‘కాపురం చేసే కళ కాలు తొకినప్పుడే తెలుస్తుంది’ అంటారు. రాష్ట్రంలో 18 నెలల కింద ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి మొదటి మూడు నెలల్లోనే ప్రజలకు ఎరుకైంది. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి.. ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి.. రెండేండ్లు కావస్తున్నా గ్యారెంటీల అమలు ఊసెత్తడం లేదు. ప్రజల సంక్షేమం కోసం పావలా ఇచ్చింది లేదు.. పేదలకు పెట్టింది లేదు.. పనులు చేసిందీ లేదు. రాష్ట్రం మొత్తం మీద ఒకటంటే ఒక్క ఇటుకైనా పేర్చింది లేదు. కానీ, గడిచిన 18 నెలల్లో అక్షరాలా రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది రేవంత్ సర్కారు.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పులపై నోటికి వచ్చినట్టు మాట్లాడిన కాంగ్రెస్ నేతలు.. తాము అధికారంలోకి వస్తే అప్పులే చేయబోమన్నట్టుగా వ్యవహరించారు. కానీ, గద్దెనెక్కాక రెండేండ్లలోపే ఏకంగా రూ.2 లక్షల కోట్ల అప్పు చేయడం శోచనీయం. అప్పులు చేయడం.. గొప్పలు చెప్పుకోవడమే ఈ సర్కారు తీరుగా కనిపిస్తున్నది. ఈ అప్పులతో రాష్ట్ర ప్రజలకు అక్కరకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచి పనైనా చేసిందా? రాష్ట్ర సంపదను పెంచేందుకు ఒక్క చర్య అయినా చేపట్టిందా? ‘ఇదిగో.. మేం ప్రజలకు ఇది చేశాం’ అని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒక్కరైనా చెప్పగలరా? కాణీకి కొరగానివాడు మారాజును వెకిరించాడట.. అలా ఉంది కాంగ్రెస్ సర్కారు పాలన, హస్తం ఏలికల మాటలు.
ఉమ్మడి పాలనలో తెలంగాణ ఎట్ల ఉండె.. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఎట్లా మారిందో.. అనేది రాష్ట్రంలో పదేండ్ల పిల్లగాణ్ని అడిగినా చెబుతాడు. ముంజేతి కంకణానికి అద్దమెందుకు అన్నట్లుగా కేసీఆర్ తెలంగాణకు ఏం చేసిండో చెప్పడానికి ఎవరూ అకర్లేదు. ఏ ఊరికి.. ఏ పల్లెకు.. ఏ వీధికి అయినా పోయి.. ‘అవ్వా ఇది ఎవరు చేసిన్రు’ అంటే ఠకున ‘ఇంకెవరు బిడ్డా మన కేసీఆర్ చేసిండు’ అంటరు. ఏ పట్టణానికైనా పోయి ‘పెద్దయ్యా ఈ దవాఖాన ఎవరు కట్టించిన్రు’ అంటే.. ‘కేసీఆర్ కాకుంటే ఇంకెవరు కడతారు’ అనే బదులొస్తుంది. ‘ఈ మెడికల్ కాలేజీ ఎవరు తెచ్చిన్రు’ అని ఏ విద్యార్థినిని అడిగినా.. ‘కేసీఆర్ సార్ తెచ్చిండు’ అనే అంటది. ‘ఏం కాకా పొలానికి నీళ్లొస్తున్నయా.. గతంలో ఈ పొలం ఎట్లుండే.. ఇప్పుడిలా ఎట్లా అయింది’ అని అడిగితే మెరుస్తున్న కండ్లతో ‘ఇదంతా మన కేసీఆర్ చలవే. కేసీఆర్ వచ్చినంకనే మన బీళ్లకు నీళ్లొచ్చినయి’ అని అంటడు. ‘అవ్వా! నీళ్ల బిందె మోసుడు తప్పినట్లేనా.. ఇదంతా ఎవరు చేసిన్రు ఎరుకేనా’ అనే ప్రశ్న పూర్తికాకముందే ‘కేసీఆర్ అచ్చినాక ఊళ్లు మారినై బిడ్డా. మిషన్ భగీరథ మా భారం మోసింది. ఇంటింటికి నీళ్లు తెచ్చింది’ అంటూ సంతోషం నిండిన మోముతో చెప్తరు. అలా చెప్తున్నప్పుడు నా తెలంగాణ ఎంతగా మారిపోయిందో అనే సంతోషంతో మన మనసు నిండిపోతుంది.
