e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home ఎడిట్‌ పేజీ దిక్సూచి ప్రాంతీయ పార్టీలే

దిక్సూచి ప్రాంతీయ పార్టీలే

దిక్సూచి ప్రాంతీయ పార్టీలే

దేశంలో జాతీయ పార్టీలను కాదని ప్రాంతీయ పార్టీలకు ప్రజలు పట్టం కట్టడం 1950 దశకంలోనే మొదలైంది. తమిళనాడులో 1949 అన్నాదురై నాయకత్వలో ‘ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)’ ఏర్పడి అధికారంలోకి వచ్చింది. అన్నాదురై (1967-69) ఆయన చనిపోయేవరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇదే పార్టీ తరఫున కరుణానిధి తెరమీదికొచ్చి ఐదుసార్లు సీఎం అయ్యారు. ప్రస్తుతం ఆయన కుమారుడు ఎం.కె.స్టాలిన్‌ ముఖ్యమంత్రిగా పదవిని అలంకరించబోతున్నారు. 1963లో ఏర్పడిన మహారాష్ట్ర వాది గోమంతక్‌ పార్టీ గోవాలో కొంతకాలం అధికారంలో ఉండగా 1972లో తమిళనాడులో ఏర్పడిన ‘అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం’ డీఎంకేకు ప్రతిగా అధికారాన్ని కొనసాగించింది.

1972లోనే శిబూ సోరెన్‌ నాయకత్వంలో జార్ఖండ్‌ ముక్తి మోర్చా, 1982లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, 1984లో ఉత్తరప్రదేశ్‌లో బహుజన్‌ సమాజ్‌ వాది పార్టీ, 1985లో అస్సాం గణ పరిషద్‌, 1992లో యూపీలో సమాజ్‌ వాదీ పార్టీ, 1997లో బీహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్‌, ఒడిషాలో బిజూ జనతాదళ్‌, 1998లో బెంగాల్‌లో ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌, 1999లో దేవెగౌడ, నితీష్‌ కుమార్‌లు వేర్వేరుగా జనతాదళ్‌ సెక్యులర్‌, జనతాదళ్‌ యునైటెడ్‌ పార్టీలు ఏర్పాటుచేసి అధికారం చేపట్టారు. 2001లో రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి, 2009లో ఏర్పడిన వైఎస్‌ఆర్‌సీపీ, 2012లో ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీలు ప్రాంతీయ పార్టీలుగా ఏర్పడిన తర్వాతనే ఆయా రాష్ర్టాల్లో ప్రజానుకూలమైన సంక్షేమ పాలన అందుతున్నది. ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటూ పథకాలకు రూపకల్పన చేసి అద్భుత రీతిలో అమలు చేస్తూ ప్రజానుకూల పాలన అంది స్తున్నారు. మహారాష్ట్రలో శివసేన, నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీలు, జమ్మూకశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, మిజోరంలో మిజో నేషనల్‌ ఫ్రంట్‌ తదితర ప్రాంతీయ పార్టీలకు కూడా ప్రజల్లో ఆదరణ ఉన్నది.

బెంగాల్‌లో మమతా బెనర్జీ 3వ సారి గెలవడానికి కారణం ఆ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలే ప్రధాన కారణం. ఆడపిల్లల కోసం రూపొందించిన ‘కన్యశ్రీ ప్రకల్ప’, 9,10,11,12 తరగతులు చదువుతున్న పిల్లలకు ‘సబుజ్‌ సాథీ’ పేరుతో సైకిళ్ల పంపిణీ, ‘గీతాంజలి’ పేరుతో బలహీన వర్గాలకు గృహ నిర్మాణాలతో పాటుగా మరొక ఇరవై పథకాలతో బెంగాల్‌ ప్రజలు మమతా బెనర్జీని దూరం చేసుకోలేదు. ప్రధాని మోదీ 26 సార్లు బెంగాల్‌లో పర్యటించినా మమతా బెనర్జీని 215 సీట్లతో అందలమెక్కించారు. కేరళలో ఇటీవల వచ్చిన వరదల వల్ల జరిగిన నష్టాన్ని సమర్థంగా ఎదుర్కోవడం, దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ను తన రాష్ట్రంలో వ్యాపించకుండా తీసుకున్న నిర్మాణాత్మకమైన చర్యలు పినరయి విజయన్‌ విజయానికి కారణమయ్యాయి. తిరుపతిలో జరిగిన ఎన్నికలో వైఎస్‌ఆర్‌సీపీ గెలవటానికి ‘నాడు నేడు’ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్న పథకాలే కారణం.

