అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్వాశ్రమంలో వ్యాపారవేత్త. ఇంకా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో దిగ్గజంగా పేరు తెచ్చుకున్నారు. అమెరికాలో వెలిసిన ట్రంప్ టవర్లే అందుకు నిదర్శనాలు. రియల్ రంగంలో కార్యసాధనకు సామ, దాన, భేద, దండోపాయాలు వినియోగించడం తెలిసిందే. ఇందులో ట్రంప్ రెండాకులు ఎక్కువే చదివారు. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచీ ప్రపంచ దేశాలపై ఆయన టారిఫ్ యుద్ధం ప్రకటించారు. ముఖ్యంగా తమకు అనుకూలమైన రాజకీయ, ఆర్థిక విధానాలు అనుసరించని దేశాలపై ఆయన ప్రతీకార, జరిమానా సుంకాలు వడ్డిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తున్నందుకు ఆయన ఇండియాపై 25 శాతం ప్రతీకార సుంకం, రష్యాతో వ్యాపార, వాణిజ్యాలు నెరపుతున్నందుకు మరో 25 శాతం ఇలా మొత్తం 50 శాతం సుంకాలు వడ్డించారు. ఈ సుంకాలు అమెరికా మార్కెట్‌పై ఆధారపడిన భారతీయ పరిశ్రమలు, ముఖ్యంగా వస్ర్తాల ఎగుమతి రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కోట్లాదిమంది కార్మికుల ఉపాధిని ఇది దెబ్బతీస్తున్నది. యంత్ర తయారీ, ఎలక్ట్రానిక్స్, ఆభరణాలు, వాహనాలు తదితర పరిశ్రమలు వెలవెలబోతున్నాయి. తమ ఆదాయం సగానికి పడిపోయినట్టు 34 శాతం కంపెనీలు ప్రకటించడం ఆందోళన కలిగిస్తున్నది. తమిళనాడులో చర్మశుద్ధి కర్మాగారాలు ఎక్కువగా ఉండే అంబూర్-రాణిపేట బెల్టులోని 300 పరిశ్రమల్లో 50 దాకా మూతపడ్డాయి. ఆక్వా, టైక్స్టైల్స్ రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇవన్నీ కూడా అసంఘటిత రంగానికి చెందినవి కావడంతో వాటిపై ఆధారపడిన పేద, కార్మిక వర్గాలు తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి.
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన టారిఫ్ యుద్ధం ఇప్పుడు మలి దశకు చేరుకున్నట్టు కనిపిస్తున్నది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలుపెట్టినప్పుడు రష్యాపై అమెరికా ఆంక్షలు విధించింది. మిత్రదేశమైన రష్యాను ఆదుకునే లక్ష్యంతో భారత్ చమురు దిగుమతులను పెంచింది. అంతేకాదు, డాలర్‌ను పక్కనపెట్టి రూపాయల్లో లావాదేవీలు నిర్వహించుకోవడానికీ అంగీకరించాయి. రష్యా మొత్తం చమురు ఎగుమతుల్లో ఇండియా వాటా 40 శాతానికి చేరింది. ఒక్క చమురే కాదు, రష్యా నుంచి ఎస్-400 క్షిపణుల వంటివి కొనడం, రష్యాతో కలిసి డాలర్ మారకం ముగించడానికి బ్రిక్స్‌లో భాగంగా చేస్తున్న భారత ప్రయత్నాలను కూడా ట్రంప్ ఏ మాత్రం సహించడం లేదు. వీటన్నిటి ఫలింతగానే భారత్‌ను తన దారికి తెచ్చుకునేందుకు ఆయన ఎత్తుగడలు వేస్తున్నారు. తాజాగా రష్యన్ ఆయిల్ కంపెనీలపై విధించిన ‘అదనపు ఆంక్షలు’ ఆ కోవలోనివే. విశేషించి భారత్‌ను కట్టడి చేసేందుకే ఆయన వీటిని ప్రయోగించారని తెలుస్తూనే ఉంది. ‘నా మంచి మిత్రుడు మోదీ’ అంటూ భారత ప్రధానిపై ఓవైపు నర్మగర్భితంగా ప్రశంసలు కురిపిస్తూనే ఆయన ఈ జరిమానా, ప్రతీకార సుంకాలను వేసి, ఒత్తిళ్లు పెంచుతున్నారు. రష్యా చమురు కొనుగోళ్లను మోదీ తగ్గించుకుంటున్నారని కూడా ఇటీవలే ఆయన బహిరంగంగా మీడియా ముందరే తనదైన తరహాలో ప్రకటించారు. భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని లెక్కలేనన్ని సార్లు ప్రకటించిన ట్రంప్‌కు ఇదొక లెక్క కానే కాదు. ఇది భారత నాయకత్వాన్ని ఇరకాటంలో పడేసే విషయం. ట్రంప్ ఇంత చేస్తున్నా మోదీ ఖండించలేకపోవడం విడ్డూరం.
ట్రంప్ రెండోసారి ఆంక్షలు విధించిన రష్యా కంపెనీలతో చమురు వ్యాపారం చేస్తే భారత్‌కు ఇతరేతర వాణిజ్యపరమైన సమస్యలు తలెత్తుతాయనేది ఇక్కడ కీలకం. ఎందుకంటే డాలర్ ఆధిపత్యం అంతర్జాతీయ మార్కెట్లో ఇంకా ప్రబలంగానే కొనసాగుతున్నది. రూపాయలతో రష్యా చమురును కొనుగోలు చేసినా ఇతర దేశాల వాణిజ్యానికి డాలర్ వాడకం తప్పనిసరి. దీనిని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ మలి దశ ఆంక్షలు విధించారు. వీటి కారణంగానే భారత్ చమురు కంపెనీలు- పబ్లిక్, ప్రైవేటు రంగం- రెండూ రష్యా చమురును వదిలించుకుంటున్నాయి. దీనిని బహిరంగంగా వెల్లడించకుండా కేంద్ర ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతున్నది. గుట్టుచప్పుడు కాకుండా భారత చమురు కంపెనీలు రష్యా కంపెనీలకు ఆర్డర్లు చాలావరకు తగ్గించడం లేదా పూర్తిగా నిలిపివేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అంతర్జాతీయ ఆంక్షలను గౌరవిస్తామని భారత చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ ముక్తసరిగా ప్రకటించడం గమనార్హం. రిలయన్స్ సంస్థ కూడా అలాంటి ప్రకటనే చేసి చేతులు దులిపేసుకుంది. అంటే కాగల కార్యం ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే జరిగిపోతున్నదన్నమాట. ఇది దేశానికి సంబంధించిన సమస్య. ఇంత కీలక సమయంలో గుట్టుచప్పుడు కాకుండా ఉండిపోయి, తెరవెనుక తతంగం నడిపించడం భావ్యం కాదు. దీనిపై దేశ ప్రజలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.