‘మళ్లీ మనమే గెలుస్తాం, పదవుల కోసం తొందర వద్దు, వేచి ఉండాలని’ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రి పదవులపై ఆశలు పెట్టుకొన్న ఎమ్మెల్యేలకు, నాయకులకు పదే పదే ఇదే మాట చెప్తున్నారు. అద్దంకి దయాకర్ పదమూడేండ్ల పాటు నిరీక్షించిన తర్వాత శాసనమండలి సభ్యత్వం దక్కిన విషయాన్ని ప్రస్తావిస్తూ అలా ఓపికతో నిరీక్షించినవారికే పదవులు దక్కుతాయంటున్నారు.
అధికారంలోకి వచ్చిన కొత్తలో పదేండ్లు అధికారంలో ఉంటామని చెప్పేవారు. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ వస్తున్నా కొద్ది మళ్లీ మనమే గెలుస్తామనే ఉపన్యాసం మరింత ఎక్కువ సాగుతుంది. మళ్లీ గెలుస్తామని సీఎం ఎంత గట్టిగా చెప్తున్నా, ఫీల్డ్‌లో వాతావరణం బాగా తెలిసిన ఎమ్మెల్యేలు, నాయకులు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ రాదని గ్రహించి మంత్రి పదవుల కోసం గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నా సీఎంపై ఎవరు విమర్శ చేసినా అధికారపక్షం నుంచి మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు మూకుమ్మడిగా దాడికి దిగేవారు. కానీ, రేవంత్‌ను కాంగ్రెస్ సీనియర్లు ఔట్ సైడర్గానే చూస్తున్నారు. ‘ప్రభుత్వం మీద, నా మీద విమర్శలు వచ్చినా స్పందించరా? నేనే సమాధానం చెప్పుకోవాలా?’ అని సమావేశాల్లో పార్టీ నాయకులను స్వయంగా ముఖ్యమంత్రి ప్రశ్నించే పరిస్థితి.
సాధారణంగా మంత్రివర్గ విస్తరణ అనే ప్రచారం జరిగినప్పుడల్లా పదవులు ఆశించేవారు విమర్శలు వినిపిస్తే విపక్షంపై మాటల యుద్ధానికి దిగేవారు. రేవంత్ పాలనలో అది కూడా కనిపించడం లేదు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నరవుతున్నది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి వర్గ విస్తరణపై విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. ఢిల్లీకి సీఎం వెళ్లినప్పుడల్లా మంత్రివర్గ విస్తరణ కోసమే అని ప్రచారం సాగింది. ఉగాదికి ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఢిల్లీ నుంచి మాత్రం సంకేతాలు ఏమీ అందడం లేదు. కాంగ్రెస్ ఇంచార్జిల మార్పు జరుగుతోంది కానీ, మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగడం లేదు. విస్తరణ ఊహాగానాలు వచ్చినప్పుడు సీఎం దృష్టిలో పడేందుకు నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక్కడ ఆ ప్రయత్నం కూడా ఏమీ లేదు. ‘నా చేతిలో ఏమీ లేదు, నిర్ణయం తీసుకునేది హై కమాండే’ అని స్వయంగా సీఎం రేవంత్ ప్రకటించారు. మంత్రివర్గంలోకి తీసుకునే అధికారం అయన చేతిలో లేనప్పుడు ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం ఎందుకు? వృథా ప్రయాస అనే ఆలోచనలో నాయకులున్నారు. ఏదేని రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత గతంలో సంప్రదాయం ప్రకారం ఢిల్లీ నాయకత్వం సీఎల్పీ నాయకుడి పేరును మాత్రమే ప్రకటిస్తుంది. దీనికి భిన్నంగా రాష్ట్రంలో తర్వాత తొలిసారిగా సీఎల్పీ నాయకునిగా రేవంత్‌రెడ్డి పేరును ఎన్నికల సమయంలో ప్రకటించడంతో పాటు ఒక్కరే నిర్ణయాలు తీసుకోవడమంటూ ఉండదని, సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటారని ఢిల్లీలో వేణుగోపాల్ ప్రకటించడం విడ్డూరం. దీంతో రేవంత్‌కు ముందే బ్రేకులు వేసి సీనియర్లను సంతృప్తి పరిచారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన చాలామంది నాయకులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు బోలెడు ఆశలు పెట్టుకొన్నారు.
