Telangana | ఈ దేశంలో రాష్ర్టాలు, వాటికి సచివాలయాలు ఉండటం సహజమే. కానీ తెలంగాణది, కాలం కొలిమిలో మండి పండిన ప్రత్యేకత్వం. స్వదేశంలో ఐదున్నర దశాబ్దాల సుదీర్ఘకాలం వివక్షా విషాన్ని దిగమింగుతూనే, ఆకాంక్షలు వొరిగిపోకుండా అడుగులేసిన ఆత్మగౌరవ సౌధం తెలంగాణ. నమ్ముకున్న, ఎన్నుకున్న పాలకులే.. కలలు, కన్న పేగులను కాటేస్తుంటే, రెప్ప వాల్చకుండా లక్ష్యం వైపే చూస్తూ గమ్యం చేరిన నిబ్బరత్వం తెలంగాణది. సుదీర్ఘ సంఘర్షణకు వేలాడి, సువిశాల త్యాగాల వనమై పెరిగి, వసంతాన్ని ఇంటికి తెచ్చుకున్న వైవిధ్యమైన రాష్ట్రం మనది.
‘ప్రాణమివ్వడమంటేనే పొద్దూ పొడవడమాని’ అని పాడుకుంటూ నినాదజ్యోతిని ఆరిపోనీకుండా బలిదానాగ్నిని రగిలించిన నేల తెలంగాణ. అన్నీ లాగేసుకోబడిన శూన్యహస్తాల మానవ సమూహం, తమ కన్నీరు, నెత్తురు నాటి, జలాన్నీ, జీవితాన్నీ గెలుచుకున్న భావోద్వేగాల తరగని గని తెలంగాణ. ఈ తెలంగాణ తనం, ప్రత్యేక అస్తిత్వం వెలుగుధారలో నుంచే పాలకుల చూపుండాలి. ఆ దృక్పథంతోనే తొలి ప్రభుత్వ పదేండ్ల ప్రతి పనికీ, తెలంగాణమే కొలమానంగా ఉండింది. దానివల్లే విధ్వంసానికి, విలువల హననానికీ గురైన అన్ని రంగాలను పునర్నిర్మాణం చేయడంతో పాటు, తెలంగాణ పాలన వ్యవస్థకు కేంద్రమైన సచివాలయం కూడా అద్భుతంగా నిర్మించబడ్డది.
రాష్ట్రంలో ఇప్పటి కాంగ్రెస్ సర్కారే కాదు, రేపు ఏ ప్రభుత్వమైనా ఆ తెలంగాణ తనాన్నే బలోపేతం చేయాలి. కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తెలంగాణకు విరుద్ధమైన ధోరణిని, ఎందుకో ఏరి కోరి మరీ ప్రదర్శిస్తున్నది. స్వయం పాలనకు కేంద్ర స్థానమైన సచివాలయం ముందు, రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టాలనే ఆలోచన రేవంత్ రెడ్డి సర్కార్‌కు తట్టడమే.. తెలంగాణకు తగులుకున్న పాలనా అరిష్టం కదా?. ఇలా టీఎస్ నుంచి టీజీ, అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం తొలగింపు యత్నం, ప్రస్తుతం రాజీవ్‌గాంధీ విగ్రహం స్థాపన తదితర అంశాలను అనాలోచితంగా, అధికారాహంకారంతో తెలంగాణ తెరమీదకు తెస్తున్నది.
భారతీయ భౌగోళిక, రాజకీయ, సామాజిక చరిత్రపై కనీస అవగాహన ఉన్న ఏ నాయకుడైనా, కనీసం కొన్ని ప్రత్యేక అంశాలపై అప్రమత్తంగా వ్యవహరిస్తారు. మరీ ముఖ్యంగా సంస్కృతి, వారసత్వ సంపద, అస్తిత్వం, భాష, ఆత్మగౌరవం వంటి సున్నితోన్నతమైన మౌలిక విషయాల పట్ల జాగ్రత్తగా మసలుకుంటారు. ఈ అంశాల్లో పాలకుడు వేసే అడుగులు, సమాజ పునాదిలో ప్రకంపనలకు దారి తీస్తాయి. కానీ, ఇవ్వన్నింటిపై ప్రాథమిక అవగాహన కూడా లేని రేవంత్‌రెడ్డి గుప్పిట్లో.. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం చిక్కడం రాజకీయ వ్యవస్థకే హా నికరంగా దాపురించింది. ఇప్పుడు తెలంగాణ రా ష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కార్ చేష్టలు, వ్యవహారశైలి, దేశంలో ఇతర రాష్ట్ర పాలకులకూ అంటువ్యాధిలా సోకితే, సంకుచిత తత్త్వం, మానసిక మరుగుజ్జు నైజం ఊబిలో పాలనా వ్యవస్థలు మునిగిపోయే ప్రమాదం ఉన్నది. రేవంత్ రెడ్డిలా గతం లో తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్, కేరళ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ర్టాల్లోని కాంగ్రెస్ పార్టీ పాలకులు ప్రవర్తించబట్టే, ఆయా రాష్ర్టాల్లో మళ్లీ మొలకెత్తనేలేని దుస్థితికి ఆ పార్టీ దిగజారిపోయింది.
