‘ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు’ అన్న పద్యం మనందరికీ పరిచితమే! కానీ ఉపయోగంలోనే వాటి లక్షణాలు బయటపడుతాయి. అలాగే మనుషుల్లో అసాధారణ మానవులు కూడా ఉంటారు. వివిధ స్థాయుల్లో ప్రవర్తిస్తుంటారు. వీడు ఇంకా ఏం మాట్లాడతాడు? ఇంకా ఎంత దిగజారుతాడు? అన్న మన ఆలోచనను చిత్తు చేస్తూ ఆ మనిషి ఇంకా అబ్బురపోయే మాటలు, చేతలు చేస్తుంటాడు. అటువంటి వారు రాజకీయాల్లోకి రావడమే ప్రజల దురదృష్టమైతే, ప్రజాప్రతినిధులుగా ఎన్నికవడం ఇంకా తలనొప్పి. ఇంతటితో ఆగకుండా వారు ఒక రాష్ట్రంలో రాజకీయ పార్టీకి అధ్యక్షులుగా నియమింపబడటం ఆ పార్టీ అధిష్టానాల స్థాయిని తెలుపుతుంది.
ఒక్క రాష్ర్టాన్ని విజయవంతంగా పాలిస్తున్న ప్రభుత్వ నైతిక బలాన్ని అబద్ధాలతో, తిట్లతో తగ్గించలేమని తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చుకున్నది. ఇంకా పాత జాతీయ పార్టీకి ఆ తెలివి రాలేదు. అందుకే ఈ వ్యాసం రాయవలసి వస్తున్నది. దాదాపు రెండు దశాబ్దాలు తెలంగాణకు ద్రోహం చేసిన బద్ధ విరోధి చంద్రబాబు పార్టీలో ఉన్న రేవంత్‌రెడ్డి తను నిఖార్సయిన తెలంగాణవాదినని చెప్పుకోవడం కంటే వింత మాట ఏదైనా ఉందా? 2001 నుంచి తను తెలంగాణ కోసం ఏం చేశాడో, ఇక్కడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తన బాస్‌తో కనీసం వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పాడా వివరించగలడా? పోనీ విపక్ష పార్టీలో ఉండి 2004 నుంచి 2009 దాకా తెలంగాణ వారిమీద కాంగ్రెస్ చేసిన దాష్టీకాలని అసెంబ్లీలో ప్రశ్నించాడా? విద్యార్థుల మీద వేల కేసులు పెడితే ఉద్యమకాలంలో వారిని పలకరించాడా? మలేషియా వెళ్లి 68 వేల కోట్లు చంద్రబాబు బినామీగా ఏ బ్యాంకుల్లో డిపాజిట్లు చేశాడో అయినా చెప్తాడా? తను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమాన్ని గానీ, ఉద్యమకారులను కానీ సమర్థిస్తూ మాట్లాడిన ఒక ఆడియో, వీడియో చూపించగలడా? నిధులు, నీళ్లు, ఉపాధి, ఉద్యోగాలు ఆంధ్రవాళ్లు కొల్లగొడుతుంటే వాటిగురించి మాట్లాడిన ఒక్కమాట చెప్పగలడా? అదంతా తెలుగుదేశం అనబడే ఆంధ్ర దేశ పార్టీలో ఉన్నప్పుడు జరిగింది. ఆ కాలంలో తాను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడిన ఆడియోలు, మాటలు విడుదల చేస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటాడు రేవంత్‌రెడ్డి?
ఇక తెలుగు (ఆంధ్ర) దేశం పార్టీకి తెలంగాణలో స్థానం లేదని తెలుసుకొని కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా, ఆ పార్టీ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడయ్యాడు. కేవలం అబద్ధాలు ప్రచారం చేయడం, వ్యక్తిగత దూషణలు తప్ప ఏమైనా తెలంగాణ విషయాలు మాట్లాడాడా ఇప్పటిదాకా? అసలు అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఒక ఎన్నికైన ప్రతినిధిని డబ్బుతో కొనటానికి ప్రయత్నిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నేరస్థుడు గొంతెత్తి ఇతరుల మీద నేరారోపణ (అదీ అబద్ధాలతో) చేయటమే! బీఆర్ఎస్ చేసిన ఒక్క కార్యక్రమం ఇక్కడ నాలుగు దశాబ్దాల్లో ఆయన పార్టీ కాంగ్రెస్ చేసిందా? ఆ చర్చ చేయాల్సింది అసెంబ్లీలో. సామాజిక మాధ్యమాలలో, టీవీ ఇంటర్వ్యూలలో నోటికొచ్చిన మాటలు మాట్లాడటం కాదు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలి సత్తువ, ధైర్యం ఉంటే! కాంగ్రెస్ పార్టీ ఎన్నేండ్లు ఏడిపించి, ఎన్ని ప్రాణాలు పోయాక, తెలంగాణ సంపద ఎంత దోచుకోబడ్డ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రకటన చేసిందో ప్రజలకు తెలియదా? ఆత్మహత్యలు చేసుకున్న యువత కుటుంబాల ఉసురు ఎక్కడ తగులుతుంది?
మరి స్థానిక పరిపాలన కోసం టీఆర్ఎస్ పార్టీ స్థాపించాకైనా రేవంత్‌రెడ్డి బుద్ధి మారిందా? అవాకులు, చెవాకులు, అసలు విషయాలు మాట్లాడమంటే రైతుల వసతులు తగ్గించటం, సంక్షేమం తీసెయ్యటం! కర్ణాటకలో గెలిచి ఆ పార్టీ ఏమి ఉద్ధరిస్తోంది ప్రజలకు కనిపిస్తలేదా? వేరే కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలలో ఏం సంక్షేమాలున్నాయో తెలంగాణ ప్రజలకు తెలియదా?
ఇక ఇప్పుడు సుప్రీంకోర్టు ఇటువంటి నేరాలు చేసిన వాళ్లను, చంద్రబాబులాగా స్టేల మీద బతుకుతున్న వాళ్లను సుమోటోగా కేసులు తీసుకొని రాజకీయాల నుంచి తప్పించాలి. అసలు న్యాయవ్యవస్థ గట్టి చర్యలు తీసుకోకపోతే రేవంత్‌రెడ్డి లాంటి నేరస్థులు చెలరేగిపోతారు. ఇటువంటి చీడ పురుగుల బెడద వదిలించకపోతే రాజకీయ వాతావరణం బాగుపడదు. ఈయన చంద్రబాబు బినామీగా ఎక్కడెక్కడ ఆస్తులు దాచుకున్నాడో బయటకు తీయాలి. ఇక ఇప్పుడు అసభ్యంగా మాట్లాడిన మాటలు కూడా సహించకూడదు. నేరస్థులను కఠినంగా శిక్షించే వ్యవస్థ రాకపోతే రాజకీయవ్యవస్థ భ్రష్ఠు పట్టి, అది సామాజిక, ఆర్థిక వ్యవస్థలను కూడా మలినం చేస్తుంది. ఇటువంటి అనాగరిక నాయకుల కింద ఇంకొంత మంది యువత అనాగరికంగా తయారయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వీరిని ఉపేక్షించకూడదు. అప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు గనే నాగరిక సమాజం ఏర్పడే అవకాశం ఉంది.
-కనకదుర్గ దంటు
89772 43484