‘చెల్లని రూపాయికి గీతలెక్కువ’.. ‘చేతకాని మనిషికి మాటలెక్కువ’ ఈ సామెతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విషయంలో అక్షర సత్యాలు. 28 నెలల పాలనలో సాధించినదేమీ లేదు చెప్పుకోవడానికి. అసలు పరిపాలనపై పట్టు సాధించలేకపోయాడు. మంత్రులపై కూడా అజమాయిషీ లేదు. పర్యవసానంగా అసెంబ్లీలోనైనా బయటనైనా ఎవరైనా ప్రశ్నిస్తే రేవంత్ సంయమనం కోల్పోయి మాట్లాడడం గమనించవచ్చు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు హామీలు, 420 వాగ్దానాల గురించి ఎవరు మాట్లాడినా రేవంత్‌రెడ్డిలో నిజరూపం బయటకు వస్తున్నది. ఆవేశం కట్టలు తెంచుకుంటున్నది. అసందర్భ ప్రేలాపనలు మొదలుపెడుతున్నాడు. గతంలో మంత్రిగా కూడా కనీసం అనుభవం లేకపోవడంతో ముఖ్యమంత్రిలో అవగాహనారాహిత్యం స్పష్టంగా కనబడుతున్నది.
పదవీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రేవంత్‌రెడ్డిలో అహంభావం కనిపిస్తూ వస్తున్నది. మొదటినుంచి కక్షతో మాట్లాడడం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన పథకాలన్నింటినీ ఉద్దేశపూర్వకంగా అటకెక్కిస్తూ వచ్చాడు. వివక్షాపూరితమైన పాలన, అబద్ధపు పునాదుల మీదనే ఈ ప్రభుత్వం నిర్మితమైనదని స్పష్టమవుతున్నది. ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు ఎంతగా దిగజారారంటే హైదరాబాద్ నగర అభివృద్ధికి వైయస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు నాయుడుల దూరదృష్టి, దార్శనికత కారణమని చెప్పుకొస్తున్నారు. రేవంత్ మాటల్లో ఆయన బానిసత్వం, కేసీఆర్ పట్ల గుడ్డి వ్యతిరేక వైఖరి ప్రస్ఫుటమవుతున్నాయి.
‘గుడ్డలిప్పి కొడతాం, లాగుల్లో తొండలేస్తాం’ అంటూ ప్రధాన విపక్ష పార్టీ మీద అసంబద్ధంగా బహిరంగ సభల్లో మాట్లాడిన రేవంత్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ‘తొక్కుతాం..తల మీద కాలు పెట్టి తొక్కుకుంటూ పోతాం’ అంటూ పదేపదే అసెంబ్లీలో కూడా బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నాడు. బహుశా ప్రజాస్వామ్య వ్యవస్థలోని ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ఈ విధంగా జుగుప్సాకరంగా మాట్లాడలేదు.
ఎన్నికలకు ముందు ఓట్లు దండుకోవడానికి అడ్డగోలుగా హామీలు ఇచ్చి, ఇపుడు ఖజానా ఖాళీగా ఉందని హామీలు నెరవేర్చడానికి సాధ్యం కావడంలేదని చేతులెత్తేయడం విజ్ఞత కాదు. మహిళలకు తులం బంగారం, కల్యాణలక్ష్మి, వృద్ధాప్య పింఛన్ల పెంపు లాంటి హామీలు ఏనాడో అటకెక్కాయి. రైతు భరోసా ఎప్పుడు వస్తుందో తెలియదు?
సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నది అనేది నిజమే. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం భూమి చుట్టూ తిరుగుతున్నది. లగచర్ల, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, మౌలానా ఉర్దూ విశ్వవిద్యాలయం, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ పేరు మీద వేల ఎకరాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నంలో హైకోర్టు అనేకసార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదు. ఇవి చాలనట్లు ఇప్పుడు గాంధీ సరోవర్, మూసీ సుందరీకరణ పేరు మీద మళ్లీ సరికొత్త ‘బిజినెస్’ ప్రారంభించబోతున్నది. మూసీ నది ఇరువైపులా బఫర్ జోన్ పరిధిని పెంచి వేలాది ఇండ్లను కూల్చివేస్తూ లక్షలాది మందిని నిరాశ్రయులను చేస్తున్నది. వీరంతా మూసీ నదిని కాలుష్యం చేస్తున్నారట. కానీ ప్రభుత్వం మాత్రం భవిష్యత్తులో మూసీ నది ఒడ్డున నైట్ ఎంటర్టైన్మెంట్ పేరుతో పార్కులు ఆకాశహర్మ్యాలు నిర్మిస్తుందట. నైట్ ఎకానమీ అని దానికి నామకరణం. మరి దీనివల్ల మూసీ నది కాలుష్యం జరుగదా? మూసీ నదిని శుద్ధి చేస్తే ఎవరికీ అభ్యంతరం అనుమానాలు ఉండవు. కానీ సుందరీకరణ అనే అందమైన నామకరణంతో లక్షన్నర కోట్లతో దశలవారీగా చేపట్టే ఈ ప్రాజెక్టు మధ్యతరగతి పాలిట శాపం. మూసీ నది సుందరీకరణలో అవినీతి వరద పారడానికి సిద్ధంగా ఉంది.
నిరాడంబరజీవి మహాత్మాగాంధీకి ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహం నిర్మించాలట. గాంధీ సిద్ధాంతాలు ఆచరించని ప్రభుత్వం ఆ మహాత్ముడిని ఎత్తైన విగ్రహంతో స్మరించుకోవాలని అనుకోవడం ఆశ్చర్యకరం. విగ్రహాలతో కాదు..ఆయన సిద్ధాంతాల ఆచరణతో ఆ జాతిపితను సదా గౌరవించుకోవాలి.
లక్షన్నర కోట్ల రూపాయల ప్రణాళికలతో ప్రతిపాదనలతో డీపీఆర్ లేకుండా ప్రభుత్వం యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడింది. ఒకపక్క ఖాళీ ఖజానా అని చెబుతూనే మరోపక్క అలవికాని, అనవసరమైన ఖర్చుతో కూడిన ప్రాజెక్టులను తలపెట్టడంలో ఆంతర్యం ఎవరికి తెలియదు? ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోనూ వందలాది ఇండ్ల్లను కూల్చివేశారు. బాధితులకు మళ్లీ పట్టాలు ప్రదానం చేసినట్లు హడావిడి చేశారు. 61 ఎకరాల భూమి కాస్త 31 ఎకరాలుగా మారినా మిగిలిన 30 ఎకరాలు చాలా తెలివిగా స్థిరాస్తి వ్యాపారం కోసం అస్మదీయులకు ధారాదత్తం చేశారు.
రేవంత్ సర్కార్ ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. ఒక్క ప్రాజెక్టు అయినా నిర్మించలేదు. రెండున్నరేండ్ల లోపలే రూ.3.47 లక్షల కోట్లు అప్పు మాత్రం చేశారు. అన్ని రంగాల్లోనూ తిరోగమనమే జరుగుతున్నదని పలు నివేదికలు చెప్పకనే చెబుతున్నాయి. అయినా ఎదురుదాడికి దిగుతూ ప్రధాన ప్రతిపక్షాన్ని ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా నోరు మూయించే ప్రయత్నం జరుగుతున్నది. ఎండాకాలానికి సంకేతంగా కరెంటు కోతలు మొదలయ్యాయి. పంటలు కోతకు వచ్చే పరిస్థితుల్లో రైతు భరోసా హడావుడి జరుగుతున్నది. ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు. రేవంత్ నోటి ద్వారా వచ్చే పరుష పదజాలానికి ప్రజలు ఓటు ద్వారా జవాబు చెప్పడానికి సిద్ధపడుతున్నారు.