విత్తు నాటి, నీరు పోసి చెట్టును పెంచిందొకరు.. ఆ చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకునేది ఇంకొకరు అన్నట్టుగా ఉంది ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ వ్యవహారశైలి. ఉద్యోగాల భర్తీకి ఇదివరకటి కేసీఆర్ ప్రభుత్వం కసరత్తు చేస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు పంపిణీ చేసి అంతా తన ప్రయోజకత్వమేనని చంకలు గుద్దుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీచేసి, పరీక్షలు నిర్వహించి అంతా సిద్ధం చేసింది. ఎన్నికల కోడ్ కూయడంతో నియామక పత్రాల జారీని పక్కనపెట్టింది. ఇప్పుడా ఉద్యోగాల నియామక పత్రాల అందజేత పేరిట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్భాటం చేస్తున్నారు. నర్సింగ్, కానిస్టేబుల్, సింగరేణి, గురుకుల ఉద్యోగాల పత్రాలు అట్టహాసంగా పంపిణీ చేసి గత ప్రభుత్వ విజయాలను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఒక్క నోటిఫికేషన్ అయినా ఇవ్వకుండానే 70 రోజుల్లో 23 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకొంటున్నారు. ఎవరు పెంచిన చెట్టయితేనేం పండ్లు మన బుట్టలో వేసుకుంటే చాలని సంబురపడిపోతున్నారు. ఏదో లాంఛనంగా పత్రాలు అందజేస్తే సరిపోయేదానికి కూడా రాజకీయ రంగులద్ది వాగాడంబరం చూపిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం పూర్తిచేసిన భర్తీ వ్యవహారాన్ని తమ రెండు లక్షల ఉద్యోగాల హామీలో కలిపేసుకుంటున్నారు. ఉద్యోగార్థులు విద్యాధికులన్న సంగతి మరచిపోయి, అబద్ధాలతో వారి విజ్ఞతను పరీక్షిస్తున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం నడిచిందే నీళ్లు, నిధులు, నియామకాల నినాదాల మీద. తెలంగాణ ఏర్పాటుకు ముందర దశాబ్దకాలంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మొత్తం 24,086 ఉద్యోగాలు మాత్రమే. అందులో తెలంగాణ వాటా కింద దక్కినవి 10,080 మాత్రమే. కాగా, స్వరాష్ట్రం సాధించిన తర్వాత తొలి సీఎంగా కేసీఆర్ ఉద్యోగాల భర్తీని ప్రాధాన్యంతో కూడిన అంశంగా చేపట్టారు. చిరుద్యోగులకు జీతాలు పెంచారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. రాష్ట్ర ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేశారు. ఇక్కడి ఉద్యోగాల్లో 95 శాతం తెలంగాణ బిడ్డలకే దక్కేలా కొత్త జోనల్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. తెలంగాణకు ఉద్యోగాల విషయంలో శాశ్వతంగా న్యాయం జరిగేలా చూసేందుకు తలపెట్టిన ఈ ప్రయత్నాలు కేంద్రం సహాయ నిరాకరణ, సాంకేతికాంశాల కారణంగా ఆలస్యమయ్యాయి.
బీఆర్ఎస్ పాలనలో తొమ్మిదిన్నరేండ్లలో 2,32,308 ఉద్యోగాలకు ప్రభుత్వపరమైన అనుమతులు మంజూరు చేసి 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేశారు. అందులో 1,60,083 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తయింది. మరో 42,652 ఉద్యోగాల నియామక ప్రక్రి య జరుగుతుండగానే ప్రభుత్వం మారింది. ప్రైవేటు రంగంలో 22.5 లక్షల ఉద్యోగాలను కలుపుకొంటే మొత్తంగా 25 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టి ఉపాధి కల్పనలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు నిరుద్యోగంలో తొలి స్థానాలను ఆక్రమించడం గమనార్హం. బీఆర్ఎస్ రికార్డును కాంగ్రెస్ దాటడం మాటేమోగానీ అందుకోవడమే కష్టం. కేసీఆర్ నాటిన చెట్ల పండ్లను బుట్టలో వేసుకోవాలనే యావ సరే, జరగాల్సిన ప్రక్రియ మాటేమిటి అనేది ప్రశ్న. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రక్రియను సక్రమంగా, సమర్థంగా నిర్వహిస్తే అదే పదివేలని ఉద్యోగార్థులు అనుకుంటున్నారు. గురుకుల ఉద్యోగాల భర్తీలో జరిగిన గోల్‌మాల్‌పై అభ్యర్థులు ఆందోళన బాటపట్టడం మనం చూస్తున్నాం. ఇదిలా ఉంటే టెట్ నిర్వహించకుండానే మెగా డీఎస్సీ పేర కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థులతో ఆటలాడుకుంటున్నది. ఎన్నికల మ్యానిఫెస్టోలో నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ మాటే అనలేదని ప్రకటించడం విడ్డూరం. కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి లోపం, అనుభవరాహిత్యానికి ఇది అద్దం పడుతున్నది. ఆ సంగతి అలా ఉంచితే, ఇచ్చిన హమీ మేరకు ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేయాల్సి ఉంది. గత ప్రభుత్వంపై బురద జల్లడం మానుకొని తన ముందున్న కర్తవ్యంపై దృష్టి పెట్టడం అవసరం. విద్యాధికులను బూటకపు మాటలతో బోల్తా కొట్టించాలనుకుంటే కుదిరే పనికాదు. కొలువుల మీద కోటి ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు న్యాయం చేయడం తక్షణ అవసరం.