సోనియాగాంధీ పంపిన ఒక సాధారణ లేఖనే సీఎం రేవంత్‌రెడ్డి ఆస్కార్ అవార్డు, నోబెల్ బహుమతి, జీవన సాఫల్య పురస్కారాలుగా చెప్పుకోవడం అతిశయోత్సాహం మాత్రమే కాదు, ఒక ముఖ్యమంత్రి తన హోదాను మరిచిపోయి హైకమాండ్ ప్రసన్నత కోసం చేసిన ప్రదర్శన. సోనియాగాంధీ గైర్హాజరై, పంపిన లేఖకు అంత ప్రాముఖ్యం ఇవ్వడం ముఖ్యమంత్రి వ్యవహార ధోరణిలోని బలహీనతను బయటపెడుతున్నది.
ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ దేశానికి తెలంగాణ మోడల్ ఆదర్శమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. సోనియాగాంధీ ఆ సమావేశానికి హాజరుకాలేదు. ఆమె లేఖలో ‘ముం దే నిర్ణయించిన కార్యక్రమాలతో బిజీగా ఉన్నాను’ అన్న మాట మాత్రమే ఉంది. ఒక్క ప్రశంస కూడా లేకపోవడం యాదృచ్ఛికం కాదు. అయినా, ఆ లేఖను జీవన సాఫల్య పురస్కారంగా చెప్పుకోవడం హాస్యాస్పదం. ప్రముఖ హిందీ, ఇంగ్లిషు టీవీ చర్చల్లో దీనిపై ట్రోల్స్ రావడం రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చింది.
కాంగ్రెస్ చరిత్రను చూస్తే మొదటినుంచి ఆ పార్టీది బీసీ వ్యతిరేక వైఖరే. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు, అభివృద్ధి పథకాలను అమలు చేయాలని 1953లో కాకా కాలేల్కర్ కమిషన్ సిఫారసు చేసింది. కానీ, శాస్త్రీయ ఆధారాలు లేవంటూ అప్పటి నెహ్రూ ప్రభుత్వం ఈ నివేదికను పక్కనపెట్టింది. ఇది బీసీల సాధికారత దిశలో తొలి అతిపెద్ద ఎదురుదెబ్బ.
1980లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బి.పి. మండల్ కమిషన్ సిఫారసు చేయగా, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వాలు దాన్ని అమలు చేయలేదు. 1990లో వి.పి.సింగ్ సర్కారు మండల్ సిఫారసుల అమలుకు నిర్ణయం తీసుకోగా, అప్పటి ప్రతిపక్ష నేత రాజీవ్‌గాంధీ లోక్‌సభలో తీవ్ర విమర్శలు చేశారు. ఆ విమర్శలు ఆయన మాటల్లోనే.. ‘The manner in which you have implemented the Mandal Commission.. is breaking up my country. Even at this late hour, there is time to pull the country back from this caste division. Do we still have that goal of a casteless society? Every major step you take must be such that you move towards a casteless society’ అని హెచ్చరించారు. అదే సమయంలో ‘They are supporting the Mandal Commission but Rajiv Gandhi is opposing it’ అనే వ్యాఖ్యలు కాంగ్రెస్‌లోని భిన్న స్వరాలకు తార్కాణంగా నిలిచాయి.
నిజానికి, ఈ రోజు కులగణనపై దేశవ్యాప్తంగా ఏర్పడిన గందరగోళానికి మూల కారణం 2011లో జరిగిన సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సస్ (ఎస్ఈసీసీ). ఇది జనగణనలో కులగణన లాంటి చట్టబద్ధమైన ప్రక్రియ కాదు. అప్పటి జనగణన కమిషనర్ సహా పలువురు నిపుణులు కులగణన తప్పనిసరిగా సెన్సస్ యాక్ట్ 1948 కింద, రిజిస్ట్రార్ జనరల్ ఆధ్వర్యంలో జరగాలని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. నాడు సరైన విధానంలో జనగణన శాఖ ద్వారా కులగణన జరిగి ఉంటే ఈరోజు సమస్య ఇంతగా ముదరకపోయేది. ఆ డేటా ఆధారంగా చట్టబద్ధ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండేది.
రేవంత్ గర్వంగా చెప్పిన SEEEPC (SocioEconomic, Education, Employment, Political Caste Survey) చట్టబద్ధ పునాది లేని పరిపాలనా ప్రక్రియ మాత్రమే. ఆర్టికల్ 340 ప్రకారం స్వతంత్ర చట్టబద్ధ కమిషన్‌ను ఏర్పాటు చేయకుండానే ఈ సర్వేను జరిపారు. ముఖ్యంగా ఈ నివేదికను అసెంబ్లీలో టేబుల్ చేయలేదు, చర్చించలేదు. ఈ లోపాల మధ్యనే పంచాయతీరాజ్ సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి ఆర్టికల్ 213 ప్రకారం ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసింది. సంబంధిత బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా ఇలా చేయడం ప్రక్రియాత్మకంగా తప్పు. ఆర్డినెన్స్‌లు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడాలి. కానీ, రేవంత్ ప్రభుత్వం ప్రజాస్వామ్య చర్చలను పక్కనబెట్టి, హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు రాజ్యాంగ ప్రక్రియలకు తిలోదకాలిస్తూ తీసుకొచ్చింది.
భారత్ జోడో, న్యాయ్ జోడో పాదయాత్రల్లో సామాజిక న్యాయం పట్ల తన నిబద్ధతను రాహుల్ గాంధీ ప్రజల ముందుంచారు. కులగణన కోసం దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసిన నాయకుడిగా ఆయన మాటలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే, ఇలాంటి ఒక ముఖ్యమైన అంశంపై లోతైన అధ్యయనం చేయకుండా, చట్టబద్ధత లేని తెలంగాణ SEEEPC సర్వేను దేశానికి ఆదర్శమని ప్రశంసించడం ఆశ్చర్యానికి గురిచేసింది. బీసీలకు న్యాయం జరగాలంటే ఆర్టికల్ 340, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం స్వతంత్ర చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలి. ప్రజా భాగస్వామ్యంతో శాస్త్రీయ అధ్యయనాలు జరగాలి.
అసెంబ్లీలో చర్చించి పటిష్ఠమైన చట్టాలు చేయాలి. మండల్ కమిషన్ శాస్త్రీయ పద్ధతులతో సామాజిక న్యాయాన్ని శాశ్వత విధానంగా మార్చి చూపింది. తమిళనాడులో అంబాశంకర్ కమిషన్ చట్టపరమైన రక్షణ ఎలా కల్పించవచ్చో చూపింది. కానీ, తెలంగాణ సర్కారు మాత్రం చట్టబద్ధత లేని సర్వేలు, లోతు లేని ఆర్డినెన్సులు, ప్రదర్శనాత్మక రాజకీయాలను ఎంచుకుంది. ఈ మార్గాన్ని మార్చుకోకపోతే తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల ప్రయోగం తాత్కాలిక వాగ్దానంగానే మిగిలిపోతుంది. న్యాయస్థానాల విచారణలో నిలదొక్కుకోవడమూ కష్టం. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బీసీ సమాజం ఏకమవ్వాలి. ఉద్యమించి విజయం సాధించాలి. అందుకు చైతన్యం కలిగించే దిశగా వాస్తవాలను కచ్చితత్వంతో ప్రజల ముందుంచే ప్రయత్నంలో భాగమే ఈ వ్యాసం లక్ష్యం.
-వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు