తెలంగాణలో అత్యధికంగా 35 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యమైన భూమి ఉన్న ప్రాంతం ఉమ్మడి పాలమూరు జిల్లా. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిన పాపానికి అతి ఎక్కువగా నష్టపోయిన జిల్లా పాలమూరు అనే విషయం తెలిసిందే. అందువల్లనే తెలంగాణ ఉద్యమంలో పాలమూరు కన్నీళ్లు, కష్టాలు, కరువు, వలస చావులు, ఆకలి చావులు, ఆత్మహత్యలు ప్రముఖ అంశాలై నిలిచాయి. రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ సమస్యలకు పరిష్కారం కోసం, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను కేసీఆర్ నాయకత్వంలో త్వరితగతిన పూర్తిచేశారు. చెరువులు, కుంటలను పునరుద్ధరించి, వందలాది చెక్ డ్యామ్‌లు నిర్మించి భూగర్భజలాలు పెంచారు. ఇవన్నీ చేసినా పాలమూరు భూములు మొత్తం పచ్చబడవు అని భావించి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు.
ఆరున్నర టీఎంసీల సామర్థ్యం గల జూరాల ప్రాజెక్టు ద్వారా న్యాయం జరగదని భావించి, నిండుకుండలా ఉండే శ్రీశైలం రిజర్వాయర్‌ను సోర్స్‌గా పెట్టుకుని, రోజుకు రెండు టీఎంసీలను ఎత్తిపోసుకునే విధంగా కేసీఆర్ హయాంలో 90 టీఎంసీలకు జీవో ఇచ్చి పనులు ప్రారంభించారు. 2015 జూన్ 11 నాడు శంకుస్థాపన చేశారు. ఈ పరిణామాలతో కండ్లు మండిన కాంగ్రెస్.. ఆంధ్రాలోని తెలంగాణ వ్యతిరేక శక్తులతో జతకట్టి, అనేకరకాల కేసులు వేసి, ప్రాజెక్టు ముందుకు సాగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేసింది. ‘పాలమూరు జిల్లా బిడ్డను. నన్ను ఆశీర్వదించండి. అండగా నిలవండి’ అని చెప్పుకొని, ఎన్నికల సమయంలో కన్నీళ్లు రేవంత్‌రెడ్డి నమ్మబలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కాలువల పనుల టెండర్లు రద్దు చేశారు.
పాలమూరుతోపాటు ఆరు జిల్లాల రైతుల భవిష్యత్తును రేవంత్‌రెడ్డి ఒక్క సంతకంతో పక్కన పెట్టేశారు. పాలమూరు రైతుల ఆశలు, ఆకాంక్షలు, నీటి కోసం ఎదురుచూస్తున్న లక్షల ఎకరాలు, ఇవన్నీ ఆయనకు కేవలం ఓట్ల కోసం మాత్రమే ఉపయోగపడిన ‘ఎమోషనల్ ఓటు బ్యాంక్ అకౌంట్’లుగా మిగిలిపోయాయి. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన పనులను కాదనడం ద్వారా రేవంత్‌రెడ్డి తన అహాన్ని తృప్తి పరచుకున్నారు కానీ, పాలమూరు రైతుల గొంతు కోశారు. వట్టెం పంప్ హౌస్ మునిగిపోయి ఏడాది దాటినా ఒక్కసారి కూడా పాలమూరును సీఎం పట్టించుకోలేదు.
సొంత జిల్లాలోని జలవనరులు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు ఎండిపోతున్నా, తెలంగాణ నీటి హక్కులు, పాలమూరు నీటి హక్కులు కోల్పోతున్నా హైదరాబాద్‌లో కూర్చొని, తన ప్రాంతం గురించి మాట్లాడటం ఎంత దారుణం? పాలమూరు బిడ్డ అని చెప్పి, వ్యక్తి తన సొంత భూమి, పుట్టిన గడ్డ దురవస్థ చూసి కూడా మౌనం వహించడం తగిన పనేనా? బీఆర్ఎస్ ప్రశ్నించడం, పాదయాత్ర చేస్తామని హెచ్చరించడంతో పాలమూరు ప్రాజెక్టుల పరిశీలనకు బయల్దేరుతానని రేవంత్ ప్రకటించారు. ఇది రాజకీయ ఒత్తిడితో చేస్తున్న ‘డ్యామేజ్ కంట్రోల్’ యాత్ర మాత్రమే.
బీఆర్ఎస్ హయాంలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో రూ.35,200 కోట్ల పనులు జరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు జరగడం లేదు. ఈ పథకంలో కీలకమైన ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ హియరింగ్. దానిని బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసింది.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఉన్న కేసులన్నీ తొలగించుకొని, సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన కేసులను దాటుకొని, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ముందు ప్రతిపాదనలు పెట్టింది. అనేక అడ్డంకులు దాటుకొని చివరి దశకు తీసుకువచ్చింది. చివరి దశలో ఉన్న పర్యావరణ అనుమతులు మంజూరు చేయకుండా కేవలం చంద్రబాబునాయుడి ప్రోద్బలంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్‌ను వెనక్కి పంపించారు. ఆ డీపీఆర్ గురించి ఇప్పటివరకు సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు నోరు విప్పడం లేదు? పైగా కేంద్రం చెప్పిందని 45 టీఎంసీలకు ఒప్పుకొంటూ కేంద్రానికి లేఖ రాయడం దుర్మార్గం.
కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పే ప్రసక్తేలేదని బీఆర్ఎస్ అడ్డుకున్నది. ఖరాఖండిగా తీర్మానం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించి చేతులు ముడుచుకున్నది. ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు అత్యంత ప్రాధాన్యం. అందుకే 90 టీఎంసీల నికరజలాలు వాడుకొనేలా కేసీఆర్ హయాంలో ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇది చారిత్రాత్మక నిర్ణయం. గతంలో కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల విషయంలో జీవోలు ఇవ్వకుండా డీపీఆర్‌ల పేరుతోనే ప్రాజెక్టులను చేపట్టారు.
డీపీఆర్ తుది దశలో ఉన్న పరిస్థితుల్లో ఈ పథకం కింద 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ఉద్దేశంతో అన్ని కాల్వల టెండర్లు పిలిచారు. వాటిని ఫైనల్ చేసే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ ప్రభుత్వం టెండర్లు పూర్తి చేసి పనులు ఇచ్చి ఉంటే ఈ రోజు ప్రభుత్వానికి దాదాపు 4 వేల కోట్లు భారం తగ్గేది. ఇప్పటికి నీళ్లొచ్చే దశలో కాలువలు ఉండేవి. కేవలం కేసీఆర్‌కు పేరు వస్తుందన్న దురుద్దేశంతో, ఈ కాలువలు పూర్తయితే నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల చేపట్టలేనన్న భావనతో సొంత ప్రాంత ప్రజల గొంతు కోసేందుకు కాలువల టెండర్లు రేవంత్‌రెడ్డి రద్దుచేశారు. తెలంగాణ సమాజం ఇప్పుడు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇదే. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం ప్రాజెక్టును తెలంగాణకు కాకుండా చేసింది. ఇప్పుడు నాగార్జునసాగర్ నుంచి కూడా ఏపీకి ధారాదత్తం చేసుకునేందుకు గోదావరి అనుసంధానం పేరుతో కుట్రలు చేస్తున్నది. రేవంత్ ప్రభుత్వం వీటిని అడ్డుకోకుంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను క్షమించరు.
(వ్యాసకర్త: వ్యవసాయ శాఖ మాజీ మంత్రి )
– సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి