‘పేనుకు పెత్తనమిస్తే తెల్లవార్లూ నెత్తంతా కొరికినట్టు’ సీఎం రేవంత్‌రెడ్డి కక్షసాధింపు రాజకీయాల చుట్టూ పరిభ్రమిస్తున్నారు. మోసకారి మాటలు, మాయదారి హామీలతో గద్దెనెక్కింది అందుకే అని నిస్సిగ్గుగా చాటుకుంటున్నారు. సంక్షేమం సడుగులిరిగింది. పరిపాలన పడకేసింది. పిల్లలకు ఫీజుల్లేవు. పెద్దలకు పింఛన్లు లేవు. ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి లేదు. పసిబిడ్డలకు కేసీఆర్ కిట్లు లేవు. రైతుకు పంటసాయం లేదు. ఇవేవీ తనకు పట్టనే పట్టవు. కేవలం సింగిల్ పాయింట్ ఎజెండా – టార్గెట్ కేసీఆర్. ఎందుకు? ఎందుకు అంత పగ? ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ కోసం నిలబడినందుకు.
ప్రతీప శక్తులతో కలబడినందుకు. అసాధ్యమన్న తెలంగాణను సుసాధ్యం చేసినందుకు. సాధించిన తెలంగాణను సమున్నతంగా నిలబెట్టినందుకు. తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా, ఆత్మగౌరవ పతాకగా రెపరెపలాడుతున్నందుకు. నీతికి, న్యాయానికి నిలువెత్తు రూపం అయినందుకు. తెలంగాణకు చెరగని సంతకం అయినందుకు. ఇంకా పగ ఎందుకంటే కన్నపు దొంగల్ని కన్నంలోనే పట్టుకున్నందుకు. గురుశిష్యులిద్దరికీ గుండుగుత్తగా గడ్డి పెట్టినందుకు. తెలంగాణ ద్రోహులను సరిహద్దు ఆవలికి తరిమి కొట్టినందుకు.
సీఎం రేవంత్‌కు కేసీఆర్ అనే మూడక్షరాలు ఇప్పటికీ సింహస్వప్నమే. అందుకే నిరంతర కేసీఆర్ నామజపంతో వైరభక్తి చాటుకుంటున్నారు. గెలిచానని, సీఎం గద్దెనెక్కానని ఇంకా ఆయనకు నమ్మకం కుదురుతున్నట్టు లేదు. ’ఎక్కడ చూస్తే అక్కడ నీవై’ అన్నట్టు కేసీఆరే కనిపిస్తున్నారు. బాహుబలి సినిమాలో భల్లాల దేవుడికి ఆకాశమంతై బాహుబలి కనిపించినట్టు రేవంత్‌కు తెలంగాణలో ఎటు చూసినా కేసీఆర్ కనిపిస్తున్నారు. జనం గుండె చప్పుడు కేసీఆర్ పేరును ప్రతిధ్వనిస్తాంటే తప్పుడు హామీలతో చేజిక్కించుకున్న అధికారం ఎప్పుడు చేజారుతుందోనని రేవంత్‌రెడ్డి కలవరపాటుకు గురవుతున్నారు. అందుకే చెరిపేస్తా, తుడిచేస్తా అని ఉన్మాదపు బూకరింపులు.
తెలంగాణ విజయసాధన శిలాఫలకం మీద ’కే సీ ఆర్’ అనే మూడక్షరాలను గీకేసేందుకు, గోకేసేందుకు ప్రయత్నించి గోళ్లూడగొట్టుకున్నారు రేవంత్. తెలంగాణ సోయి తనకు ఉద్యమమప్పుడు లేదు, ఇప్పుడూ లేదు. తెలిసిందల్లా సంచులు మోయడం. నిన్న గురువుకు తాబేదారు, నేడు అధిష్ఠానం పాలేరు. తెలంగాణ హక్కులను పళ్లెంలో పెట్టి గురుదక్షిణగా చెల్లించుకోవాలని తెగ ఆరాటం. కేసీఆర్, బీఆర్ఎస్ను ప్రజానీకం వెయ్యికండ్లతో కాపాడుతున్నంత కాలం అది అసాధ్యం. తెలంగాణ కేసీఆర్ అడుగుజాడ, పెట్టని కోటగోడ. అందుకే తెలంగాణ వ్యతిరేకులకు అంత పగ, ప్రతీకారేచ్ఛ. చెరిగిపోని చరిత్రను చెరిపేయాలని అక్కసు.
చేతకాని, చేవలేని పాలనతో రేవంత్ విఫల సీఎంగా మిగిలిపోయారు. అవాకులతో, చెవాకులతో, అడ్డగోలు బూతులతో ప్రజల దృష్టిలో పలుచనయ్యారు. తన గ్రాఫ్ రోజురోజుకూ అస్థిరం అవుతుంటే, కేసీఆర్ కీర్తి మరింత సుస్థిరం అవుతున్నది. తెలంగాణకు సొంతమనిషి కేసీఆర్. బీఆర్ఎస్ ఇంటిపార్టీ. విపక్షంలో ఉన్నా తమవంతు బాధ్యతగా సమస్యలపై పోరాడుతున్నది బీఆర్ఎస్. అక్రమార్క పాలనపై అడుగడుగునా నిలదీస్తున్నది. ప్రజాసమస్యలపై కదం తొక్కుతున్నది. భూమి బాగోతాల గుట్టు విప్పుతున్నది. స్కాములపై గళమెత్తుతున్నది. అటు మోసపోయి గోసపడుతున్న ప్రజలిప్పుడు కేసీఆర్ పాలననే గుర్తు చేసుకుంటున్నరు.
మరోసారి సారే కావాలని కోరుకుంటున్నరు. ఆ మాటే బాహాటంగా అంటున్నరు. సీఎం రేవంత్ గుండెల్లో దడ పుట్టిస్తున్నరు. అందుకే కేసీఆర్ అంటే అంత కక్ష. బీఆర్ఎస్పై కంటగింపు. ’అల్పబుద్ధివాని కధికార మిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు’ అన్నట్టు.. కేసులతో, నోటీసులతో వెంటాడుతున్నారు. విచారణల పేరిట వేధిస్తున్నరు. అందుకే కర్రుకాల్చి వాతపెట్టాలని ప్రజలు ఎప్పుడో తీర్మానించుకున్నరు. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నరు. పోలీసులను ప్రయోగించి ఎవరిని భయపెడుతారు? ఎంతకాలం భయపెడుతారు? తెలంగాణనైనా కేసీఆర్‌ను అయినా బలప్రయోగంతో లొంగదీసుకోవడం అయ్యే పనేనా? చరిత్రను చదవలేదా?