సాధారణంగా ఏ పార్టీ నాయకుడైనా సరే, బహిరంగ వేదికల మీద మాట్లాడేటప్పుడు తమ పార్టీ పాలసీలు, అవగాహనలకు అనుగుణంగా మాట్లాడుతూ ఉంటారు. తనకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, బహిరంగ వేదికల మీద ప్రతి నాయకుడూ ఈ సూత్రాన్ని తు.చ తప్పకుండా పాటిస్తూ ఉంటారు. పార్టీ లైన్ విషయంలో ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ కీలక స్థానాల్లో ఉన్నవారు మరింత నిబద్ధతతో వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జాతీయ పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు, రాష్ట్ర కమిటీల అధ్యక్షులు ఈ విషయంలో మరింత ఆచితూచి, జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది.
ఏముఖ్య నాయకుడైనా అజ్ఞానంతోనో, తానేది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందన్న అహంభావంతోనో, పర్యవసానాలను అంచనా వేసుకోలేని మూర్ఖత్వంతో వ్యవహరిం చకూడదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఈ స్పృహనే లోపించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల హిట్లర్‌ను స్ఫూర్తిగా తీసుకొనే తాను హైడ్రాను ఏర్పాటు చేశానని చెప్పుకోవడం! ఇరాన్, ఇజ్రాయెల్‌లో ఎంత విధ్వంసం జరిగిందో అంత కంటే ఎక్కువగా హైదరాబాద్‌లో ఇండ్లు కూల్చివేశామని, కావాలంటే గూగుల్‌లో చూడొచ్చని మాట్లాడటం! ఆయన ఈ వ్యాఖ్యలు చేసింది ఏ చిట్చాట్లోనో, కాలక్షేపపు బాతాఖానీలోనో కాదు! ఏకంగా జాతీయ మీడియా సంస్థ ‘ది హిందూ’ పత్రిక నిర్వహించిన కార్యక్రమంలో. అదీ ఆ పత్రిక పూర్వ సంపాదకుడు, ప్రస్తుత డైరెక్టర్ ఎన్.రామ్ చేసిన ఇంటర్వ్యూలో! ఆ స్థాయి సీనియర్ జర్నలిస్టులు చేసే ఇంటర్వ్యూలలో ఎంత పెద్ద నాయకుడైనా, వివిధ సబ్జెక్టుల మీద ఎంత సాధికారత ఉన్నా సరే చాలా జాగ్రత్తగా, ఆచితూచి మాట్లాడుతారు.
అలాంటి ఇంటర్వ్యూలను వివిధ రంగాలకు చెందిన జాతీయ స్థాయి ప్రముఖులు సైతం గమనిస్తారని, అక్కడ తాను వ్యక్తీకరించే అభిప్రాయాలను బట్టి తన వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకుంటారన్న స్పృహతో మసలుకుంటారు. నిజానికి, తెలివైన నాయకులు తమ వ్యక్తిత్వాన్ని, విధానాలను, నినాదాలను ఉన్నతంగా నిలబెట్టుకొనేందుకు అలాంటి ఇంటర్వ్యూలను ఒక సాధనంగా మలుచుకుంటారు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరించిన తీరు అందుకు విరుద్ధం! తన వ్యక్తిత్వాన్ని తానే కించపరుచుకునేలా, నలుగురిలో నవ్వుల పాలయ్యేలా మాట్లాడటమే కాదు; చివరికి మొత్తం పార్టీనే ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు హయాంలలో కాంగ్రెస్‌కు చెందిన ఏ ముఖ్యమంత్రి అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, వారికి అధిష్ఠానం గట్టిగా తలంటు పోసి ఉండేది. ఎందుకంటే, సీఎం రేవంత్‌రెడ్డికి స్ఫూర్తినిచ్చిన జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ అంతటి క్రూరుడు! రక్తపిపాసి. యుద్ధోన్మాది.
భారత జాతీయోద్యమం సాగుతున్న రోజుల్లో జర్మనీని సందర్శించాలంటూ హిట్లర్ పలికిన ఆహ్వానాన్ని మహాత్మాగాంధీ తిరస్కరించారు. దీనిని బట్టే హిట్లర్ నియంతృత్వ విధానాల విషయంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎంత కఠిన వైఖరితో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కానీ, ఇప్పుడు రేవంత్‌రెడ్డి లాంటి నాయకులు ఏమి మాట్లాడినా, తమ రాజకీయ ప్రత్యర్థులనే బాహాటంగా స్తుతిస్తున్నా, చివరికి తాను ప్రవచిస్తున్న సిద్ధాంతాలనే గేలి చేసేలా పరిపాలన సాగిస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి రాహుల్‌గాంధీది.
జాతీయ, అంతర్జాతీయ అంశాలు, చారిత్రక ఘటనల మీద ఆయనకున్న పరిజ్ఞానం, అధ్యయనమే అంతంత మాత్రం! ఇక తాను మాత్రం ఏమని మందలించగలడు?! ఏ హితబోధలు చేయగలడు? ఉన్న నాలుగు రాష్ర్టాల్లో ఏదో ఒకరకంగా తమ పార్టీ పేరిట అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాంగ్రెస్ అధిష్ఠానానికి పెద్ద సవాలై కూర్చున్న రోజులివి.
