సిద్దిపేట అంటేనే పోరాటాల గడ్డ. ఎన్నో ఉద్యమాలు ఆ మట్టిలోనే పురుడుపోసుకున్నాయి. పద్నాలుగేండ్ల పాటు కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో ముందుండి నడిచిన సిద్దిపేట, ఆ తర్వాత పదేండ్ల ప్రగతిపథంలోనూ అందరికీ ఆదర్శంగా నిలిచింది. అలాంటి సిద్దిపేట గడ్డ కాంగ్రెస్ కుతంత్రాలకు, డైవర్షన్ రాజకీయాలకు వేదికగా మారడం గమనార్హం.
Congress | అబద్ధపు హామీలతో అందలమెక్కిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకైనా తన తీరును మార్చుకోవడం లేదు. దుష్ప్రచారాలు చేస్తూ అభూత కల్పనలను సృష్టిస్తున్నది. ఇంకా చెప్పాలంటే.. అధికార పీఠమెక్కాక ఆ పార్టీ ఆగడాలకు అడ్డే లేకుండాపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చేయనట్టు, పూర్తికానటువంటి రుణమాఫీ పూర్తయినట్టు ప్రచారం చేయడమే అందుకు నిదర్శనం.
రాజకీయాల్లో విమర్శలు-ప్రతివిమర్శలు, ఆరోపణలు-ప్రత్యారోపణలు, సవాళ్లు-ప్రతిసవాళ్లు సహజం. కానీ, అవి కాస్త హద్దు మీరితేనే అసలు సమస్య. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్, మాజీ మంత్రి హరీశ్‌రావు చేసుకున్న సవాల్ గురించి తెలిసిందే. ఇచ్చిన మాటను నిలబెట్టుకోని కాంగ్రెస్ సర్కార్ సిద్దిపేటలో దాడులకు తెగబడుతూ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతు న్నది. ఓ దిక్కు రైతులందరికీ రుణమాఫీ చేయా లని ప్రతిపక్ష బీఆర్ఎస్ పోరాడుతుంటే.. ఇంకో దిక్కు హరీశ్‌రావు రాజీనామా చేయాలంటూ కాం గ్రెస్ నానా హంగామా చేస్తున్నది. ఆ పార్టీ నాయకులు ఏకంగా సిద్దిపేట ఎమ్మెల్యే కార్యాల యంపై దాడిచేసి చర్చను పక్కదోవ పట్టించారు. దీనంతటి వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుసు.
ఒకేసారి రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి.. 22 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేసిన కాంగ్రెస్ సర్కార్ సుమారు 60 శాతం మంది రైతులకు కుచ్చుటోపీ పెట్టింది. రూ.17 వేల కోట్ల రుణాలనే మాఫీ చేసినట్టు సీఎం రేవంత్ చెప్తుండటమే అందుకు నిదర్శనం.
హరీష్‌రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయడం హాస్యాస్పదం. పంద్రాగస్టులోపు రైతులందరి రుణాలను మాఫీ చేయాలని, ఆరు గ్యారంటీలను అమలుచేయాలని ఆయన సవాల్ చేశారు. ఇప్పటికీ ఆ మాట మీదే నిలబడ్డారు. చెప్పింది చేయలేకపోయిన కాంగ్రెస్ నేతలే మాట తప్పి ప్రభుత్వ ఆస్తులపై దాడులకు పాల్పడుతున్నారు. అసలు హరీశ్‌రావు సవాలు చేసిన అంశాన్ని పూర్తిస్థాయి లో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు. వాటిలో ముఖ్యమైన రుణమాఫీ అసలు పూర్తికాలేదు. ఇక, ఆరు గ్యారంటీలను వేరే చెప్పనక్కర్లేదు.
తమ నిర్వాకంతో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని గ్రహించిన కాంగ్రెస్ దాడులను ప్రోత్సహిస్తున్నది. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై శుక్రవారం అర్ధరాత్రి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడటం శోచనీయం. కార్యాలయం ధ్వంసం అవుతుండగా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ఈ ఘటన వెనుక కాంగ్రెస్ రాష్ట్ర నేతల హస్తం ఉన్నదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ వస్తున్నది. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులపై నిందారోపణలు చేస్తూ దాడులకు ఉసిగొల్పుతున్నది. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చ.
రుణమాఫీ విషయమై ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు నిలదీస్తుంటే కాంగ్రెస్ సర్కార్‌కు మింగుడు పడటం లేదు. ప్రతీ రైతు రుణాన్ని మాఫీ చేస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన 8 నెలలకు గాని రుణమాఫీ ప్రక్రియ చేపట్టలేదు. అది కూడా కొర్రీలు పెట్టి, కోతలు కోశారు. క్యాబినెట్ సమావేశంలో రూ.31 వేల కోట్లు, బడ్జెట్ సమయంలో రూ.26 వేల కోట్లు అని చెప్పిన రేవంత్.. చివరాఖరికి రూ.17 వేల కోట్ల రుణాలనే మాఫీ చేశారు. 45 లక్షల నుంచి 22 లక్షలకు లబ్ధిదారుల సంఖ్యను పరిమితం చేశారు. ఇంకా సగం మంది రుణాలు మాఫీ కాలేదు.
ఈ విషయమై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ బాణం ఎక్కుపెట్టింది. రైతుల పక్షాన నిలిచింది. కేటీఆర్, హరీష్‌రావు, ఎమ్మెల్యేలు, నాయకులు ఊపిరాడకుండా చేస్తుండటంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడిపోయింది. అందుకే బీఆర్ఎస్ నేతలపై దాడులకు దిగుతున్నది. అధికార పార్టీ నాయకులే ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేస్తుంటే బాధితులను ఎవరు కాపాడాలి? ప్రజల ఆస్తులను ఎవరు రక్షించాలి? ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. వీటిని ప్రజాస్వామికవాదులు ఖండించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమం త్రే బాధ్యత తీసుకోవాలి.
ఒకవేళ హరీశ్‌రావు రాజీనామా చేస్తే.. ఆయనను మళ్లీ అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు సిద్దిపేట ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ, బీఆర్ఎస్ బీఫామ్‌తో గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి పోటీలోకి దింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం గా ఉందా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తు న్నా? సదరు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఎవరిపక్షాన ఉన్నరనే విషయం తేలిపోతుంది. అంతేకానీ, చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందు కు ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్ప డుతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. కాంగ్రె స్ పార్టీకి తగినరీతిలో బుద్ధి చెపారు.
– చిటుకుల మైసారెడ్డి 94905 24724