విశ్వవ్యాప్తంగా జెన్-జీ తరం వైవిధ్యమైన కదలికతో రాజకీయ, సామాజిక పరిణామాల్లో క్రియాశీలక భూమిక పోషిస్తున్నది. సోషల్ మీడియా ఆధారంగా సమాచారాన్ని పొందుతూ, ఇతరులకు పంచుతూ పరిణామాలెన్నింటికో అభిప్రాయ పునాదులు నిర్మిస్తున్నారు. అయితే కెరీరిజం జంజాటంలో తలమునకలై ఉంటూనే ఆన్లైన్లో వర్తమానాంశాలపైనే చురుగ్గా స్పందించే జూమర్స్ అందరూ తేలిగ్గా రూమర్స్ వలలో పడే ప్రమాదం కూడా ఉన్నది. మరీ ముఖ్యంగా లోతుల్లోకి దృష్టిసారించకుండా, భావోద్వేగాల బరువును తేలిగ్గా తలకెత్తుకునే నేటి తరం భారత్‌లోని వివిధ రాష్ర్టాల కంటే తెలంగాణలో కొంత ఎక్కువ తికమకకు లోనయ్యే ముప్పు ఉన్నది. దశాబ్దాల త్యాగాలకు, తరాల ఆకాంక్షలకు విభిన్నమైన ధోరణిలో రెండేండ్లుగా తెలంగాణలో రాజకీయాలను తీర్చిదిద్దే ప్రయత్నాన్ని గూడుపుటానీ గుంపొక్కటి చేస్తూపోతున్నది. అందుకే తెలంగాణలో వర్తమాన అంశాలపై అవగాహనకు వచ్చేటప్పుడు కొంత అప్రమత్తంగా ఉండక తప్పదు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సంకుచిత రాజకీయ వ్యవహారశైలిని ప్రవేశపెడుతూ రేవంత్ సర్కార్ జిల్లాల్లో నిర్వహిస్తున్న బహిరంగ సభలు విచిత్రాలకెన్నింటికో వేదికలుగా మారుతున్నాయి. మొన్న ఆదిలాబాద్‌లో జరిగిన సభలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ నగేష్‌లు సీఎం రేవంత్ రెడ్డిని ఆకాశానికెత్తేసిన ప్రసంగాలు, కాంగ్రెస్ సర్కార్‌ను చూసి ఇతరులు నేర్చుకోవాలన్నట్టు మాట్లాడిన తీరును చూసి విషయావగాహన ఉన్నవారంతా ముక్కున వేలేసుకున్నారు. వాస్తవానికి గిరిజనులకు ఇచ్చిన అనేక హామీలను తుం గలో తొక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ ఆదిలాబాద్‌లో మరోసారి అసత్యాల సభ పెట్టకుండా బీజేపీ నేతలు అడ్డుకోవాల్సింది.
కానీ, విచిత్రంగా సర్కార్ సభలో ఆసీనులై అభివృద్ధి జపం అందుకోవడం హాస్యాస్పదం. అసలు రెండేండ్లుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అందులో కాంగ్రెసేతర ఒకటి రెండు పార్టీల నేతల కుప్పిగంతులు జాగ్రత్తగా గమనిస్తే గూడుపుటానీ కళ్లకు కట్టినట్టుగా కనబడిపోతుంది. రేవంత్ సర్కార్ తక్కెట్లో తెలంగాణను నిలబెట్టి, అంతా అమ్మకానికి పెడుతూపోతున్నా బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు మాత్రం మాట్లాడితే ఆణిముత్యాలు ఎక్కడ రాలిపడుతాయోనన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో నిద్రలో కూడా నిందా నినాదాలు పలువరించిన రాజకీయ నేతలంతా రెండేండ్లుగా నోర్లే విప్పడం లేదు. ‘వస్తాదులకు పక్షవాతం సోకినట్టుగా’ పదేండ్లు పగతో ప్రగల్భాలోద్యమాలు నడిపిన అర్వింద్, సంజయ్ లాంటి ఎందరో పొలిటికల్ కుహనా పహిల్వాన్లు వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు బైలెల్లినట్టుగా తెలంగాణను వదిలి దేశాటనలో గడుపేస్తున్నారెందుకో?