పార్టీకి ఉన్న ఈ బలహీనతే రేవంత్‌రెడ్డి లాంటి నాయకులకు వరంగా మారుతుంటే, కాంగ్రెస్ పార్టీకి కక్కలేని, మింగలేని పరిస్థితిని సృష్టిస్తున్నది. అందుకే కాబోలు హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రాను ఏర్పాటు చేశామంటున్న తమ పార్టీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించాల్సిన సందర్భంలోనూ ఆ వ్యాఖ్యలను సమర్థించేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా నానా ప్రయాస పడాల్సి వస్తున్నది! ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగీకరించినట్టుగా హైడ్రాది నియంత శైలే! ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, న్యాయవ్యవస్థ నిర్దేశించిన అన్ని విలువలు, నియమాలను ధ్వంసం చేసే విధ్వంసక సంస్కృతే! ఎప్పుడు ఏ తెల్లవారుజామున ఏ ఇంటి మీద ఎన్ని బుల్డోజర్లతో విరుచుకుపడుతుందో, ఎవరి బతుకులు కూల్చివేస్తుందో తెలియదు! హైకోర్టులో వాదనలు జరిగిన ప్రతిసారీ హైడ్రాకు, దాని కమిషనర్‌కు అక్షింతలే! న్యాయమూర్తులు ఎన్ని ఘాటు వ్యాఖ్యలు చేసినా, ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా దాని వ్యవహార శైలి మారడం లేదు.
హైడ్రా చేపట్టిన కూల్చివేతల ద్వారా హైదరాబాద్‌లో భయోత్పాతం సృష్టించామని ముఖ్యమంత్రి ఏదో ఘనకార్యం చేసినట్టు ఒకవైపు చెప్పుకొంటుండగా, మరోవైపు, అధికార పార్టీకి చెందిన నేతలు భూకబ్జాలు, భూదందాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలొస్తున్నాయి. అధికార పార్టీతో సన్నిహితంగా ఉండే బడాబాబుల విషయంలో ఒకరకంగానూ, సామాన్య ప్రజల విషయంలో మరో రకంగానూ వ్యవహరిస్తున్నదన్న విమర్శలు హైడ్రా మీద ఉండనే ఉన్నాయి. పోనీ, ఆ ‘బుల్డోజర్ న్యాయమైనా’ అన్ని ఆక్రమణల విషయంలోనూ ఒకేరకంగా ఉన్నదా అంటే అదీలేదు! ‘బలవంతులు బతకాలి.. బలహీనులు చావాలి’ అనే హిట్లర్ సిద్ధాంతంతో స్ఫూర్తి పొందినవారి నుంచి ఇంత కన్నా మెరుగైన విధానాలు ఆశించడం అత్యాశే.
రాష్ట్రంలోని కొన్ని లక్షల కుటుంబాల ఆర్థిక వ్యవస్థను, వారి మానసిక పరిస్థితిని, వారి భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేసే ఫీజురీయింబర్స్‌మెంట్, రైతుభరోసా, ధాన్యం కొనుగోళ్లు, పంటలకు బోనస్ తదితర పథకాల విషయంలో ఆయన అనుసరిస్తున్న వైఖరి పూర్తిగా నియంత స్వభావాన్నే ప్రతిబింబిస్తున్నది. ఎకరాకు రూ.12,000 చొప్పున రైతుభరోసా, క్వింటాల్ సన్నధాన్యానికి రూ.500 చొప్పున బోనస్ చెల్లించాలన్నది క్యాబినెట్ సమావేశంలోనే తీసుకున్న నిర్ణయం. కానీ, ఏ ఒక్క సీజన్లోనూ అవి సంపూర్ణంగా అమలుకావు! పదిహేను లక్షల విద్యార్థులు, వారి కుటుంబాలు, వందల కాలేజీలు, వాటిలో పనిచేస్తున్న వేలాది అధ్యాపకులు, సిబ్బంది జీవితాలతో ముడిపడిన ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలోనూ అదే విపరీత ధోరణి. అదే హిట్లరీకరణ విధానం!
ప్రభుత్వాలకు బడ్జెట్ ఉన్నట్టుగానే, ప్రతి కాలేజీకి, ప్రతి రైతుకూ, ప్రతి కుటుంబానికీ ఒక బడ్జెట్ ఉంటుంది. ప్రభుత్వం చెల్లించాల్సిన, హామీ పడిన నిధులను వారికి సకాలంలో ఇవ్వకపోతే ఆయా సంస్థలు, కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతాయి. అంతులేని మానసిక క్షోభ అనుభవిస్తాయి. ప్రభుత్వం మొండిచేయి చూపితే తమ భవిష్యత్తు ఏమిటి? అన్న ఆందోళనతో నిద్రపట్టని రాత్రులు గడుపుతాయి.
ఇవాళ ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం ఎదురుచూస్తున్న కాలేజీలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు ఈ సీజన్లోనైనా రైతుభరోసా, బోనస్ డబ్బులు ఇస్తరో ఎగ్గొడుతరోనని ఆందోళన చెందుతున్న రైతులదీ అదే పరిస్థితి. ‘నియంతృత్వం’ అంటే అన్యాయంగా అరెస్టులు చేయించడం, జైళ్లలో కుక్కడం మాత్రమే కాదు; లక్షలాది ప్రజల ఆర్థికశక్తిని కుళ్లబొడువ డం, మానసిక వేదనకు గురిచేయడం, జీవన ప్ర మాణాలను ధ్వంసం చేయడం కూడా! పాలనలో మానవీయ కోణం లోపించిన పాలకుడు హిట్లర్‌ను మించిన నియంతే.
-కందిబండ కృష్ణప్రసాద్ ,91827 77010