ఇక తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవంటే అతిశ యోక్తి కాదు. ఇక్కడ అమలవుతున్న ‘రైతుబంధు’, ‘మిషన్‌ భగీరథ’లు ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకున్నాయి. టీఆర్‌ఎస్‌ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నాగార్జునసాగర్‌ ఎన్నికలే కాదు, పుర పోరులో జరిగిన ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయ దుందుభి మోగించటానికి కారణమయ్యాయి. విపక్షాలు ఎంత విష ప్రచారం చేసినా టీఆర్‌ఎస్‌ అఖండ విజయం సాధించటానికి అభివృద్ధి సంక్షేమ పథకాలే కారణమని వేరే చెప్పవలసిన అవసరం లేదు.

మరో ప్రాంతీయ పార్టీ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఢిల్లోలో విలక్షణ పాలన తీరుతో ప్రజలను అలరిస్తున్నది. విద్యార్థులకు, మహిళలకు ఢిల్లీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించడం, రేషన్‌ను నేరుగా వినియోగదారుల ఇండ్ల వద్దకే వెళ్లి ఇవ్వటం, ఉచిత మంచినీటి సరఫరా లాంటివెన్నో ఉన్నాయి. ఒడిషాలో 2003 నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు నవీన్‌ పట్నాయక్‌ అమలుచేస్తున్నారు. ప్రతి కుటుంబానికి ఐదు లక్షలు అందేవిధంగా రూపొందించిన ‘బిజూ స్వాస్థ్య కళ్యాణ్‌ యోజన’ ఆ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వంపై భరోసా ఏర్పడింది

ఇవన్నీ స్పష్టమైన సంకేతాలే. ప్రజలు నాన్‌ కాంగ్రెస్‌, నాన్‌ బీజేపీ పార్టీలను కోరుకుంటున్న స్థితి కనిపిస్తున్నది. ఈ సమయంలో కేసీఆర్‌ లాంటి దూరదృష్టిగల నాయకత్వం అవస రమని దేశం నలుమూలలా కోరుకుంటున్న స్థితి ఉన్నది. దీనికి కారణం అనేక సంక్షేమ పథకాల అమలు, సాగునీటి ప్రాజెక్టులతో రాష్ర్టాన్ని ధాన్యాగారంగా మార్చిన తీరు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలవటమే. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, రైతుబంధు పథకాలతో పాటుగా వివిధ రాష్ర్టాల్లో ప్రజల ఆదరణ చూరగొన్న మంచి పథకాలను ఒక దండగా కూర్చి వాటిని దేశం మొత్తంలో అమలుకావాలంటే అందరూ కేసీఆర్‌ వైపే చూస్తున్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు దేశ వ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో అవసరం ఉన్నది.

కరువు పీడత ప్రాంతాలను సస్యశ్యామలం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. అలాంటి ప్రాజెక్టులే దేశ ఆహార ఉత్పత్తిని మూడింతలు చేస్తాయి. ఈ దిశగా ప్రస్తుతం కేంద్రంలోని నేతలు ఆలోచిం చటానికి బదులు పెత్తనం ఉన్నదని అన్ని పరిశ్రమలను మూసివేసుకుంటూ పోతున్నారు. అన్నింటినీ ప్రైవేటుపరం చేస్తూ నిరుద్యోగం పెంచుతున్నారు. మతం ఒక్కటే కాదు, దేశంలో చాలా సమస్యలున్నాయి. ఒక నూతన భారతదేశాన్ని నిర్మించే దశలో కేసీఆర్‌ లాంటి భవిష్యత్‌ దర్శనం గల నేత కావాలి. అప్పుడే దేశం అభివృద్ధి పథాన పరుగులు తీస్తుంది. 2024 సాధారణ ఎన్నికల నాటికి చారిత్రక అవసరంగా సరికొత్త నాయకత్వం పురుడు పోసుకో వాలని దేశ ప్రజానీకం ఆశాభావంతో ఉన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరే చారిత్రక భౌతిక పరిస్థితులు నేడు పరిపక్వంగా ఉన్నాయి.

-కన్నోజు మనోహరా చారి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దిక్సూచి ప్రాంతీయ పార్టీలే

ట్రెండింగ్‌

Advertisement