‘గురుకుల పిల్లలు వాళ్ల టాయిలెట్ వాళ్లు కడుక్కుంటే తప్పేముంది? చపాతీలు చేయడం నేర్చుకుంటే తప్పేముంది? వాళ్లేమైనా సంపన్న వర్గాల (పోష్ సొసైటీ) నుంచి వచ్చారా కూర్చున్న టేబుల్ మీదికే అన్నీ రావడానికి? ఈ పనుల గురించి వాళ్ల తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి ప్రశ్నిస్తే వాళ్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చి బయటకు గెంటేయండి. వినకపోతే ఎఫ్ఐఆర్ బుక్ చేయండి’ అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిసున్న సీఎం రేవంత్‌రెడ్డి వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిణి తమ సిబ్బందికి ఇటీవల మౌఖిక ఆదేశాలు ఇచ్చారు.
వంటశాల, శానిటేషన్ పనులను పర్యవేక్షించే 261 మంది అసిస్టెంట్ కేర్టేకర్లను రాత్రికిరాత్రే నిర్దాక్షిణ్యంగా తొలగించేశారు. ఒక ప్లంబర్, ఎలక్ట్రీషియన్‌ను మూడు పాఠశాలల పనులు చేయాలంటున్నారు. మెస్ కమిటీలను ఏర్పాటు చేసి పిల్లల పర్యవేక్షణలోనే అన్ని పనులూ జరగాలంటున్నా రు. ‘నెలకు ఇరవై ముప్పై గంటల చదువు పోతే ఏం నష్టం జరుగుతుంది’ అని తమ చర్యలను గట్టిగా సమర్థించుకుంటున్నారు. పేద వర్గాల మీద తాము చేస్తున్న కుట్రలు బయట పడేసరికి ఎటూ పాలుపోక ప్రవీణ్ కుమారే పిల్లలకు విషాహారం పెట్టించారని మొదట నాపై నిందలు మోపారు, ఇప్పుడు ‘ప్రవీణ్ కుమార్ హయాంలో ఏకంగా రూ.వంద కోట్ల అవినీతి జరిగింది’ అని విషప్రచారం చేస్తున్నారు.
ఈ కుట్ర మీద రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాల్సిందే. గతంలో కేసీఆర్ హయాంలో ఈ బిడ్డల సర్వతోముఖాభివృద్ధి ఏ విధంగా జరిగిందో కొన్ని ఉదాహరణలు చెప్తాను. కొన్నేండ్ల క్రితం బీసీ రజక బిడ్డ అగసార నందినిని కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రీడా పథకం ద్వారా శిక్షణకు పంపిస్తే, ఆమె భారతదేశానికి ఎన్నో పథకాలను సాధించారు. ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో దేశానికి బంగారు పతకం గెలిచారు. అతి చిన్న వయస్సులో ఎవరెస్ట్ ఎక్కి ప్రపంచ రికార్డు నెలకొల్పిన మాలోతు పూర్ణ నుంచి స్కైడైవింగ్ చేసిన దర్శనాల సుష్మ, పైలట్లు, నేవీ కెప్టెన్లుగా పనిచేస్తున్న అమ్మాయిల వరకు అనేక అద్భుతాలు.. నేను గురుకులాల సెక్రెటరీగా ఉన్నపుడు నాటి కేసీఆర్ ప్రభుత్వ సహాయంతో చేయగలిగాం.
పాఠశాల ప్రాంగణంలో హార్వర్డ్, కేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డ్ వంటి ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల గురించి చెప్పేవాళ్లం. విద్యార్థులకు వారి తల్లిదండ్రులు గుర్తుకురాకుండా చక్కగా చూసుకునేవాళ్లం. అందువల్లనే గత పదేండ్లలో గురుకులాల నుంచి ఎంతో మంది డాక్టర్లు, ఇంజినీర్లు, ఆర్మీ కెప్టెన్లు తయారయ్యారు. ‘మేం ఏదైనా చేయగలం’ అని ఆలోచించే విధంగా పిల్లలను ప్రోత్సహించేవాళ్లం. అంతేకానీ, ‘వ్యక్తిత్వ వికాసం’ కోసం ‘చెత్త ఊడ్చాలి, బాత్రూమ్లు కడుక్కోవాలి, తరగతి గదులు క్లీన్ చేసుకోవాలి’ అని ఏనాడూ చెప్పలేదు.
ఇవన్నీ ఎలా చేసుకోవాలో ఆ బిడ్డలకు పేద తల్లిదండ్రులు బాల్యం నుంచి నేర్పిస్తారని ఆ సమాజం నుంచి వచ్చిన నాకు తెలుసు. పిల్లలకు సరైన ఆహారం పెట్టడంలో ఏనాడూ వెనక్కి తగ్గలేదు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గురుకులాల పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వందలాది గురుకులాల్లో విషాహారం తిని గత విద్యాసంవత్సరంలో 85 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులు మరణిస్తున్నా అధికారులపై చర్యలు గాని, మార్పులు గాని చెయ్యలేదు.
