ప్రధాని, కేంద్రమంత్రులు, ఎంపీలపై వెల్లువెత్తే అవినీతి ఆరోపణలపై విచారణ జరపడానికి వారిని లోక్‌పాల్, లోకాయుక్త చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. 2013 డిసెంబర్ 17న రాజ్యసభలో, డిసెంబర్ 18న లోక్‌సభలో ఈ బిల్లు పాసైంది. 2014 జనవరి 1న రాష్ట్రపతి ఆమోదం తర్వాత, 2014 జనవరి 16 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ప్రధానిని జవాబుదారీగా చేయడమే లక్ష్యమైతే, లోక్‌పాల్ చట్టాన్ని అమలుచేయవచ్చు. కానీ, ఈ చట్టం గత 11 ఏండ్లుగా అమలుకాలేదు. ఎందుకంటే, పీఎం కేర్స్ ఫండ్, ఎలక్టోరల్ బాండ్లు, రాఫెల్ ఒప్పందం వంటి వాటిపై వచ్చిన ఆరోపణలు లోక్‌పాల్ పరిధిలోకి వస్తాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 20న లోక్‌సభలో ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు బహుశా కొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చేందుకు, ఒక దారి మళ్లింపు వ్యూహంగా కనిపిస్తున్నది.
ప్రధానిని తొలగించే బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడమనేది పతాక శీర్షికలకు ఎక్కేందుకు పన్నిన చాకచక్యమైన వ్యూహం. పైకి కనిపిస్తున్నట్టు కాకుండా లక్ష్యం వేరే ఉంది. కానీ, ఫోకస్ మాత్రం తప్పుదారి పట్టించేలా ఉంది. ప్రతిపక్ష పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఇప్పుడు బీజేపీ సర్కారుకు లక్ష్యంగా మారారు. వీరిపై గతంలో నమోదైన ఏదైనా పెండింగ్ కేసును తిరగదోడి బలవంతంగా ఈ చట్టాన్ని అమలు చేసే అవకాశం లేకపోలేదు.
30 రోజులపాటు జైలులో ఉంటే ప్రధాని లేదా కేంద్రమంత్రి లేదా ముఖ్యమంత్రిని ఆ పదవి నుంచి తొలగించాలనే నిబంధన వెనుక ఈ వ్యూహామే ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. ఉపా, మనీ లాండరింగ్ లాంటి చట్టాల కింద నమోదైన కేసుల్లో ఈ నిబంధనను ఉపయోగించి కనీసం ఆరు నెలల పాటు ముఖ్యమంత్రికి బెయిల్ రాకుండా నిరాకరించవచ్చు. ఎన్నికలు లేకుండానే 30 రోజుల్లోనే ప్రభుత్వ మార్పును ఇది సులభతరం చేస్తుంది. పైగా ఎలాంటి ఆదేశాలు అవసరం లేకుండానే ఈ ప్రక్రియ జరిగిపోతుంది. ఒకవేళ ఏదైనా కేసులో ప్రధాని జైలులో ఉండి 31వ రోజున ఆ పదవి నుంచి తొలగించబడితే, 130వ రాజ్యాంగ సవరణ బిల్లులో పేర్కొన్నట్టు.. ప్రధాని మాత్రమే కాదు, మొత్తం ప్రభుత్వమే కుప్పకూలిపోతుంది. ఇది మానవ విశ్వాసాన్ని అత్యంత అధమస్థాయికి లాగేయడమే. వాస్తవానికి ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టడమే ఇలాంటి మార్గాల అసలు లక్ష్యం. ఇది దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరింతగా క్షీణింపజేస్తుంది.
సంచలనం కోసం మాత్రమే ప్రధాని పేరును కూడా ఈ బిల్లులో చేర్చారని చెప్పవచ్చు. ఇలాంటి పలుచనైన బిల్లులో ప్రధానిని కూడా చేర్చడం వెనుక ఈ వ్యూహం కాకపోతే ఇంకేం ఉంటుంది? దేశ ప్రధానిని ఒక ఎఫ్ఐఆర్ ఆధారంగా, దర్యాప్తు లేకుండా, న్యాయపరమైన విచారణ చేయకుండా, కోర్టులో దోషిగా నిర్ధారణ కాకుండా పదవి నుంచి తొలగించడం సాధ్యం కాదు. ఒకవేళ తొలగించాల్సి వస్తే, అది అత్యంత దారుణమైన జంగిల్‌రాజ్ అవుతుంది. కేంద్రం లేదా రాష్ర్టాల్లోనైనా అత్యున్నత స్థాయి కార్యనిర్వాహక పదవిలో ఉన్న వ్యక్తిని ఇలాంటి సాధారణ మార్గంలో తొలగించడం పార్లమెంటరీ వ్యవస్థను అపహాస్యం చేస్తుంది. ఆరోపణల ఆధారంగా, వాటిని దర్యాప్తు చేయకముందే, న్యాయపరమైన విచారణ జరగకముందే, కోర్టులో దోషిగా తేలకముందే తొలగింపు జరగాలని చెప్పడం విషాదకరం.
ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ జైలుపాలైన నేపథ్యంలో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు అత్యంత ప్రమాదకరమైనదిగా అనిపిస్తున్నది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ కూడా గతంలో జైలుపాలైన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఈ బిల్లు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులను ఆ పదవుల నుంచి తొలగించే వ్యూహంగా కనిపిస్తున్నది.
పార్లమెంటరీయేతర మార్గాల ద్వారా ప్రధానిని, ముఖ్యమంత్రిని తొలగించడం గురించి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. లోక్‌పాల్‌పై అన్నాహజారే చేసిన ఉద్యమాన్ని బీజేపీ-ఆప్ నాడు అవినీతికి వ్యతిరేకంగానే నిర్వహించాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నీరుగారుస్తూ పార్లమెంటరీయేతర మార్గాల్లో ప్రధానిని తొలగించాలన్న లక్ష్యంతోనే వారు ఉద్యమించారు. కాంగ్రెస్ సర్కారు లోక్‌పాల్‌ను చట్టంగా చేసింది. కానీ, లోక్‌పాల్ కోసం ఉద్యమం చేసిన బీజేపీ దాన్ని మూలన పడేసింది. మరోసారి పార్లమెంటరీ యేతర మార్గాల్లో ప్రధాని, ముఖ్యమంత్రిని తొలగించాలనే లక్ష్యంతో ఇప్పుడు 130వ రాజ్యాంగ సవరణ బిల్లు చుట్టూ మరో ప్రచారం చేస్తున్నారు.
ఇది ఆందోళన కలిగించే ధోరణి. దేశంలో దశాబ్దాలుగా ఎంతో కష్టపడి కాపాడుకుంటూ వస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేసే సామర్థ్యం ఈ బిల్లుకు ఉంది. గతంలో లోక్‌పాల్ ఉద్యమం కూడా ఇదే రకమైన లక్ష్యంతో జరిగింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ఈ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించినట్టు కనిపిస్తున్నది. నిజాయితీగా చెప్పాలంటే, దేశంలో ఏ పోలీస్ స్టేషన్లోనైనా ప్రధానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆయనను అరెస్టు చేసి 30 రోజులపాటు జైలులో ఉంచడం సాధ్యపడుతుందా? మన దేశంలో బ్రిటిష్ మోడల్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమల్లో ఉన్నది. ఈ విధానం ప్రకారం కేంద్రంలో ప్రధాని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి సభల్లో విశ్వాసాన్ని కలిగి ఉన్నంతకాలం వారు అధికారంలో ఉంటారు. వారిని ఆ పదవి నుంచి తొలగించాలంటే.. వానాకాలం లేదా శీతాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానాన్ని సభ ఆమోదించాల్సి ఉంటుంది. లేదా బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక బిల్లు, ఏదైనా ద్రవ్య బిల్లు సభలో వీగిపోయేలా చేయాలి. ఇది చట్టబద్ధమైన మార్గం.
జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపిన ఈ బిల్లు ప్రధాని లేదా కేంద్ర మంత్రిని, రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా మంత్రిని తొలగించేందుకు ఉద్దేశించినది. ఒకవేళ బెయిల్ లభించకపోతే 31వ రోజున ఆటోమేటిక్‌గా వారు తమ పదవుల నుంచి తొలగించబడతారు. అందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 (కేంద్ర మంత్రి కోసం), 164 (రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా మంత్రి కోసం), 239ఏఏ (కేంద్రపాలిత ప్రాంతం ప్రతినిధి కోసం) ఆర్టికల్స్‌ను సవరించాల్సి ఉంటుంది. దోషిగా నిర్ధారణ అయ్యేంత వరకు నిర్దోషిగానే భావించాలనేది న్యాయశాస్త్రంలో మూల సూత్రం. అయితే, ఈ బిల్లు ఈ సూత్రాన్ని నీరుగారుస్తున్నది. అంతేకాదు, తాను నిర్దోషి కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా విచారణ ఎదుర్కొనేవారిపైనే ఉంటుంది. ఆ నిరూపణ కూడా సందేహాలకు అతీతంగా ఉండాలి.
సుదీర్ఘకాల నిర్బంధ కాలానికి ఇలా చట్టపరమైన ఆమోదం ఇవ్వడం సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం. విచారణకు ముందు నిర్బంధం ఒక రకమైన శిక్షగా భావిస్తే అది నిర్దోషి, నేరస్థుడికి మధ్య ఉన్న సన్నని గీతను చెరిపివేస్తుంది. ఉపా, మనీ లాండరింగ్ లాంటి భయంకరమైన చట్టాల ద్వారా నిర్బంధ కాలాన్ని పొడిగించడమే లక్ష్యంగా కనిపిస్తున్నది. ఈ చట్టాలను ఉపయోగించి నిర్బంధ కాలాన్ని పొడిగించవచ్చు, పదవి నుంచి తొలగించడానికి ఆధారంగానూ ఉపయోగించుకోవచ్చు. ఇటువంటి చర్యలు, వ్యూహాలు దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదులను శాశ్వతంగా దెబ్బతీస్తాయి.