సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అంటే సింహస్వప్నంలా ఉంటుందేమో. నుడుగుకి నూరుసార్లు ‘మాయమై పో’ అని పిడుగు మంత్రాలు చదువుతుంటారు. ఇంకా అమానుషమైన రీతిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సంధిప్రేలాపనలు పేలుతుంటారు. చావుకోరే మాటలతో వైరభక్తి ప్రదర్శిస్తుంటారు. ‘గుర్తులు’ చెరిపేస్తా అని అక్కసుతో తిక్కరాజకీయాలు చేసి భంగపడుతుంటారు. పదవి చేపట్టి రెండున్నరేండ్లయినా ఇప్పటికీ తాను సీఎంననే భావన ఆయనలో ఎందువల్లనో పాదుకోలేకపోతున్నది. బీఆర్ఎస్ అస్తిత్వ, ప్రాభవాలు ఆయనకు కునుకు లేకుండా చేస్తున్నాయనేది అనునిత్యం ఆయన చేస్తున్న వింత, వితండ వాదనలే తేటతెల్లం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు గతం తప్ప భవిష్యత్తు లేదని, ఆ పార్టీ కాలపరిమితి ముగిసిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వాకృచ్చిన ఆణిముత్యాలు నవ్వు తెప్పించకమానవు. ఇటు చేతకాని, చేవలేని పాలనతో ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత, అటు పాలకపక్షం నుంచి జీవన్‌రెడ్డి వంటి సీనియర్ల చేరికతో బీఆర్ఎస్కు పెరుగుతున్న ప్రజా మద్దతుతో అసహనానికి గురై ఇలాంటి అపహాస్యపు వ్యాఖ్యలు చేస్తున్నారని అనుకోవాల్సి ఉంటుంది.
బీఆర్ఎస్కు కాలం చెల్లింది అనడంలో బహుశా రేవంత్ ఉద్దేశం ఏమై ఉంటుందోనని ఆలోచిస్తే మనకు వెంటనే స్ఫురించేది తెలంగాణ సాధన. తెలంగాణ కోసం కొట్లాడింది బీఆర్ఎస్. అందుకు ప్రతిఫలంగా స్వరాష్ట్రం సిద్ధించింది. ఇంక ఆ పార్టీ అవసరం లేదన్నది రేవంత్ భావమేమో. కానీ ఈ దిశగా ఆలోచన చేయడం ద్వారా ఆయన రెండు విధాలుగా సెల్ఫ్ గోల్ చేసుకున్నారని అనిపిస్తున్నది. ఒకటి.. తెలంగాణ సాధించి ఆపై కాడి పడేస్తానని బీఆర్ఎస్ ఏనాడూ చెప్పలేదు. బంగారు తెలంగాణ సాధనకు నూరుశాతం కట్టుబడిన పార్టీ బీఆర్ఎస్.
అందుకు కేసీఆర్ తన రెండు విడతల పాలనాకాలంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టి, అమలు చేసి విజయం సాధించారు. తద్వారా నవజాత రాష్ర్టానికి దేశవిదేశాల్లో కీర్తిప్రతిష్ఠలు ఆర్జించి పెట్టారు. ఓట్ల శాతంలో చిన్న తేడాతో రేవంత్ సీఎంగా గద్దె ఎక్కడానికి కేసీఆర్ సాధించిన తెలంగాణ రాష్ట్రమే ఆధారమైంది. అందుకు సీఎం తెలంగాణ సాధకుడికి సదా రుణపడి ఉండాలి. రెండు.. కాలం తీరడం విషయానికి వస్తే అందుకు కాంగ్రెస్ పార్టీయే అన్నివిధాలుగా సరైన ఎంపిక అవుతుంది.
స్వాతంత్య్ర పోరాటకాలంలో వివిధ భావజాలాలు కలిగిన రాజకీయ శక్తులకు కాంగ్రెస్ ఒక వేదికలా, ఒక గొడుగునీడలా ఉండేది. అదొక రాజకీయ పార్టీ కాదు. మరోరకంగా చెప్పాలంటే రాజకీయ పార్టీల కూడలి. కాలక్రమంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా లెఫ్ట్, రైట్ పార్టీలన్నీ సొంత కుంపట్లు పెట్టుకున్నాక స్వాతంత్య్రం వచ్చింది. అప్పటికి కాంగ్రెస్ పేరుతో ఓ మధ్యేమార్గ వర్గం మిగిలిపోయింది.
ఆ వర్గం కాంగ్రెస్ అనే పేరు వాడుకోవడంపై స్వాతంత్య్ర సమర సర్వోన్నత నేత అయిన బాపూజీ అయిష్టత తెలిపారు. కాంగ్రెస్‌ను రద్దు చేయాలని ఆయన బాహాటంగా పట్టుబట్టారు. కానీ అది జరుగలేదు. ఆ తర్వాతి కాలంలో ఎన్నో ముక్కచెక్కలై ఇప్పటి రూపంలో, అవసాన దశకు చేరింది కాంగ్రెస్ అనే కలగూరగంప. స్వాతంత్య్ర పోరాటం కాలం నాటి పేరుప్రతిష్ఠలపై వచ్చే వడ్డీతో బతుకుతున్న కాంగ్రెస్ దానంతట అదే రద్దు కాదు కనుక ప్రజలే ఆ పనికి పూనుకుంటున్నారు. చాలావరకు ఆ విషయంలో కృతకృత్యులయ్యారు కూడా.
అంతా అనుకూలిస్తే రేవంత్‌రెడ్డి ఇంకో రెండేండ్లు పదవిలో ఉంటారు. ఈలోగా ఆయన చేయాల్సింది రాలుగాయి మాటలు మాని పరిపాలనపై శ్రద్ధ పెట్టడం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నించడం. మోసకారి మాటలు, మాయదారి హామీలు ఇచ్చిన రేవంత్ ఆ పనిచేయలేరు. ప్రజలు ఆయన వ్యర్థపు మాటలతో విసిగిపోయారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ చల్లని పాలనను పదేపదే తలపోస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్ వైపు జీవన్‌రెడ్డి వంటి కాంగ్రెస్ సీనియర్ నేతలే మొగ్గుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్దే విజయమనే విశ్లేషణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రేవంత్ ఉలికిపాటు మాటలు మాట్లాడకుండా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పకతప్పదు.