తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ద్రోహం, మోసం, కుట్రలు పట్టపగలే బట్టబయలయ్యాయి. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడిందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంతో కలిపి దశాబ్దాలు అన్యాయానికి గురిచేసిన కాంగ్రెస్ ఇప్పుడు రాజకీయ పబ్బం కోసం తెలంగాణను మళ్లీ సమైక్యాంధ్రగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నదా ఏంది అనిపిస్తున్నది.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ అడుగుల ద్వారా అదే అనుమానం కలుగుతున్నది. ఇందులో కాంగ్రెస్ హైకమాండ్ పాపమెంతో కానీ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఆ పార్టీ ముఖ్యమంత్రిగా మళ్లీ సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని తేటతెల్లమవుతున్నది. ఇది ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రాజకీయ క్రీడలో తెలంగాణ రాష్ర్టాన్ని నామరూపాల్లేకుండా చేసే కుట్ర జరుగుతున్నదని అనిపిస్తున్నది.
రాజకీయ ప్రతీకారమో? లేక తెలంగాణ అస్తిత్వాన్ని సమాధి చేసే కుట్రనో గానీ కాంగ్రెస్ నాయకుడిగా, తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి ఖమ్మం సభలో చేసిన వ్యాఖ్యలు అనుచితం. బీఆర్ఎస్ దిమ్మెలు కూలగొట్టాలని టీడీపీ శ్రేణులకు బహిరంగంగా పిలుపునివ్వడం తెలంగాణవాదులను ఆలోచింపజేస్తున్నది. తెలంగాణలో టీడీపీకి పురుడుపోసి, దానికి నాయకత్వం వహించేందుకు రేవంత్‌రెడ్డి అడుగులు వేస్తున్న వైనాన్ని సమాజం గమనిస్తున్నది. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేక విధానాలతో. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం అంజయ్య హయాంలో కాంగ్రెస్ పాలకులు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారంటూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు.
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని చంద్రబాబు హస్తగతం చేసుకున్న చరిత్ర, తెలంగాణ వాదాన్ని అణచివేసిన చరిత్ర అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు రేవంత్‌రెడ్డితో కలిసి పన్నిన ఓటుకు నోటు పన్నాగం గురించి కూడా తెలిసిందే. దీంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయింది.
చంద్రబాబే ఇక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. కానీ గురువు చంద్రబాబుతో తెలంగాణ వ్యతిరేక రాజకీయాలు నెరపిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు టీడీపీకి మళ్లీ జీవం పోసే కుట్రలకు తెరతీశారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నారా? టీడీపీలో కొనసాగుతున్నారా? ఎన్డీఏ కూటమిలో చేరారా? అని సందేహాలు రేకెత్తించారు. రేవంత్ తన అసలు నైజాన్ని బయటపెట్టుకున్నారు. రేవంత్ వ్యాఖ్యలతో తెలంగాణ వాదులు, ఉద్యమకారులు నిప్పులు చెరుగుతున్నారు.
తెలంగాణలో చంద్రబాబు ’పునరాగమనం’ అంటే రాజకీయ ద్రోహం లేదా సెంటిమెంట్ దెబ్బగా చూడాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు కావొస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకా వెంటాడుతున్నాయని సీఎం రేవంత్ రాజకీయ కదలికలను బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలంగాణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చూపుతున్న రెండు కండ్ల సిద్ధాంతం ఇప్పటికీ కొనసాగుతున్నది.
ఇదంతా కూడా తెలంగాణలో టీడీపీని పునరుద్ధరించి, ఆంధ్రా ఆధిపత్యాన్ని మళ్లీ నెలకొల్పాలనే కుట్ర. అందుకే రేవంత్‌రెడ్డి పదేపదే చంద్రబాబును కీర్తిస్తున్నారు? తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రమాదకర ఆటను ఆడుతున్నారు. బనకచర్ల, నల్లమలసాగర్‌తోపాటు నీటి వివాదాలు, ఆస్తుల విభజన, హైదరాబాద్ సమస్యలు పరిష్కారం కాలేదు. దీనికి టీడీపీ అండతో ఉన్న బీజేపీ కూడా విద్రోహానికి పాల్పడుతున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత చంద్రబాబు టీడీపీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేసి, పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు.
ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. తెలంగాణ ప్రజలు స్వాభిమానంతో జీవిస్తారు. ఆంధ్ర పాలకుల ఆధిపత్యాన్ని, దోపిడీ విధానాలను ఆమోదించరు. రేవంత్‌రెడ్డి తన చంద్రబాబు భజనలు మాని, తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి. కనీసం ఆంధ్రా కుట్రలకు బాటలు వేయవద్దు. మళ్లీ కూటమి భుజాలపై, రేవంత్ భజనల మధ్య వస్తున్న చంద్రబాబు పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మన అస్తిత్వానికే పెనుముప్పు ఏర్పడుతుంది.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు)
-గోసుల శ్రీనివాస్‌యాదవ్, 9849816817