ఒకప్పుడు గంభీరంగా సాగిన మన కరెన్సీ ప్రయాణం నేడు డాలర్ ముందు మోకాళ్లపై నిలబడే పరిస్థితికి చేరింది. రూపాయి విలువ మరో 20 పైసలు క్షీణించిందని తెలుసుకున్నప్పుడు అది కేవలం ఒక అంకె అని అనుకుంటాం. కానీ, ఆ అంకె వెనుక ఉన్నది కోట్లాది మంది భారతీయుల కన్నీళ్లు, పెరిగిన కిరాణా బిల్లులు, భారమైన చమురు ధరలు.
ఒకప్పుడు ఒక డాలర్‌కు రూ.45 నుంచి 50 ఉండేది. కానీ నేడు అది 90 దాటి 95 మధ్య ఊగిసలాడుతున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం అబ్బే..అంతర్జాతీయంగా డాలర్ బలపడుతున్నదని, అందుకే రూపాయి తగ్గుతున్నదని చాలా క్యాజువల్‌గా సమాధానం చెప్తున్నది. కానీ ఇది సగం నిజం మాత్రమే. మిగిలిన సగం లోపభూయిష్టమైన కేంద్ర ఆర్థిక విధానాలు, అనాలోచిత నిర్ణయాలు. ఈ అగాధం వెనుక ఉన్న అసలు కారణాలు, మోదీ సర్కార్ ఆర్థిక ప్రయోగాలను విశ్లేషించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
2016 నవంబర్ 8..దేశ ఆర్థిక చరిత్రలో ఒక చీకటి రోజు. ప్రధాని మోదీ ఒక్క ప్రకటనతో దేశంలోని 86 శాతం నగదును రద్దు చేశారు. నల్లధనం పోతుందని, తీవ్రవాదం అంతమవుతుందని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కానీ రిజర్వ్ బ్యాంక్ గణాంకాలే ఆ హామీల బుగ్గను పేల్చేశాయి. రద్దయిన నోట్లలో 99.3 శాతం మళ్లీ బ్యాంకులకు చేరిపోయాయి. అంటే నల్లధనం ఎక్కడికి పోయింది? అదంతా తెల్లగా మారిపోయిందా? ఈ ప్రయోగం వల్ల సామాన్యుడికి ఒరిగిందేమీ లేదు. కానీ, చిన్న వ్యాపారాలు, అసంఘటిత రంగం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. సుమారు 1.5 మిలియన్ ఉద్యోగాలు గాలిలో కలిసిపోయాయని సీఎంఐఈ నివేదికలు ఘోషిస్తున్నాయి. ఒక దేశం కరెన్సీపై నమ్మకం ఆ దేశ ఆర్థిక స్థిరత్వంపై ఆధారపడి ఉంటుంది. నోట్ల రద్దుతో ఆ నమ్మకం మొదటిసారిగా బీటలు వారింది. అది రూపాయి పతనానికి పునాది వేసింది.
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఒక విప్లవాత్మకమైన అడుగు కావాల్సి ఉన్నది. కానీ సరైన సన్నద్ధత లేకుండా, సంక్లిష్టమైన పన్ను విధానాలతో చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఈఎంఈ) రంగాన్ని మోదీ సర్కార్ ఊపిరాడకుండా చేసింది. 28 శాతం గరిష్ట పన్ను స్లాబులు, పదే పదే మారే నిబంధనలు, సాంకేతిక లోపాలతో కూడిన జీఎస్టీఎన్ పోర్టల్..ఇవన్నీ వ్యాపారులకు నరకాన్ని చూపించాయి. లక్షల సంఖ్యలో చిన్న చిన్న పరిశ్రమలు మూతపడటంతో ఉత్పత్తి తగ్గింది.
రూపాయి బలహీనతకు ప్రధాన శత్రువు వాణిజ్య లోటు. అమ్మేదాని కంటే కొనేది ఎక్కువగా ఉన్నప్పుడు డాలర్లు ఖర్చయిపోతుంటా యి. చమురు, బంగారం, ఎలక్ట్రానిక్స్ కోసం మనం భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని చెల్లిస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా నినాదాలు బాగా నే ఉన్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో తయారీ రంగం వాటా 2014 కంటే మెరుగుపడలేదు సరికదా..ఇంకా కుంచించుకుపోయింది. చైనా వంటి దేశాలతో పోలిస్తే ఎగుమతుల్లో మనం వెనుకబడిపోవడం వల్ల రూపాయికి డిమాండ్ తగ్గి, డాలర్‌కు డిమాండ్ పెరుగుతున్నది. ఫలితంగా రూపాయి పాతాళానికి చేరుతున్నది.
ప్రభుత్వం తమ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వల గురించి గొప్పగా చెప్పుకుంటుంది. కానీ అందులో అధిక భాగం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు కాదు, విదేశీ సంస్థాగత పెట్టుబడులు. దీనిని ‘హాట్ మనీ’ అంటారు. అంటే మార్కెట్లో ఏ చిన్న కుదుపు వచ్చినా ఈ పెట్టుబడిదారులు తమ డబ్బు తీసుకుని విదేశాలకు చెక్కేస్తారు. 2022-23 మధ్యకాలంలోనే దాదాపు 116 బిలియన్ డాలర్ల నిల్వలు హరించుకుపోయాయి. రూపాయి పడిపోకుండా కాపాడటానికి ఆర్బీఐ డాలర్లను మార్కెట్లో అమ్ముకుంటూ వస్తున్నది.