కేసీఆర్‌కు చేతనైనది మీకెందుకు చేతగావడం లేదు. ఒకడు తెలంగాణ స్వరూపాన్ని మార్చిండు. పల్లెలు, పట్టణాలు, నగరాలు, వీధులు, వాకిళ్లు.. ఏ దికున చూసినా ఆయన వేసిన బాటలే కనిపిస్తాయి.
కేసీఆర్ అప్పులు చేశారనేది కాంగ్రెస్ ఆరోపణ. నిజమే, ఓ ఇంటి పెద్దగా కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు అప్పు చేసిండు. ఆ అప్పుతో ఏం చేసిండంటే.. ఇల్లు కట్టిన్రు.. పిల్లాణ్ణి చదివించిన్రు.. పిల్లకు పెండ్లి చేసిన్రు.. కుటుంబ పెద్దగా అందరి అవసరాలను తీర్చిన్రు. ఆయన చేసిన అప్పునకు ఒక సార్థకత ఉంది. మరి మీరు చేసిన అప్పంతా పప్పుకూడుకు తగలేస్తే ఎట్ల? ఈ ఇంటి పెద్ద బాధ్యత ఏమైనట్లు? కేసీఆర్ సర్కారు చేసిన అప్పులో పైసా కూడా దుర్వినియోగం కాలేదు. అప్పు తాలూకు ప్రగతి రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా చూడొచ్చు. డబుల్ బెడ్రూం ఇండ్లు, జిల్లాకో మెడికల్ కాలేజీ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, గురుకుల పాఠశాలలు, పల్లెపల్లెకు రోడ్లు, పల్లె ప్రకృతి వనాలు, నెలనెలా పంచాయతీలకు నిధులు, కలెక్టర్, ఎస్పీ, ఆర్డీవో, ఎమ్మార్వోల ఆఫీసులే అందుకు తార్కాణం. హైదరాబాద్‌ను జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దారు. తెలంగాణ ఆధ్యాత్మిక శిఖరంగా యాదగిరిగుట్టను రూపుదిద్దారు. ఇలాంటివి కాంగ్రెస్ పాలకులు కలలోనైనా ఊహించగలరా?
కొత్త రాష్ట్రం ఏర్పడగానే ఉద్యోగులకు వేతనాలు పెంచి పీఆర్సీ ఇచ్చారు. ఆసరా పింఛన్లు పెంచారు. లక్షలాది డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్) ఏర్పాటు చేసి హైదరాబాద్ నలుమూలలా దవాఖానలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతీ జిల్లాలో కొత్తగా ఆస్పత్రుల భవనాలు కట్టించారు. ఆశా, అంగన్వాడీ వర్కర్లు కూడా సగర్వంగా బతికేందుకు వేతనాలు పెంచింది కూడా కేసీఆర్ సర్కారే. అంతేకాదు, కాళేశ్వరం వంటి అద్భుతమైన ప్రాజెక్టు నిర్మించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయింది కూడా కేసీఆర్ జమానాలోనే. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, అలీసాగర్, గుత్ప, దేవాదుల వంటి ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు ఎస్సారెస్పీ పునరుజ్జీవం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. గ్రామాల్లో చెక్‌డ్యాంలు, చిన్నచిన్న ఎత్తిపోతల పథకాలకు లెక్కేలేదు.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు లాంటి పథకాలను అమలు చేసింది. బోనాలు, బతుకమ్మ పండుగలను ఘనంగా జరిపించిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్ సర్కారుదే. ఈ రోజు రేవంత్‌రెడ్డి కూర్చున్న పరిపాలనా భవనం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం, దాని ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం, దానిపక్కనే ఆకాశాన్నితాకేలా నిర్మించిన అంబేద్కర్ విగ్రహం.. రేవంత్ రెడ్డి తరచూ సమీక్షలు నిర్వహించేందుకు ఉపయోగిస్తున్న పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్.. హైదరాబాద్ నగరంలో నిర్మించిన తీగల వంతెన సహా పదుల సంఖ్యలో ఉన్న ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, లింక్ రోడ్లు.. మెట్రో రైల్ నిర్మాణం.. చేపట్టింది కేసీఆర్ ప్రభుత్వమే. కేసీఆర్ సర్కారు తెచ్చిన నాలుగు లక్షల కోట్ల అప్పుల్లో నుంచే వీటన్నింటిని నిర్మించారు.
