దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పిస్తున్నాం. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి మా పార్టీ తరపున మద్దతు ప్రకటిస్తున్నాం. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలన్న ప్రతిపాదనకు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం. భారతరత్న పురస్కారానికి మనోహ్మన్‌సింగ్ అర్హులని భావిస్తున్నాం. ప్రభుత్వ ప్రకటనతో ఏకీభవిస్తున్నాం.
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ గొప్పదనాన్ని, సామర్థ్యాన్ని, తెలివితేటలను మొదటిసారిగా గుర్తించింది మన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు అనేది నిర్వివాదాంశం. పీవీ దేశ ప్రధానిగా ఎన్నికైన తర్వాత ల్యాట్రల్ ఎంట్రీ (రాజకీయాలతో సంబంధం లేనివారిని రాజకీయాల్లోకి తీసుకురావడం) ద్వారా రాజకీయాలతో సంబంధం లేని, ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన మంచి ఆర్థికవేత్తగా గుర్తించి మన్మోహన్‌ను ఆర్థికశాఖ మంత్రిగా నియమించారు.
మన్మోహన్సింగ్ 1991లో బడ్జెట్ ప్రవేశపెడుతూ.. ‘ప్రపంచం మొత్తం వినాల్సిన సమయం వచ్చింది-నా దేశం మేలొని ఉన్నది’ అంటూ గొప్పగా మాట్లాడారు. ఆ మాటలు.. ఆయన సిద్ధాంతం, నాటి పీవీ నరసింహారావు నాయకత్వం నేడు దేశంలో సమూలమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. 15 రోజులు మాత్రమే ఫారెక్స్ నిల్వలున్న ఆనాటి రోజు నుంచి ప్రపంచమంతా ఆశ్చర్యపడే స్థాయికి దేశాన్ని పరుగెత్తించిన ఆర్థిక సంసరణల శీలి డాక్టర్ మన్మోహన్సింగ్. అనవసరపు డాంభికాలు, ఆర్భాటాలు, హడావుడి లేకుండా ‘సింపుల్ లివింగ్.. హై థింకింగ్’ అనే మాటకు పర్యాయపదంగా మన్మోహన్సింగ్ను మనం చెప్పుకోవచ్చు. విశ్వాసం అనేది నేటి రాజకీయాల్లో చాలా అరుదైన పదం. తనకు అండగా నిలబడిన కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం సేవలందించిన మహానుభావుడు మనోహ్మన్‌సింగ్. ఆర్థికమంత్రిగా, తర్వాత ప్రధానిగా పదేండ్లు పనిచేసి, ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా పార్టీ కోసం పనిచేసిన, అవసరమైతే పూర్తి స్థాయిలో ప్రజాస్వామిక నిరసనల్లో పాల్గొన్న అభ్యుదయవాది, నిరాడంబర మనిషి మన్మోహన్ సింగ్.
ఆయన ప్రధానిగా ఉన్న కాలంలోనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏడాదిన్నరపాటు వారి క్యాబినెట్లో కేంద్రమంత్రిగా పనిచేశారు. నాటి కాంగ్రెస్ పార్టీ తో పొత్తు పెట్టుకుని గెలుపొందిన తర్వాత భాగస్వామ్య పక్షాలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కేసీఆర్‌కు షిప్పింగ్ మంత్రి పదవి ఇస్తే.. డీఎంకేతో చికుముడి ఏర్పడింది. యూపీఏలో ప్రధాన భాగస్వామ్య పక్షం డీఎంకే అభ్యంతరం లేవనెత్తింది. తమకు హామీనిచ్చి వారికి ఎలా ఇస్తారని అభ్యంతరం వ్యక్తం చేస్తే కేసీఆర్ క్షణం కూడా సంకోచించకుండా మన్మోహన్ సింగ్ వద్దకు వెళ్లి ‘నేను వచ్చింది పదవుల కోసమో, పోర్ట్‌ఫోలియోల కోసమో కాదు, నేను వచ్చింది తెలంగాణ కోసం’ అని చెప్పి కేసీఆర్.. ఆ మంత్రిత్వ శాఖను డీఎంకేకు ఇచ్చారు.
ఈ సందర్భంగా ‘ఏ నిబద్ధతతో వచ్చారో, అది ఫలించాలని కోరుకుంటున్నాన’ని మన్మోహన్ కేసీఆర్‌తో అన్నారు. ‘మీరు తీసుకున్న నిర్ణయంతో గుర్తింపు వస్తుంది, మీరు కర్మయోగిగా గుర్తించబడతారు’ అని అన్నారు. ఒక గొప్ప ఆలోచనకు అరుదైన సంద ర్భం వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ శక్తీ దానిని ఆపలేదు. దీన్ని మన్మోహన్సింగ్ బలంగా నమ్మారు కాబట్టే తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిబద్ధత, ఉద్యమానికి ఉన్న బలం, తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తి.. అన్నీ ఆయనకు అర్థమయ్యాయి. కాబట్టే అనివార్య పరిస్థితుల్లో మన్మోహన్సింగ్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పడింది. దాన్ని మేం మరిచిపోం.
