రణ భూమిని నిశ్శబ్దం ఆవరించింది
రుణ శేషం ఇంకా మిగిలే వుందని
ఆయుధాలకు తెలియదు కాబోలు
మౌనం మీదేసుకొని కునుకు తీసాయి
ప్రకృతి చల్లబడిపోయినా
ఎక్కడో ఒకచోట లీలగా మూలుగు
వినిపిస్తూనే వుంటుంది
లోయలన్నీ స్తబ్దుగా వుండిపోయినా
ఏదో ఒక పక్క పొగ వాసన
యుద్ధాన్ని గుర్తుచేస్తూ వుంటుంది
ప్రస్తుతానికి ప్రాంతం చప్పబడినా
ఎక్కడో ఒక పక్క
దేహపు ఛాయ కనిపిస్తూనే ఉంటుంది
యుద్ధ విరమణే గానీ
పగిలిన రాతి గుర్తు
గుండెను తడుతూనే వుంటుంది
అతివల నుదుటిపై సిందూరం
ప్రతీకారపు జ్వాలాగ్ని
నిరంతరం రగులుతూనే ఉంటుంది
మదమెక్కిన మనసు
ముడుచుకొని కూర్చోదు
మరిపించి మారణహోమానికి
పదును పెడుతూనే వుంటుంది
మౌనంలోనే
మూడో కన్ను గురిపెట్టి చూడకపోతే
మరో క్షిపణి విరుచుకుపడుతుంది
ఇప్పుడక్కడ
యుద్ధపు గురుతులు చెరిగిపోలేదు
ఇప్పుడు అంతటా నిశ్శబ్దమే కావచ్చు
శత్రుమూక తోక జాడించక ముందే
ఆయుధాలను తట్టిలేపాలి
సిందూరం భారతావని నుదుటిపై
వీరతిలకమై మెరవాలి
– నరెద్దుల రాజారెడ్డి 96660 16636