ఎస్సీ వర్గాలకు చెందిన ప్రజలే దేశంలో మెజారిటీ సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి. చివరికి జైళ్లలోనూ ఆ వర్గాల ఖైదీలతోనే మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్నారని సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. తమ పిల్లలకైనా ఇలాంటి పాచి పని నుంచి విముక్తి కల్పించి, గొప్ప స్థానాల్లో చూడాలని తల్లితండ్రులు గురుకులాలకు పంపితే, ఇక్కడ కూడా పిల్లలు అదే పని చేయాలని చెప్పడం దేనికి సంకేతం? కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వర్గాల ప్రజలు తరతరాలుగా ఒకే పని చేస్తూ బతకాలని చెప్తున్నదా? ఇలాంటి వివక్షాపూరితంగా, అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన అధికారిణిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే అది నిజమేనని నమ్మక తప్పడం లేదు. సెక్రెటరీ స్థాయి అధికారిణి అవమానించడమే కాకుండా తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం, గతంలో అక్రమాలు జరిగాయని నిరాధారమైన అరోపణలు చేస్తూ, విజిలెన్స్ విచారణ చేయిస్తామని అసలు విషయాన్ని పక్కదోవ పట్టించడం విస్మయం కలిగిస్తున్నది.
ఒక పక్క కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంటే, తెలంగాణలో అదే కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగంలోని సమానత్వపు హక్కు ఆర్టికల్ 14, అంటరానితనాన్ని నిషేధించే ఆర్టికల్ 17, ఆత్మగౌరవంతో జీవించే హక్కు ఆర్టికల్ 21లను కాలరాస్తున్నది.
సీఎం రేవంత్ ‘నేనే పెద్ద మాదిగ, నేనే పెద్ద మాల’ అని ఉపన్యాసాలు ఇస్తూనే, మరోపక్క అధికారులతో పేద పిల్లలను అవమానాలకు గురిచేస్తున్నారు. ఇది ఆయనకు పేద వర్గాలపై ఉన్న ప్రేమ, చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది. గురుకులాలను నిర్వీర్యం చేసి పేద వర్గాలను చదువుకు దూరం చేయడమే రేవంత్ లక్ష్యం. 12 గురుకుల జూనియర్ కాలేజీలను రద్దు చేయాలని చూశారు. ఇప్పటివరకూ గురుకుల డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించలేదు.
బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఆర్మీ డిఫెన్స్ డిగ్రీ ప్రిపరేటరీ కళాశాలను ఎత్తేశారు. వందలాది మంది డాక్టర్లను అందించిన గౌలిదొడ్డి వంటి గురుకుల కళాశాలల్లో ఇపుడు బైపీసీ గ్రూపు లేకుండా కుట్ర చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఇందుకోసమేనా కాంగ్రెస్‌ను గెలిపించుకున్నది? పిల్లలతో టాయిలెట్లు కడిగించాలని చెప్పడమేనా మార్పు? విషాహారం పెట్టడమేనా ప్రజాపాలన? కాంగ్రెస్ నాయకుల పిల్లలు చదివే పాఠశాలల్లో వాళ్లే టాయిలెట్లు కడుగుతున్నారా? పోనీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసే అధికారులు వారి ఆఫీసుల్లో చీపురు పట్టి ఊడుస్తారా? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ఇంట్లో బాత్రూం క్లీన్ చేసుకుంటారా? పేద పిల్లలపైనే ఈ ప్రయోగాలు చేయాలా?
అగసార నందిని ఇటీవల సీఎంను కలిశారు. గతంలో నిఖత్ జరీన్, సిరాజ్ వంటి క్రీడాకారులకు ఇచ్చినట్టు గ్రూప్-1 ఉద్యోగం, నగదు బహుమానం, హైదరాబాద్‌లో ఇల్లు వంటి ప్రకటనలు తనకు కూడా వస్తాయని ఆశించారేమో కానీ, అలాంటివేమీ జరగలేదు. సీఎంతో ఫొటో తీసి పంపించేశారు. ఈ రాష్ట్రంలో పేద వర్గాల పిల్లలను, ముఖ్యంగా గురుకులాల్లో చదివిన విద్యార్థులను రేవంత్ సర్కార్ పట్టించుకోదు సరికదా, అవమానిస్తుందని బహుశా నందినికి, మరెందరో తల్లిదండ్రులకు తెలియదేమో. తల్లిదండ్రులారా.. మీ పిల్లల భవిష్యత్తు పట్ల జాగ్రత్త.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ నాయకులు)
– డా.ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్