రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల కనీస వేతనాలను భారీస్థాయిలో పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 21న ప్రకటించారు. పెరిగిన కనీస వేతనాలను జూన్ 1 నుంచి అన్ని సంస్థలకు అమలు చేస్తామని, ఇది అమలు జరిగేలా కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంటులో గల కోటి 11 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు, వారి కుటుంబాలకు మేలు జరుగనున్నది. అయితే, ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల పెంపు అసంబద్ధంగా, అన్యాయంగా ఉందనేది అర్థమవుతున్నది. 1948 నాటి కనీస వేతనాల చట్టం, కార్మిక సంఘాల డిమాండ్లు, 1991 నాటి సుప్రీంకోర్టు ఆదేశాలు, డాక్టర్ ఆండ్రాయిడ్ ఫార్ములా, రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. సర్కార్ నిర్ణయంతో కనీస వేతనాల పెంపు వల్ల రాష్ట్రంలోని అన్నిరంగాల్లో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు లాభం చేకూరకపోగా తీరం నష్టం చేస్తుందనేది వాస్తవం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటింది. ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి తమ ఎన్నికల ప్రణాళికలో కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకు ఎంతమాత్రం సిద్ధం కాలేదని విశదమవుతున్నది. కార్మికుల కనీస వేతనాలను భారీగా పెంచుతున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటనలు కూడా ప్రచారం ఘనం.. ఫలితం శూన్యం కానున్నది. కార్మికుల కరువుభత్యం కనీస వేతనాల్లో కలిపే ఆలోచన సైతం చేయలేదు.
బీఆర్ఎస్ హయాంలో అన్‌స్కిల్డ్ కార్మికులకు కనీస వేతనం రూ.1,809గా నిర్ణయించి కరువుభత్యం (డీఏ) పాయింట్ ఒక్కింటికి రూ.12గా నిర్ణయించింది. కనీస వేతన సలహా బోర్డు సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నది. దీని ప్రకారం 2021 జూన్ 25న కేసీఆర్ సర్కార్ ఐదు జీవోలను జారీ చేసింది. కానీ ప్రస్తుత పాలకులు రెండున్నరేండ్ల కాలంలో గెజిట్ కూడా విడుదల చేయకుండా వదిలివేశారు.
కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు కనీస వేతనాన్ని రూ.14 వేలకు కుదించటమే కాకుండా, డీఏ పాయింట్లను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటి పది లక్షల మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులకు అన్యాయం చేయటమే అవుతుంది. ప్రభుత్వ వైఖరి పెట్టుబడిదారులు, యాజమాన్యాలకు మేలు చేసేదిగా ఉన్నదని స్పష్టమవుతున్నది.
పెంచిన వేతనాల్లో పెరుగుదల లేకుండా ఉండటమే కాకుండా ప్రస్తుతం పొందుతున్న కనీస వేతనాలపై రూ.8,444 వరకు కార్మికుడు నష్టపోతున్న పరిస్థితి నెలకొననున్నది. కార్మికులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ పూనుకుంటున్నది. నిజంగా కార్మికుల వేతనాల పెంపునకు చిత్తశుద్ధితో కృషిచేయాలని భావిస్తే కార్మిక సంఘాలు, సంబంధిత అధికారులతో చర్చించాలి. ప్రస్తుతం అమలు జరుగుతున్న వేతనాలు, పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, కార్మికుల జీవన ప్రమాణాలను గుర్తించటం ద్వారా సరైన నిర్ణయం తీసుకొని ఉండాల్సి ఉన్నది. కానీ ఈ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయకపోవటంతో కనీస వేతనాలను పెంచాలనే నిజాయితీతో కూడిన ఆలోచన ఎంతమాత్రం లేదని స్పష్టమవుతున్నది.
వాస్తవానికి నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, కార్మికుల జీవన ప్రమాణాలు, సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు కార్మికుల కనీస వేతనం రూ.32 వేలుగా నిర్ణయించాల్సి ఉంటుంది. కార్మిక సంఘాలన్నీ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలనే డిమాండ్‌ను న్యాయబద్ధమైనదిగా తీసుకొని ప్రభుత్వం అంగీకరించాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఇప్పటికే అమలు జరుగుతున్న వేతనాల్లో కనీస వేతనంగా రూ.28,444 చెల్లిస్తున్నారు. కనీసం దీనినైనా పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీసవేతనాలు అసంబద్ధంగా ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటకలో కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం 60 శాతం అంటే రూ.19,300 నుంచి రూ.31,100 వరకు పెంచారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కనీస వేతనాల పెంపులో పక్క రాష్ట్రంలోని తమ స్వపక్షం తీసుకున్న నిర్ణయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం విచిత్రం.
ప్రభుత్వం పెంచిన కనీస వేతనాలను ఆయా యాజమాన్యాలు అమలు చేసేలా కార్మిక శాఖ అధికారులకు ఆదేశాలిస్తామని ప్రభుత్వం చెప్తున్నది. వాస్తవానికి కనీస వేతనాలు అమలు చేయించటానికి కార్మికశాఖ అధికారులకు సంపూర్ణ అధికారాలు అప్పగించాలంటే ముందుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లపై స్పష్టమైన ప్రకటన చేయాలి. మోదీ సర్కార్ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తెలంగాణలో అమలు చేసేది లేదని ముందుగా ప్రకటించాలి. రాష్ట్ర క్యాబినెట్ ఈ మేరకు తీర్మానం చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. కానీ ఈ కోడ్లను వ్యతిరేకించకుండా రాష్ట్రంలో కనీస వేతనాల అమలుకు అంగీకారం తెలుపుతూ కార్మిక అధికారులకు అధికారాలు ఇస్తామని ప్రకటించటం మరో మోసపూరితమైన ఆలోచన తప్ప ఆచరణకు తోడ్పడేది ఎంతమాత్రం కానేకాదు.
(వ్యాసకర్త: ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు)
-జే సీతారామయ్య ,94907 00954