కానీ, కాంగ్రెస్‌లో పరిస్థితి ఏమిటో వారికి తెలిసింది కాబట్టే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదని బహిరంగంగానే శాసనసభ్యులు ఈసారి విస్తరణలో తమకు అవకాశం ఇవ్వకపోతే ఊరుకునేది లేదని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. మూడు సార్లు మూడు పార్టీలు మారిన వారికి అవకాశం ఇస్తూ కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకొని ఉన్నవారికి అవకాశం ఇవ్వకపోతే సహించేది లేదంటున్నారు.
పదేండ్లు విపక్షంలో ఉండి కష్టపడితే తమను పక్కనపెట్టి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి దూరేవారికి ఎలా అవకాశం ఇస్తారని శాసనసభ్యులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి కాకపోతే వచ్చేసారి అవకాశం ఉంటుందిలే అనే నమ్మకం ఉంటే మరో రకంగా ఉండేవారు. ఈ ఐదేండ్లు పూర్తికావచ్చు కానీ, మళ్లీ వస్తామనే నమ్మకం వారిలో కనిపించడం లేదు.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో వరుసగా ఐదేండ్ల పాటు కరువు కాటకాలు, తెలంగాణ ఉద్యమం, విద్యుత్ ఉద్యమం-కాల్పులు వంటి తీవ్ర వ్యతిరేకతతో 2004లో బాబు ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 2004 నుంచి 2009 వరకు కరువు లేదు, మంచి వర్షాలు, అనేక సంక్షేమ పథకాలు అమలుచేశారు. బాబు హయాంలో రూ.150 పింఛన్ వైఎస్ఆర్ హయాంలో అడిగినవారికి లేదనకుండా పింఛన్ రూ.వెయ్యికి పెంచారు. ఫీజు రీ యింబర్స్‌మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తే, ప్రకృతి కరుణించి, మంచి వర్షాలు కురిస్తే కాంగ్రెస్‌కు బొటాబొటీనా 156 సీట్లు మాత్రమే వచ్చాయి. సాధారణ మెజారిటీకి ఎనిమిది సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. 2004లో 185 సీట్లు వస్తే అన్ని సంక్షేమ పథకాలు అమలుచేశాక 156 మాత్రమే వచ్చాయి. అదే టీఆర్ఎస్ విషయానికి వస్తే ఉద్యమపార్టీగా 2014లో 63 సీట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం మూడు సీట్లు ఎక్కువ వచ్చాయి. ఐదేండ్ల పాలనలో రైతుబం ధు, కల్యాణలక్ష్మి, రెండు వేల రూపాయల పింఛన్ వం టి పథకాలు, విద్యుత్ సంక్షోభ దశ నుంచి 24 గంటల విద్యుత్తు వరకు అభివృద్ధి పరంగా ఫలితంగా ఐదేళ్ల పాలన తరువాత 88 సీట్లలో విజయం సాధించారు.
ఇక ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోకి వస్తే అద్భుతాలు ఏం చేశారని మళ్లీ అధికారంలోకి వస్తారు. కొత్త పథకాల అమలు మాట దేవుడెరుగు గతంలో అమలుచేసిన పథకాలకే దిక్కులేదు. తులం బంగారం ఊసెత్తడం లేదు. రుణమాఫీ కొందరికే అమలు, రైతుబంధు జాడలేదు. దివాళా తీశామని ప్రతి సమావేశంలో జాతీయగీతంలా దివాళా గీతం ఆలపిస్తున్నారు. గత ప్రభుత్వం కన్నా అద్భుత పథకాలు అమలుచేసి, అద్భుతమైన ప్రగతి సాధించి ఉంటే మళ్లీ గెలుస్తారని చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. దివాళా తీశాం, ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నాం అని ఒకవైపు వాళ్లే చెప్తూ మళ్లీ వస్తాం అప్పుడు పదవులు ఇస్తాం అంటే ప్రజల మాట అటుంచి సొంత పార్టీ వాళ్లే నమ్మడం లేదు.
ఏడాదికో సారి సీఎంలను మార్చడం వల్ల 83లో ఎన్టీఆర్ పాతుకుపోవడానికి అవకాశం ఇచ్చామని కాంగ్రెస్ భావించడం వల్ల ఆ తర్వాత సీఎంలను మార్చలేదు. వైఎస్ఆర్ మరణంతో మార్పు అనివార్యమైంది. మహా అయితే ఎన్నికల వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండవచ్చు కానీ, మరోసారి గెలిచే అవకాశాలున్నాయి అని పదవులు ఆశిస్తున్న వాళ్లే నమ్మడం లేదు.