Telangana Assembly | రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తుంటే వెగటు కలుగుతున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలు అపహాస్యమైపోతున్నాయా? అన్న అనుమానం వస్తున్నది. రాజకీయ విన్యాసాలతో, నేతల పరస్పర దూషణలతో చట్టసభలు రచ్చ సభలుగా మారిపోయాయి. రాజకీయాలు ఇంత నీచంగా తయారయ్యాయా? అన్న బాధ మనసును తొలిచేస్తున్నది. అధినాయకుడి ముందు స్వామిభక్తి ప్రదర్శించడం కోసం పోటీపడుతున్న నేతల పోకడలను చూస్తే వీళ్లు ప్రజాప్రతినిధులా, లేదా! అన్న భావన కలుగుతున్నది.
ప్రజాస్వామ్యంలో చట్టసభలకు ఉండే ప్రాధాన్యం అంతాఇంతా కాదు. అవి ప్రజా సమస్యలు, ప్రజల వాణిని తెలియజెప్పే వేదికలు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి మాత్రం చట్టసభల మీద ఏ మాత్రం గౌరవం లేదు. ఎన్నికల తర్వాత జరిగిన మొదటి శాసనసభ సమావేశాల్లో అతి ఆర్భాటంగా తప్పుడు శ్వేతపత్రాలతో కేసీఆర్ సర్కార్‌ను బద్నాం చేయాలన్న దుగ్ధ తప్ప తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి, ప్రజల అభ్యున్నతికి పునాదులు వేయాలన్న సంకల్పం ఎక్కడా కనిపించలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ప్రణాళికలు, పాలసీల గురించి వివరించి ప్రజలకు భరోసా కల్పించాల్సిందిపోయి.. గత ప్రభుత్వం ఇట్ల చేసింది, అట్ల చేసింది అంటూ కేసీఆర్ సర్కార్‌పై దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేసింది. శ్వేతపత్రాలపై చర్చలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు ధాటికి అధికార పక్షం తెల్లమొహం వేసింది.
ప్రస్తుత సమావేశాల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ నిలదీయడంతో రేవంత్ సర్కార్ అంతర్మథనంలో పడిపోయింది. బడ్జెట్ సెషన్లో పద్దుల మీద జరగాల్సిన చర్చ హద్దులు దాటింది. తమ వైఫల్యాలను ప్రధాన ప్రతిపక్షం ఎండగడుతుంటే అధికారపక్షానికి ఆవేశమే మిగిలింది. సీరియస్ అంశాలపై సీనియర్ సభ్యులు మాట్లాడుతున్న ప్రతీసారి స్వయంగా ముఖ్యమంత్రే జోక్యం చేసుకొని విషయాన్ని పక్కదారి పట్టించడం ఈ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు నుంచే కనిపించింది. హోదాను మరిచి ముఖ్యమంత్రి, మంత్రులు చిల్లర వ్యాఖ్యలకు దిగారు. సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా సభలో నోరుపారేసుకున్నారు.
రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ఆమెతో పాటు ఎమ్మెల్యే సునీతాలక్ష్మా రెడ్డిని ఉద్దేశించి మాటలు జారారు. ‘నమ్మితే నిండా ముంచే అక్కలు’ అంటూ మహిళా నేతల విశ్వసనీయతపై విషం కక్కారు. వారి మాట వింటే జూబ్లీ బస్టాండేనంటూ వీధి భాషను వాడారు. శాసనసభ సమావేశాలను వీక్షిస్తున్న వేలమంది ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా విస్తుపోయారు. ఆ సంగతలా ఉంటే.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై బూతులతో రెచ్చిపోయారు. ‘నీ అమ్మ.. మిమ్మల్ని బయట తిరగనివ్వా’ అంటూ స్పీకర్ ముందే వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ నగర అభివృద్ధిపై జరిగిన చర్చను ప్రారంభించిన దానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పరుష పదజాలంతో దూషించారు. ‘నీ యమ్మ.. తోలు తీస్తా’ అంటూ సభాసాక్షిగా బెదిరింపులకు దిగారు.
ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిన ప్రతీసారి సీఎం రేవంత్ తనకుండే అధికారాన్ని ఉపయోగించి అబద్ధాలతో సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఒక అంశంపై చర్చ జరుగుతుండగానే ఆ అంశానికి సంబంధం లేని అంశాన్ని తీసుకొచ్చి ఏదో ఒక కాగితం పట్టుకొని చదువుతూ సభను తప్పుదారి పట్టించారు. సభా నాయకుడిగా పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రే మూడు అంశాల్లో సభను తప్పుదోవ పట్టించారు.
సాగునీటి అంశంపై చర్చ జరుగుతుండగా ‘రిటైర్డ్ ఇంజినీర్లు సూచించిన లేఖ ఇది’ అంటూ అందులోని అనుకూలమైన అంశాన్ని మాత్రమే సీఎం చెప్పారని హరీశ్‌రావు పేర్కొన్నారు. మేడిగడ్డ నుంచి డైరెక్ట్‌గా మిడ్‌మానేరుకు నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదు.. మధ్యలో ఎన్టీపీసీ ఉన్నది, బొగ్గుబావులున్నాయి, కరెంట్ వైర్లున్నాయి. ఇక్కడి నుంచి నేరుగా మిడ్‌మానేరు దాకా తీసుకుపోవడం సాధ్యం కాదని రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పారని తెలిపారు. దీనిని వదిలేసి ‘అసలు మేడిగడ్డ ఫీజిబుల్ కాదు’ అని రిటైర్డ్ ఇంజినీర్లు అన్నారంటూ సభను సీఎం తప్పుదోవ పట్టించారు.
విద్యుత్తు అంశంపై చర్చ సందర్భంగా ‘మీరు మోటర్లకు మీటర్లు పెడ్తామని ఒప్పందం చేసుకున్నారు’ అంటూ ఓ లేఖను రేవంత్ చదివి వినిపించారు. కానీ, అదే లేఖలోని ‘అదర్ దేన్ అగ్రికల్చర్ కనెక్షన్ (వ్యవసాయేతర కనెక్షన్లు)’ అన్న పదాన్ని తెలివిగా వదిలేసి చదివారు. ఇలా ముఖ్యమంత్రే సభను తప్పుదారి పట్టిస్తే చట్టసభలకు విలువ ఉంటదా? ప్రజలు అధికారం ఇచ్చింది మంచి పాలన చేయాలని. అంతేకానీ, ప్రతిపక్ష సభ్యుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కాదు. ఇప్పటికైనా రేవంత్ తన తీరును మార్చుకోవాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టిసారించాలి.
(వ్యాసకర్త: ఆలేరు మాజీ ఎమ్మెల్యే)
– బూడిద బిక్షమయ్య గౌడ్