కేసీఆర్ తెచ్చిన ప్రతీ పైసా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేయడానికి దోహదం చేసింది. తెలంగాణ తలసరి ఆదాయం మూడు రెట్లకుపైగా పెరగడమే అందుకు నిదర్శనం. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ పేరు తెచ్చుకున్నదంటే దానికి కారణం బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ మార్గదర్శనంలో జరిగిన ప్రగతే.
రాష్ట్రంలో 18 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు గడిచిన ఏడాదిన్నరలో ఏం సాధించిందంటే చెప్పడానికి ఏమీ లేదు. గట్టిగా ఒక్కటంటే ఒక్క పథకాన్నైనా చూపించగలదా? ఆరు గ్యారెంటీలను అమలు చేశామని చెప్పగలదా? పదేండ్ల కాలంలో నాలుగు లక్షల కోట్లు అప్పుతో కేసీఆర్ చేసిన ప్రగతి రాష్ట్రం మొత్తం కనిపిస్తున్నది. ఇప్పుడు రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చిన రేవంత్ ఎకడైనా తట్టెడు మట్టి ఎత్తారా? ఇదంతా కప్పిపుచ్చుతూ తెలంగాణకు కేసీఆర్ ఏమీ చేయలేదన్న దుష్ప్రచారం చేస్తూ కాంగ్రెస్ కాలయాపన చేస్తున్నది. అయితే, ఇలాంటి దుష్ప్రచారం తాత్కాలికమే. డైవర్షన్ పాలిటిక్స్ ఎంతో కాలం సాగవు.
ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ఒక్కటే. కాంట్రాక్టర్లను పిలవడం.. కమీషన్లు పిండుకోవడం తప్ప మరొకటి లేదు. హైదరాబాద్‌ను లండన్‌లా చేస్తాం.. థేమ్స్ నది లెక్క చేస్తానని చెప్పడం తప్ప రేవంత్‌రెడ్డి చేసిందేమైనా ఉందా?
రాష్ర్టానికి నెలకు పన్నుల రూపేణా రూ.18,500 కోట్లు ఆదాయం వస్తున్నదని రేవంత్ స్వయంగా చెప్పారు. మరి రెండేండ్లలో ఈ రూపంలో వచ్చిన ఆదాయం దాదాపు రూ.4 లక్షల కోట్లు. దీనికి తోడుగా రెండు లక్షల కోట్ల అప్పులు చేశారు. అంటే మొత్తం రూ.ఆరు లక్షల కోట్లు. ఈ డబ్బంతా ఎకడికి పోయింది? ఎవరి జేబుల్లోకి ప్రవహిస్తున్నది? ఈ డబ్బుతో ప్రజలకు చేసిన మంచి ఏమిటో రేవంత్ చెప్పగలరా? ఇప్పటికే రెండు లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్‌రెడ్డి.. తన పదవీకాలంలో మరో రూ.4 లక్షల కోట్లకుపైగా అప్పు చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. అయినా కేసీఆర్‌లా కనీసం ఒక్క ప్రాజెక్టును, ఒక్క పథకాన్ని అమలు చేస్తారా అన్నది అనుమానమే. తెలంగాణ ఆత్మ కేసీఆర్.. తెలంగాణ హృదయస్పందన కేసీఆర్. తెలంగాణను ఒక స్థాయికి చేర్చి దేశంలోనే సంపన్న రాష్ట్రంగా నిలిపిన దార్శనికుడు కేసీఆర్. ఎంతసేపూ ఆయన మీద దుమ్మెత్తి పోయడమేనా? మంచి పేరు తెచ్చుకోవాలంటే కేసీఆర్ కన్నా ఎక్కువ మేలు చేసి ప్రజలను మెప్పించాలి. అంతేకానీ, తిట్లు, వెకిలిమాటలతో ఎంతో కాలం ప్రజలను మభ్యపెట్టలేరు. ఈ విషయాన్ని ఆయన గుర్తిస్తే మంచిది.
– ఓరుగంటి సతీష్