మన్మోహన్సింగ్ నిబద్ధతను గుర్తు చేసే సందర్భంలో సరిగ్గా ప్రధానిగా వారు ఎన్నికైన ఆరు నెలలకు.. క్యాబినెట్ సహచరుడిగా 2004, డిసెంబర్ 18 (సరిగ్గా 20 ఏండ్ల కిందట) ముఖ్యమైన డెలిగేషన్ తీసుకొస్తున్నారని, తమకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరారు. బలహీన వర్గాలకు చెందిన ఆర్.కృష్ణయ్య, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు వంటి నాయకులను తీసుకొస్తున్నా తమకు ఐదు నిమిషాలు సరిపోదని 30 నిమిషాలు కావాలని కోరారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న నాటి ప్రధాని వారికి 45 నిమిషాల సమయం ఇచ్చారు. ఓబీసీలకు అన్ని రాష్ర్టాల్లో మంత్రిత్వ శాఖలున్నాయి. కేంద్రంలో ఓబీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఉండాలని వారు చెప్పడంతో 45 నిమిషాల సమయం ఇచ్చిన మన్మోహన్సింగ్ గంటన్నరపాటు వారితో గడిపి సమస్యను పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారు. చూస్తానంటూ హామీనిచ్చారు. ఇది ఆయన గొప్పతనానికి నిదర్శనం.
ఎన్నో అడ్డంకులు, ఎన్నో అభ్యంతరాలున్నా మన్మోహన్సింగ్ ప్రజా ఉద్యమాలకు అండగా నిలబడ్డారు. ఎన్నడూ, ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా సంసరణల బాట నుంచి వెనకి తగ్గలేదు. ఆయన్ని మనం ‘సైలెంట్ ఆరిటెక్ట్ ఆఫ్ మాడ్రన్ ఇండియా’ అని పిలువవచ్చు. ఆయన మన్మోహన్ కాదు, మౌన మోహన్ సింగ్ అని, మౌన ముని అని పేర్లు పెట్టారు. అయితే, అవేవీ పట్టించుకోకుండా ఆయన తన పని తను చేసుకుంటూ పోయారు. విప్లవాత్మకమైన సంసరణలు తీసుకువచ్చారు. ఎంతో మంది అనేక రకాలుగా అవమానించే ప్రయత్నం చేసినా ఆయన పట్టించుకోకుండా ముందుకువెళ్లారు. అవమానిస్తే ఆకాశం స్థాయి తగ్గదు. ఎన్ని నిందలు వేసినా మహోన్నతులు వణకరు, బెణకరు. అలాంటి స్థితప్రజ్ఞతను మనం మన్మోహన్‌సింగ్‌లో చూశాం.
మన్మోహన్ సింగ్ గురించి మాట్లాడుకునేటప్పుడు మన తెలుగు బిడ్డ.. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు గురించి కూడా గుర్తుచేసుకోవాలి. మన్మోహన్‌ను రాజకీయాల్లోకి తీసుకువచ్చిందే పీవీ. కేసీఆర్ ఆదేశాల మేరకు నేను, మా పార్టీ రాజ్యసభ సభ్యుల బృందం ఢిల్లీకి వెళ్లి మన్మోహన్‌సింగ్‌కు ఘనంగా నివాళులర్పించాం. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నాం. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించాం. మా సానుభూతి వ్యక్తం చేశాం. ఢిల్లీలో మన్మోహన్‌సింగ్‌కు జరిగిన గౌరవప్రదమైన వీడోలు మన పీవీకి జరుగలేదనే బాధ కలిగింది.
మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలని, విగ్రహం పెడతామని సీఎం ప్రకటించారు. మేం స్వాగతిస్తున్నాం. ఆయా కార్యక్రమాల్లో మేం కూడా పాల్గొంటాం. మనవాడైన పీవీ నరసింహారావుకు కూడా ఢిల్లీలో స్మారకం ఏర్పాటుచేయాలని తెలంగాణ శాసనసభ తీర్మానం చేయాలి. మన తెలుగు, తెలంగాణ బిడ్డకు సముచిత గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనే ప్రతిపాదన అసెంబ్లీ నుంచి పంపిస్తే బాగుంటుంది. ఢిల్లీలో ప్రధానులందరికీ స్మారకం ఉన్నది. పీవీకి మాత్రమే లేదు.
అది మనకు అవమానం, తీరని లోటు. ఈ తీర్మానంతో పాటు దానిని కూడా జతపరిచి పంపించినట్టయితే మన గౌరవం కూడా పెరుగుతుంది. సీఎం ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాం.
(బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం నుంచి…)=
– కల్వకుంట్ల తారక రామారావు