ఒక విషయం ముందే చెప్పాలి. ఇక్కడ రాస్తున్నది సింద్బాద్ సాహసయాత్రల గురించి కాదు. బాగ్దాద్‌కు చెందిన సింద్బాద్ అనే నావికుని సాహస యాత్రలు, ఆయన ఆ క్రమంలో చూసిన అద్భుతాలు, సాధించిన విజయాల గురించిన కథలు అందరికీ తెలిసినవే. అవి ఎంతోకాలం క్రితంవి అయినా నేటికీ ప్రపంచం అంతటా పాఠకులను చిన్నా పెద్దా తేడా లేకుండా అలరిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం తెలుసుకునేది తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సాహసయాత్రల గురించి. ఆ కథలు కూడా అందరినీ అలరించదగినవే. అయితే అవి మామూలు అర్థంలో సింద్బాద్ వంటి సాహస యాత్రలు కాదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే, అవి అసత్య యాత్రలు. లేదా అసత్య ప్రచార యాత్రలు. అసత్య ప్రచారాలు కూడా సాహసంతో కూడుకున్నవేనని, కనుక వాటిని సాహసయాత్రలని ఎందుకు అనకూడదని ఎవరైనా ప్రశ్నించవచ్చు. అందుకు మన వద్ద సమాధానం లేదు.
ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. రేవంత్‌రెడ్డి ఈ నెల 16న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అయిన కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. అందులో భాగంగా, అక్కడి అధికారపక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేగలమని ప్రకటించారు. ఆ మాట విని ఆనందం కలిగింది. ఎందుకంటే, దేశానికి స్వాతంత్య్రం సాధించిన పార్టీ దేశ రాజధానిలో అధికారాన్ని కూడా సాధించటమంటే అంతకన్న వేరే భావన ఎందుకు కలుగుతుంది. అయితే, అక్కడ కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో లేని మాట అకస్మాత్తుగా గుర్తుకువచ్చింది. అయినప్పటికీ, గత ఎన్నికల్లో ఏదో కొద్ది సీట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయి ఉంటుందనిపించింది.
కచ్చితమైన సీట్ల అంకెలు వెంటనే గుర్తుకురాలేదు. కనుక అట్లా అనిపించటం సహజమే కదా. పైగా, స్వయంగా ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రి వంటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న నాయకుడు
ఆ మాట అంత భరోసాగా ప్రకటించినప్పుడు, అందుకు తగిన విలువ ఇవ్వకుండా ఎట్లా ఉండగలం?
ఈ విధమైన సద్బుద్ధి కలగటంతో ఎందుకైనా మంచిదని ఒకసారి గత ఎన్నికల ఫలితాలను చూడగా కనిపించింది ఈ విధంగా ఉంది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 70. అందులో ఆమ్ ఆద్మీకి లభించినవి 62. బీజేపీ గెలుచుకున్నవి 8. కాంగ్రెస్ పక్కన ‘0’ కనిపించి ఉలిక్కిపడ్డాను. నమ్మలేక ఎన్నిసార్లు తనిఖీ చేసినా మార్పు లేదు. ఇక ఏమి చేయాలో తోచక అంతకన్న ముందటి 2015 ఎన్నికల ఫలితాలను గమనించగా అక్కడ కూడా ఎటువంటి మార్పు లేకుండా సున్నాయే కనిపించింది. దానితో హతాశుడిని కాగా ఇక తక్కిన పార్టీల సంగతి తెలుసుకోవాలనిపించలేదు. అందువల్ల ప్రయోజనం మాత్రం ఏమున్నది గనుక?
