న్యూఢిల్లీ: కుటుంబ సంక్షేమ ప్రయోజనాల విషయంలో పెండ్లయిన కుమార్తెలకు న్యాయం చేసేలా తాజాగా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఓ బాధితురాలి విషయంలో గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. కేవలం వివాహం జరిగిందనే కారణంతో కుమార్తెలను కారుణ్య నియామకాల నుంచి మినహాయించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఇది సమానత్వ సూత్రాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నది. గుజరాత్‌కు చెందిన కుల్సుమ్ నిషా తన తల్లికి చెందిన చౌకధరల సరుకుల దుకాణ లైసెన్స్‌ను ఆమె మరణాంతరం తనకు కేటాయించాలని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంది.
దీనిని అధికారులు తిరస్కరించారు. కుటుంబ నిర్వచనం నుంచి పెండ్లయిన బిడ్డలను పక్కనపెడుతూ 2019లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం లైసెన్స్ ఇవ్వలేమని తెలిపారు. దీంతో కుల్సుమ్ అలహాబాద్ హైకోర్టు మెట్లెక్కారు. అయితే అధికారుల ఆదేశాలనే అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. దీంతో ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.