2014లో బీజేపీ పగ్గాలు చేపట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వ అప్పు సుమారు రూ.56 లక్షల కోట్లు. నేడు అది ఏకంగా రూ.170 లక్షల కోట్లు దాటిపోయింది. అంటే ప్రతి భారతీయుడి తల మీద సగటున రూ.1.2 లక్షల అప్పు వేలాడుతున్నది. ఈ అప్పులకు వడ్డీలు కట్టడానికే బడ్జెట్లో సింహభాగం పోతున్నది. విదేశీ పెట్టుబడిదారుల దృష్టిలో ఒక దేశం అప్పుల్లో కూరుకుపోయి ఉందంటే, ఆ దేశ కరెన్సీకి విలువ తగ్గుతుంది. దేశంలో ఏటా కోటి మందికి పైగా యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే, కేంద్రం మాత్రం వారి ఆకలికేకలను పట్టించుకోవడం లేదు. నిరుద్యోగం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది, ఇది ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను తగ్గిస్తుంది. ఆర్థిక వ్యవస్థ మందగించినప్పుడు కరెన్సీ విలువ పెరగడం అసాధ్యం.
రిజర్వ్ బ్యాంక్ దేశ ఆర్థిక వ్యవస్థకు వాచ్డాగ్ వంటిది. కానీ బీజేపీ హయాంలో దీని స్వాతంత్య్రం ప్రమాదంలో పడింది. ఉర్జిత్ పటేల్ వంటి మేధావులు మధ్యలోనే రాజీనామా చేయడం దీనికి నిదర్శనం. ఆర్బీఐ వద్ద ఉన్న మిగులు నిధులను ప్రభుత్వం బలవంతంగా తీసుకోవడం, వడ్డీ రేట్ల విషయంలో రాజకీయ జోక్యం చేసుకోవడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో మన బ్యాంకింగ్ వ్యవస్థ విశ్వసనీయత దెబ్బతిన్నది. భారతదేశం ఆత్మ గ్రామాల్లో ఉన్నది. కానీ ఆ గ్రామాల్లోని రైతులు నేడు అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ సర్కార్, వ్యవసాయ చట్టాల పేరుతో వారిని రోడ్డు మీదకు తెచ్చింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే, దేశం అంతర్గత బలం పోతుంది. ఆహార ద్రవ్యోల్బణం పెరగడం వల్ల సామాన్యుడు విలవిల్లాడుతుంటే, రూపాయి బలంగా ఉంటుందని ఆశించడం అత్యాశే అవుతుంది.
రూపాయి ఎందుకు పడిపోతున్నదని అడిగితే..యుక్రెయిన్ యుద్ధం, అమెరికాలో ఫెడ్ రేట్ల పెంపు అని ప్రభుత్వం చెప్పే సమాధానం కుంటి సాకు మాత్రమే. అవును, అవి కారణాలే కావచ్చు, కానీ మిగిలిన దేశాల కరెన్సీల కంటే రూపాయి వేగంగా పతనమవుతున్నది? ఎందుకంటే మన ఆర్థిక పునాదులు బలహీనంగా ఉన్నాయి. మన ప్రభుత్వం అంతర్గత వ్యవస్థలను సరిచేయకుండా కేవలం విదేశీ కారణాలను ఎండగట్టడం అంటే తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడమే.
రూపాయి విలువ పడిపోవడం వల్ల అత్యధికంగా నష్టపోయేది మధ్యతరగతి, పేద వర్గాలే. దిగుమతి చేసుకునే ముడిచమురుకు ఎక్కువ ధర చెల్లించాలంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల ఫీజులు భారీగా పెరుగుతాయి. బయటి దేశాల నుంచి వచ్చే ప్రాణరక్షక మందుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతాయి.
రూపాయి విలువ పతనం కేవలం గణాంకాల సమస్య కాదు, అది దేశ సార్వభౌమాధికారం, ఆర్థిక భద్రతకు సంబంధించిన విషయం. కానీ మోదీ సర్కార్ వాస్తవాలను దాచిపెట్టి, కేవలం ప్రచారంతో కాలం గడుపుతున్నది. నోట్ల రద్దు నుంచి జీఎస్టీ వరకు వారు చేసిన ప్రయోగాలు వికటించాయి. అప్పుల భారం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం మన దేశాన్ని పీడిస్తున్నాయి. ఒక దేశం కరెన్సీ ఆ దేశ గౌరవానికి చిహ్నం. ఆ గౌరవం నిలబడాలంటే కేవలం మాటలు సరిపోవు, పారదర్శక పాలన, బలమైన ఆర్థిక సంస్కరణలు అవసరం. కరెన్సీ పడిపోతుంటే దేశం కూడా తిరోగమనంలో పయనిస్తున్నట్టే లెక్క. దీనిని ప్రజలు ప్రశ్నించాలి, నిగ్గదీయాలి. ఎందుకంటే ఇది మన దేశం, ఇది మన రూపాయి, ఇది మన భవిష్యత్తు!
-చైతూ