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హస్తవాటానికి లగచర్ల నుంచి జీడిమెట్ల వరకున్న ప్రభుత్వ, ప్రైవేట్ భూములన్నీ బిక్కుబిక్కుమంటున్నా బీజేపీతో సహా కుహనా మేధావులంతా సర్కార్ వారి వేలం పాటలు చెవిన పడనట్టే వ్యవహరిస్తున్నారు. దేశంలోనే ఏ పార్టీ ప్రభుత్వం వొడిగట్టని దుస్సాహసాలకు రేవంత్ సర్కార్ కాలుదువ్వుతుంటే స్వయం ప్రకటిత దేశభక్తులు ఎందుకో భుక్తాయసంతో సతమతమవుతున్న బృందంలా కాలే కదపడం లేదు.
హిల్టప్ పేరిట పదివేల ఎకరాల విలువైన తెలంగాణ భూముల దందాకు రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా అడుగులు వేస్తుంటే ఎనిమిది మంది కమలం పార్టీ లోక్‌సభ సభ్యులు ఎదిరించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల తెలంగాణ సంపదతో ముడిపడిన హిల్టప్ లాంటి పథకాన్ని అసెంబ్లీలో చర్చించకుం డా, విపక్షాలను సంప్రదించకుండా, రాష్ట్ర ప్రజలకు తెలియనివ్వకుండా రహస్యంగా అమలుచేసేందుకు సర్కార్ ఉవ్విళ్లూరుతుండటమే అంతులేని అనుమానాలకు బలా న్ని చేకూరుస్తున్నది కదా? మరెందుకు కమలం, కమ్యూనిస్టు పార్టీలు ప్రజలవైపు నిలబడి ప్రభుత్వంతో తలపడకుండా నక్కతట్ల రాజకీయాలు నడిపిస్తున్నాయి? పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూములు, ఫోర్త్ సిటీ పేరిట జరుగుతున్న భూమాయలు, వట్టినాగులపల్లి, శామీర్పేటల్లోనే కాదు రాష్ట్రంలో మూలమూల నా భూ దాహంతో బరితెగించి దౌర్జన్యానికి దిగుతున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల వ్యవహారాలు కండ్లారా చూస్తూ కూడా బీజేపీ లాంటి పార్టీలు పోరాటానికి ఆమడ దూరంలో నిలబడి చోద్యం చూస్తున్నాయి.
స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగాలకు వెరువక యమకింకరుల్లాంటి రాజకీయ విరోధులతో రెండు దశాబ్దాల పాటు సమరం చేసిన స్ఫూర్తితోనే రెండేండ్లుగా బీఆర్ఎస్ తెలంగాణ పరిరక్షణ కోసం పోరాడుతున్నది. ఒకవేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరిట ప్రభుత్వ పెద్దలు పన్నిన పన్నాగాన్ని ప్రజలముందు పెట్టకపోయుంటే, పట్టించుకోకపోయుంటే లక్షల కోట్ల తెలంగాణ భూ సంపద సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల ధన దాహానికి గురయ్యేవి. అయితే హిల్ట్ స్కామ్ అంశంలోనే కాదు మరెన్నో కాంగ్రెస్ సర్కార్ ప్రజా వ్యతిరేక అరాచకాలపై నిరంతరం బాధ్యతాయుత విపక్షంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉన్నది.
అధికారంలోకి రాగానే సచివాలయంలో రాజీవ్‌గాంధీ విగ్రహ ఏర్పాటు నుంచి అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం తొలగింపు కుట్రల వరకు తాజాగా ఎన్టీఆర్, బాలసుబ్రహ్మణ్యం విగ్రహాల వివాదాల వరకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని కావాలనే కురచబుద్ధితో పలుచన చేస్తుంటే, నిలదీస్తూ బీఆర్ఎస్ ఉద్యమిస్తున్నది. నిరుద్యోగులకు అండగా వీధుల్లో మాత్రమే కాదు, న్యాయస్థానాల్లో సైతం బీఆర్ఎస్ పోరాటం చేసింది. లగచర్ల గిరిజన రైతుల పక్షాన నిలబడి బీఆర్ఎస్ నేతలు జైలుపాలవ్వడమే కాదు, జైల్లో మగ్గుతున్న గిరిజన రైతుల కోసం న్యాయస్థానాల్లో పోరాడి వారిని మళ్లీ ఇళ్లకు చేర్చారు. సర్కార్ అమానవీయ పాలన వల్ల గురుకుల పాఠశాలల్లో వందమందికి పైగా బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు దుర్మరణం పాలైతే బీఆర్ఎస్ శ్రేణులు సర్కా ర్ మెడలు వంచేలా ఉద్యమించారు.
అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు హామీ అమలు విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ద్రోహపూరిత వైఖరిని అడుగడుగునా ఎండగడుతూ వెంటపడుతూనే ఉన్నది బీఆర్ఎస్ పార్టీనే కదా? కాంగ్రెస్ పార్టీ ప్రజల బాకీలన్నింటి పై, ధోకాలెన్నింటినో ఎండగడుతూ నిత్యం తెలంగాణ ప్రజల పక్షాన అలుపెరుగని పోరాటా లు చేస్తూనే ఉన్నది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కదా? మరి బీజేపీ లాంటి పార్టీలు ఏం చేస్తున్నా యి. ప్లేట్ భోజనం, ప్రెస్మీట్లతో కమలం పార్టీ నేతలు కొందరు మీడియాలో హడావుడి తప్ప జనం కోసం పిడికిలి బిగించిందెక్కడ? పైగా ప్రజాతీర్పును శిరసావహించి రెండేండ్లుగా విపక్ష బాధ్యతనూ బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలపైనే అక్కసు వెళ్లగక్కుతుండటం దేనికి సంకేతం?
తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల రాజకీయ జుగల్బందీ ఏడున్నర దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నది. అధికారాన్ని వంతులవారి క్రీడగా మార్చుకొని దేశాన్ని ఏమారుస్తూ, ఎండపెడుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ దేశాన్ని ఏలిన సమయంలో జరిగిన అక్రమాలపై బీజేపీ సర్కార్ నిర్దిష్టమైన చర్యలు ఎప్పటికీ తీసుకోదు, బీజేపీ నేతల అన్యాయాలపై కాం గ్రెస్ పార్టీ సర్కార్లు గతంలో ఏనాడూ ఎవరినీ ఖైదీ చేసిందేలేదు. ఈ రెండింటి పరస్పర సహకారాన్ని గతంలోనే సమతా పార్టీ అధ్యక్షురాలు జయాజైట్లీ బట్టబయ లు చేశారు. గతంలో దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన బోఫోర్స్ కుంభకోణంపై తర్వాతి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ చర్యలకు అంతా సిద్ధం చేశాక పైనుంచి వచ్చిన ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఆ ఫైల్‌ను పక్కకు పడేశారని ఆమె రాసిన ఆత్మకథ లో వెల్లడించారు. అంతేకాదు, గతంలో బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రధానమంత్రి కార్యదర్శిగా కీలకపాత్ర పోషించిన బ్రిజేష్ మిశ్రాకు 2011లో యూపీఏ సర్కార్ పద్మవిభూషణ్ అవార్డు ప్రధానం చేసింది.
ఇలా 2002 గోద్రా అల్లర్లతో పాటు, కుంభకోణాలు, అన్యాయాలు ఎన్నింటిపైనో పరస్పర అవగాహనతో నొప్పించుకోని తూతూ విమర్శల తతంగాలను నడిపించారు. దివాలాకోరు విధానాలకు, ప్రజా వ్యతిరేక దృక్పథానికి నాణేనికి ఇరువైపులా బొమ్మాబొరుసులే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ఈ రెండు పార్టీలకు ప్రాంతీయ ఆకాంక్షలు, అవసరాలు, ఆత్మగౌరవాలు అసలే పట్టవు. కేంద్ర సర్కార్ ఆధ్వర్యంలోని రంగాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ స్వహస్తాలతో బలిపీఠంపైకి చేరిస్తే, పువ్వులు పెట్టి బీజేపీ సంతాప గీతం పాడింది. రుపాయికు, డాలర్‌కు మధ్య అందుకోజాలని అగాథాన్ని తవ్విన విధ్వంస పాలకులు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ రాష్ర్టాన్ని ఆట వస్తువుగానే చూస్తాయి గానీ, అమ్మగా భావించనే భావించవు. అందుకే తెలంగాణ జెన్-జీ రాజకీయ పార్టీల కార్యాచరణను లోతైన దృష్టికోణంతో విశ్లేషించుకోవాలి. మన భూములు, రిజర్వేషన్లు, తర్వాతి తరాల భవితవ్యాలు వర్తమాన తరం అప్రమత్తతపైనే ఆధారపడి ఉంటుంది కదా?
(వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)