ఫీట్ల లోతు కూడా వోలె. నీళ్లు ఎగేసుకుంటా దున్కుతున్నయి. ‘మల్ల మల్ల ఏపిస్తమానే, ఓ మూడు వందల లోతు వోనియ్యిర్రన్నడు ఎల్లన్న ఖుషీ కొద్దీ. 280 ఫీట్ల లోతు వోంగనే ఇగ ఊట ఆగుతలేదు. నీళ్లు రువ్వడిగా ఎదురెక్కుతున్నయి. ఆ నీళ్లనాపుడు మాతోని గాలె. బోరు మోటర్ బంజేసి ఎన్కకచ్చినం. తెల్లారి బైతి ఎల్లయ్య యాటపోతు కోసి మాంచి దావతిచ్చిండు. బోరెయ్యడానికి అయిన పైసలు కూడా అప్పుడే చెయిల వెట్టిండు.
ఇప్పుడు ఒక్క ఎల్లయ్య భూమి ల్నే గాదు, బోర్ ఏడేసినా వంద ఫీట్లు వోకముందే నీళ్లు ఎదురెక్కుతున్నయి. మాకు పైసలు అస్తెంత? రాకపోతెంత. రైతులు సంబురంగుంటె సాలదా? మా బోరు బండి మూలకువడేసి మేంగూడ ఎవుస మే జేసుకుంటమని.. రమేషన్న నవ్వుకుంట జెప్పిండు.