ఇంత జరిగినా ఒక చిరు ఆశ మాత్రం మిణుకు మిణుకుమంటూ, నదికి ఆవలి గట్టున దీపం వలె తోచింది. అది ఏమంటే, రేవంత్ రెడ్డి వంటి నాయకుడు ఒక మాటను ఉబుసుపోకకు అనరు. అది కూడా నలుగురు మిత్రులతో డ్రాయింగ్ రూములో కూర్చుని కబుర్లాడుకుంటున్నప్పుడు తప్ప, బహిరంగ సభలో ఎంతో జాగ్రత్తగా మాట్లాడతారు. ఒక్కొక్క మాటను ఆచితూచి. అటువంటి స్థితిలో గత రెండు ఎన్నికల ఫలితాలు తెలిసి కూడా (తనకు స్వయంగా గుర్తు లేకున్నా స్పీచ్ రైటర్లు గాని మరొకరు గాని చెప్పే ఉంటారని భావించాలి) ఈసారి కాంగ్రెస్‌కు అధికారం ఖాయమని బల్ల గుద్దారంటే, అటువంటి ఆత్మ విశ్వాసం లేనిదే ఆ పనిచేయరు గదా.
ఈ ఆలోచనతో ఆ నాటి తన ప్రసంగాన్ని జాగ్రత్తగా శోధించినప్పుడు కొన్ని అంశాలు దృష్టికి వచ్చాయి. అది కూడాఆయనకు అనుకూలమని పేరుబడిన పత్రికలలో. ఆ విధంగా కనిపించినవి ఈ విధంగా ఉన్నాయి. తమ ప్రభు త్వం తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలుచేసింది. అదే ప్రకారం తమ పార్టీ ఢిల్లీలోనూ అమలుచేస్తుంది. అది కూడా తెలంగాణ స్ఫూర్తితో. ఢిల్లీ హామీల అమలుకు భరోసా తనదే. ఈ మాటలు అంటూ, తెలంగాణలో ఆరు గ్యారెంటీల డాక్యుమెంట్ తరహాలో ఢిల్లీ ప్రజల కోసం కూడా గ్యారెంటీల పోస్టర్ ఒకటి ఆవిష్కరించారు. వాటిని తర్వాత తెలంగాణలో వలెనే బాండ్ పేపర్‌గా మార్చి ఇంటింటికి తిరిగి పంచుతారేమో తెలియదు. ఇది తప్పక తెలుసుకోవలసిన ఒక్క ముఖ్య విషయం. అన్నట్టు ఆయన తెలంగాణ యువతకు తాము అధికారానికి వచ్చిన ఏడాదిలోనే 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కొత్తగా సృష్టించి, వాటికి నోటిఫికేషన్లు కూడా తామే జారీచేసి, నిరుద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చి వేసినట్టు కూడా నూటా ఒకటవ సారి చెప్పినట్టున్నారు. అదేవిధంగా, తమ మ్యానిఫెస్టో హామీ ప్రకారం మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలన్న లెక్కలో ఇప్పుడు ఏడాది పూర్తయ్యాక ఇక మిగిలింది లక్షా నలభై అయిదు వేలు మాత్రమేనని కూడా అన్నట్టున్నారు. ఇదింకా పత్రికల్లో చెక్ చేయాల్సి ఉన్నది.
ఇవన్నీ ఎట్లున్నప్పటికీ, అంతమాత్రాన కాంగ్రెస్ బలాన్ని 0/70 నుంచి 36/70కి పెంచి అధికారాన్ని అప్పగించేందుకు ఢిల్లీ వాసులు అమాయకులా? కారని రేవంత్‌రెడ్డికి బాగా తెలుసు. భోజనం ఎంత షడ్రసోపేతమైనా ఆఖరున ‘మాల్ మసాలా’ తప్పదని అనుభవంతో తెలుసుకున్న విషయం. కనుక, ‘ఆప్’ ఒక లిక్కర్ పార్టీ అని, దానిని ఓడించగలమని ఘాటైన ప్రకటన చేశారు. అందువల్ల, ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు, కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించి, 15 ఏండ్ల సుదీర్ఘ వ్యవధి తర్వాత తిరిగి అధికారానికి రాగలదని, ఆ విధంగా రేవంత్‌రెడ్డి ప్రతినను ఢిల్లీ ఓటర్లు మన్నించగలరని తప్పకుండా నమ్మవచ్చు.