ఆ అనుభవాల నుంచి కాంగ్రెస్ ఏమీ నేర్చుకోనేలేదని, రేవంత్‌రెడ్డి లాంటి వారిని ముఖ్యమంత్రులుగా నియమించడం ద్వారా నిరూపించింది. ఒకవేళ కొంతైనా నేర్చుకొని ఉంటే, రేవంత్‌రెడ్డి చర్యలను కట్టడి చేసేవారు కదా? రాష్ట్ర సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టడమంటే, తెలంగాణ స్వయంపాలన ఆకాంక్షను వెక్కిరించడమే అవుతుంది. దివంగత మహా నేత రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలు, ఆయన ప్రాణత్యాగం కీర్తించదగినదే. అలాగని తెలంగాణ రాష్ట్రం కోసం, ఆత్మగౌరవం కోసం, స్వీయ పాలన ఆశయం కోసం వందలాది మంది యువకులు అమరులైన వీరోచిత మహోన్నత చరిత్రను చిన్నబుచ్చేలా సర్కార్ చర్యలు ఉండటమే ఆందోళన రాజేస్తున్నది. 1982 ఫిబ్రవరిలో బేగంపేట విమానాశ్రయంలో అంజయ్యను అవమానించి, అదే మాసంలోనే రాజీనామా చేయించి, ఆంధ్రకు చెందిన భవనం వెంకట్రామ్ను సీఎంను చేశాడు రాజీవ్ గాంధీ.
తెలంగాణ రాజకీయ నాయకత్వం పట్ల రాజీవ్‌గాంధీ సైతం వివక్షాపూరితంగానే వ్యవహరించారని చరిత్ర చెప్తున్నది కదా! అందువల్లనే స్వయం పాలన సౌధం ముందు ఏ ఢిల్లీ పెద్దల ప్రతిమ నెలకొల్పినా, అది బలిదానాలకు తలవంపులు తెచ్చే పనే అవుతుంది. ఎవరి ప్రతిమను ఎక్కడ ప్రతిష్టించాలో, ఏ స్తూపం ఎక్కడ కొలువుదీరాలో అనే అవగాహన పాలకులకు కొరవడితే ఎలా? కడుపుబ్బరంతోనో, తొందరపాటుతోనో, భజన స్వభావం వల్లనో విగ్రహాలతో చెలగాటం ఏ సర్కార్‌కూ శోభనివ్వదు. దుందుడుకు వైఖరితో విగ్రహాలను వివాదాస్పదం చేస్తున్న రేవంత్‌రెడ్డి సర్కార్ తీరు, తెలంగాణలో మళ్లీ అలజడికి ఆజ్యం పోస్తున్నది. తెలంగాణ ఉద్యమం, అస్తి త్వం, ఆత్మగౌరవంతో సంబంధం లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే, ఆయన ప్రాధాన్యాలు ఎలా ఉంటాయో స్పష్టంగా రేవంత్‌రెడ్డి అర్థం చేయించేశాడు.
అసలు తెలంగాణ సచివాలయాన్ని, దాని ప్రతి చదరపు అడుగులో రాష్ట్ర ఆత్మగౌరవం, వైభవం, స్వయంపాలన వెలుగు ఉట్టిపడేలా తొలి సీఎం కేసీఆర్ నిర్మించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు అవసరమైన ఏ చారిత్రక నిర్మాణం చేపట్టినా, ఆనాడు విపక్షంగా ఉన్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు అర్థంలేని ఆరోపణలు చేసేవారు. కానీ, అమరుల అద్వితీయ స్థూపం, ఆకాశమంత అంబేద్కర్ విగ్రహం మధ్యలో తెలంగాణ చరిత్రంత అద్భుతంగా నూతన సచివాలయ నిర్మాణం జరిగాక, ప్రతి తెలంగాణ బిడ్డా ఆనందపడ్డాడు. ఇంకా మానవీయంగా పాలనా వ్యవస్థకు నిరంతర ప్రగతిశీల దృష్టికోణం గుర్తుచేసేలా, సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టాడు కేసీఆర్.
తెలంగాణ ప్రభుత్వం ఏ ఆశయాల వెలుగులో అడుగులు వేస్తూ, ఏ లక్ష్యసాధన కోసం ప్రయాణం చేస్తున్నదో, అన్ని వ్యవస్థలకూ అర్థం అవ్వడానికి నూతన సచివాలయమే నిలువెత్తు నిదర్శనం. తొమ్మిది నెలల కిందట మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఉంటే, పాలనాలయం వొడిలో తెలంగాణ తల్లి చిరునవ్వులు చిందిస్తూ కొలువుదీరేది. ఇవన్నీ ఎవరు దాయగలరు? విగ్రహ రాద్ధాంతం రాజేయొద్దని హితవు పలికిన విపక్షంపై, పసి పిల్లల ముందు రోత మాటలతో నోరుపారేసుకున్న రేవంత్‌రెడ్డి, తన రాజకీయ కురూపితనాన్ని బయటపెట్టుకున్నాడు.
అద్భుతమైన సచివాలయం నిర్మించిన కేసీఆర్‌ను, విగ్రహం కోసం నిగ్రహం కోల్పోయి రేవంత్‌రెడ్డి తూలనాడితే, తెలంగాణ అసహ్యించుకోకుండా ఉంటుందా? ముఖ్యమంత్రే మొరటు మనిషిలా ఇష్టారీతిన దారుణ దూషణలు చేస్తుంటే ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత ఉక్రోషం, వెగటుతనం ప్రదర్శించిన వికారపు నాయకుడు గతంలో ఎవరూ లేనేలేరు.
అసలు విగ్రహ రాద్ధాంతం రాజేసిందెవరు? గత బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ తల్లిని ప్రతిష్టించడం కోసం సిద్ధం చేసిన స్థలంలో, మాజీ ప్రధాని ప్రతిమ పెడతానని హడావుడి మొదలు పెట్టిందెవరు? ఇలా రేవంత్‌రెడ్డి సర్కార్ మూర్ఖత్వంతో, తెలంగాణ చరిత్రలోకి చొరబడే ప్రయత్నం చేస్తుంటే, ఆత్మగౌరవంపై అన్యాయమైన దాడికి పాల్పడుతుంటే గులాబీదళం మౌనంగా ఎలా ఉండగలదు? ప్రజల భావోద్వేగాలతో పెనవేసుకున్న ఆ స్థలంలో మాత్రమే రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టొద్దని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
దీనికే రేవంత్‌రెడ్డి ఉచ్ఛనీచాలు విస్మరించి, చిన్నారుల సమక్షంలో ఏహ్యమైన భాషతో కారణజన్ముడైన కేసీఆర్‌ను దూషించడం జనాలందరి హృదయాలనూ గాయపరిచింది. రేవంత్‌రెడ్డి నిత్యం తెలంగాణ చరిత్ర చావును కలగంటున్నాడని తేలిపోయింది. ఇంతగా విలువల విధ్వంసానికి పాల్పడుతూ, తెలంగాణ మౌలిక అస్తిత్వంపై విచ్చలవిడిగా రేవంత్‌రెడ్డి సర్కార్ దాడి చేస్తుంటే, మిగతా రాజకీయ పార్టీలైన వామపక్షాలు, కమలం పార్టీ నేతలు మౌనంగా ఉండటం అందరికీ వెగటు పుట్టిస్తున్నది.
ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించకపోయి ఉంటే సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించేవాడా? ఇప్పటికే తెలంగాణ తల్లి కోసం సిద్ధం చేసిన స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్నీ, మరోచోట తెలంగాణ తల్లి ప్రతిమను పెట్టడానికి కుట్రలు చేయడం న్యాయమా..? ఢిల్లీ పెద్దల మెప్పు కోసం, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలను కాలరాయడం కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనం. విగ్రహాలు సైతం విప్లవాలు పుట్టిస్తాయన్న సంగతి కుసంస్కారులకు ఎప్పటికీ అర్థం కాదు. దేనినైనా చూసీచూడనట్లు ఉండవచ్చు, కానీ, చరిత్రలోకి చొరబాటును మాత్రం కలలో కూడా క్షమించలేం.
(వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
– డాక్టర్ ఆంజనేయ గౌడ్