హిట్లర్ అనే పేరే ఎనభై ఏండ్ల నుంచి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉన్నది. అలాంటివాడు మళ్లీ ఈ భూమ్మీద పుట్టొద్దని ప్రపంచ మానవాళి కోరుకుంటున్నది. చరిత్ర తెలిసిన ఎవరైనా రెండో ప్రపంచ యుద్దాన్ని ప్రస్తావిస్తూ జర్మనీ నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ నరరూప రాక్షసుడు అని చెప్తారు. అలాంటిది హిట్లర్‌కు ఇష్టమైన పదం హైడ్రా అని, అది ఆయన ప్రధాన సైనిక బృందం పేరు అని, ఎవరినైనా మట్టుపెట్టడానికి ఆ బృందం వెనుకాడేది కాదని విలాసంగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. మాటను ప్రసిద్ధ పాత్రికేయుడు ఎన్.రామ్ ముందు అన్నారు. ఎన్.రామ్ ఆ మాటలు విన్నాక మన సీఎం చరిత్ర పరిజ్ఞానానికి నవ్వుకున్నారు. జూన్ 6న బెంగుళూరులో హిందూ గ్రూప్ నిర్వహించిన హడిల్ 2026 సదస్సులో వీరి భేటీలోప్రశ్న – జవాబుల పరంపరలో ఈ చర్చ వచ్చింది. హైడ్రా ఘనకార్యాలను వివరిస్తూ ’మీరు గూగుల్ లో సెర్చ్ చేయండి. ఇరాన్, ఇజ్రాయిల్ విధ్వంసం మాదిరి ఈ కూల్చివేతలు కనబడుతాయి’ అని కూడా సభాముఖంగా అన్నారు.
ఇక్కడ మొదటగా ప్రస్తావించవలసిన విషయం హిట్లర్‌కు హైడ్రా అభిమాన పదం అన్నమాట. ఇది పూర్తిగా తప్పు. హిట్లర్ ఏ సైనిక పటాలానికి కూడా హైడ్రా అనే పేరు లేదు. హైడ్రా అన్నపదం గ్రీకు పురాణాల్లో ఉన్నది. ఓ సరస్సులో ఉండే పది తలల సర్పం పేరు హైడ్రా. దాని ఒక తల ఖండిస్తే రెండు పుట్టుకొస్తాయట. అందుకే ఆ పేరును అమెరికాకు చెందిన కామిక్స్ ప్రచురణ సంస్థ మార్వెల్ కామిక్స్ కథలో ఒక ఫాసిస్టు దళానికి వాడుకున్నది. ఈ కామిక్స్ 1965లో ప్రచురితమైంది. సగం జ్ఞానం ప్రమాదకరం అన్నట్టు రేవంత్‌రెడ్డి కట్టుకథలతో నవ్వులపాలయ్యారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ అధిష్ఠానం కన్నెర్ర చేసింది. రేవంత్ మాటలను పార్టీ అంగీకరించడం లేదని పార్టీ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రేవంత్ నోట హిట్లర్ మాటను విస్తృతార్థ దృష్టిలో చూడాలని ఆయన అన్నారు.
ఇక హైడ్రా కూల్చివేతలను ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధ విధ్వంసంతో పోల్చడం మరో తప్పిదం. ఈ విధ్వంసం, మానవ హననం, పసిపిల్ల మరణాలకు, ఆకలి కేకలకు అంతం ఎప్పుడు అని దేశదేశాలు ఎదురు చూస్తున్నాయి. అలాంటి దృశ్యాలను హైడ్రా కూల్చివేతలతో పోల్చడం శాడిస్టు పోకడలే అని చెప్పాలి. హైడ్రా గురించి ఆయన పదే పదే ఘనంగా చెప్పుకొనేంతగా దాని కార్యకలాపాలు లేవు. తాను కంచె వేసిన చోట ప్రజల పేరుతో ‘ప్రభుత్వ భూములను రక్షించినందుకు హైడ్రాకు ధన్యవాదాలు’ అంటూ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. కొన్నాళ్లు పోతే ఆ ఫ్లెక్సీలు ఉండవు, కంచె కానరాదు. ఇదే విషయాన్నీ ఒక చానల్ హైడ్రా బాస్‌ను అడిగితే, ‘అలాంటివి చూపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తాను’ అని రాజకీయ నాయకుడిలా ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ భూములను రక్షించామంటూ హైడ్రా బాస్ చెప్పే వివరాలపై మున్సిపల్ తదితర శాఖల ధృవీకరణ ఉండదు. కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు హైడ్రా కమిషనర్‌కు రూ.50 వేలు జరిమానా విధిస్తూ ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఉద్యోగ విధి నిర్వహణలో తప్పుడు విధానం కిందికి రాదా? కోర్టు జరిమానా విధించిన సాధారణ ఉద్యోగిపై తీసుకొనే చర్యలు వీరిపై ఎందుకుండవు? హైడ్రా నడక చూస్తే హిట్లర్‌కు ఏ మాత్రమూ తీసిపోదు. దాని బారిన పడిన సామాన్యులు గ్యాస్ చాంబర్లో ఊపిరాడనట్టే విలవిల్లాడిపోతున్నారు. పాలనపై పట్టులేని ప్రభుత్వాలపై ఉద్యోగస్వామ్యం పైచేయి అవుతుంది. వీటి వల్ల ప్రజా జీవనానికి తీరని అన్యాయం జరుగుతుంది. సరైన పాలకులను ఎంచుకొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజలపై ఉన్నది.
– బద్రి నర్సన్