అంతకన్న మార్గాంతరం లేదు కూడా. ఎందుకంటే, రేవంత్ రెడ్డి ఇదే విధమైన సాహసయాత్ర ఒక్కటి చేసి తమ పార్టీ కోసం ఘన విజయం సాధించిన ఉదాహరణ ఒకటి ఇటీవలి మహారాష్ట్ర ఎన్నికలు. అక్కడ ఆయన పత్రికలలో అడ్వర్టయిజ్మెంట్లు, మీడియా సమావేశాలు బహిరంగ సభల ప్రసంగాల ద్వారా, తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలుచేసినట్టు, 55 వేల ఉద్యోగాలు సృష్టించి ఇచ్చినట్టు బాగా ప్రచారం చేశారు. అక్కడ కాంగ్రెస్ ఇచ్చిన ఏడు గ్యారెంటీల అమలు బాధ్యత తనదన్నారు. అదంతా ఓటర్లు నమ్మే ఉంటారు. దానితో, ఇక తమకు అధికారం గ్యారెంటీ అని ‘ఇండియా’ కూటమి కూడా గాఢంగా నమ్మింది. చివరికి తక్కిన ఫలితాల మాట అట్లుంచితే, కాంగ్రెస్ సీట్లు 2019 నాటి 44 నుంచి 16కు పడిపోయాయి. తెలంగాణ వారు పెద్ద సంఖ్యలో ఉన్నారనే సుమారు 10 స్థానాలలో ఆయన ప్రచారం చేయగా, అందులోని సున్నా శూన్యంలో కలిసిపోయి ఒకటింట మాత్రం గెలిచినట్లున్నారు. ఆ ఒక్కటైనా రావటానికి మాత్రం రేవంత్ బలమైన ప్రచారం, తెలంగాణలో హామీల అమలు కారణాలని నమ్మకంగా చెప్పవచ్చు.
ఈ విధమైన సాహస యాత్రల ద్వారా మహారాష్ట్రలో అధికారం పట్ల ఆశలు కల్పించి, ప్రస్తుతం ఢిల్లీలోనూ కల్పిస్తున్న రేవంత్ రెడ్డి, ఇక భవిష్యత్తులోకి దీర్ఘదృష్టిని సారిస్తూ జరుపవలసిన బృహత్కార్యం ఒకటున్నది. అది, ఎందువల్లనైతేనేమి కకావికలమవుతున్న ‘ఇండియా’ కూటమిని పటిష్ఠపరిచి, దాని నాయకత్వ స్థానంలో ప్రమాదకరంగా ఊగిసలాడుతున్న తమ పార్టీ ఆధిపత్యాన్ని సుస్థిరం చేయటం. ఆ తర్వాత, రానున్న మాసాలు, సంవత్సరాలలో జరుగనున్న వివిధ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల కోసం కూడా ఇదే విధంగా సాహస యాత్రలు చేసి కాంగ్రెస్ విజయానికి మూలకారణం కావటం. ఇంకా తర్వాత, 2029 లోక్‌సభ ఎన్నికలలో, ఆ పార్టీని (ఢిల్లీ వలెనే) 15 ఏండ్ల పిదప తిరిగి కేంద్రంలో అధికారానికి తేవటం. అప్పు డుగాని ఆయన సాహసయాత్రల అంతిమ ఫలి తం సిద్ధించదు. అప్పుడు, సింద్బాద్ వలెనే త న యాత్రా కథనాలను కూడా రచయితలు వర్ణించగా, గాయకులు కీర్తించగా, చిత్రకారులు రంగులలో చిత్రించగా, అవి రాజకీయ జానపద సాహిత్యంగా శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆయన కీర్తి ఆచంద్రతారార్కమవుతుంది.
2029 లోక్‌సభ ఎన్నికలలో, ఆ పార్టీని (ఢిల్లీ వలెనే) 15 ఏండ్ల పిదప తిరిగి కేంద్రంలో అధికారానికి తేవటం.అప్పు డుగాని ఆయన సాహసయాత్రల అంతిమ ఫలి తం సిద్ధించదు. అప్పుడు, సింద్బాద్ వలెనే త న యాత్రా కథనాలను కూడా రచయితలు వర్ణించగా, గాయకులు కీర్తించగా, చిత్రకారులు రంగులలో చిత్రించగా, అవి రాజకీయ జానపద సాహిత్యంగా శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆయన కీర్తి ఆచంద్రతారార్కమవుతుంది.
-టంకశాల అశోక్