సింగరేణిలో ఇప్పటికే గనులను వేలం వేస్తుండగా, తాజాగా మరో కుట్రకు తెరలేచింది. సంస్థలో అత్యంత కీలకమైన సెక్యూరిటీ వింగ్ (రక్షణ విభాగం), మెడికల్ వింగ్ (వైద్య విభాగం)ను ప్రైవేట్వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయం సింగరేణి సంస్థ భద్రతకు అత్యంత ప్రమాదకరం. కార్మికుల ఉద్యోగ భద్రతకు పెనుముప్పు.
సింగరేణి సంస్థలో అనేక విభాగాలున్నాయి. అందులో కీలకమైనది సింగరేణి సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ కార్ప్స్ (ఎస్అండ్పీసీ) విభాగం. సింగరేణిలో ప్రస్తుతం 11 ఓపెన్ కాస్ట్ గనులు, 22 భూగర్భ గనులున్నాయి. వాటికి తోడు అనేక విభాగాలున్నాయి. వాటన్నింటిలో బొగ్గు, కోట్లాది విలువైన యంత్ర పరికరాలు, స్క్రాప్ ఇతర సామగ్రి అపహరణకు గురికాకుండా, సంస్థకు సంబంధించిన విలువైన భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించే బాధ్యత రక్షణ విభాగానిది. ప్రతీ గనికి, ఏరియాకు సంబంధించి ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఉండగా, వారందరికీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నేతృత్వం వహిస్తూ ఉంటారు. కార్మికుల భద్రతను కూడా పర్యవేక్షిస్తుంటారు. ఇలాంటి అత్యంత కీలకమైన ఆ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ప్రైవేట్ వ్యక్తిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించడమే కాదు, ఆ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. సింగరేణి సంస్థలో పనిచేసిన అనుభవం, గనుల్లో పనితీరుపై ఏ మాత్రం అవగాహన లేని, బయటివ్యక్తులను విభాగాధిపతిగా నియమించాలనుకోవడం సరికాదు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
సింగరేణి సంస్థలో ‘మెడికల్ విభాగం’ కూడా కీలకమైనదే. కార్మికులకు మెరుగైన వైద్య సేవలందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. సంస్థలోని కార్మికుల పనిచేసే సామర్థ్యాన్ని కూడా నిర్ధారించి, సర్టిఫికెట్ ఇస్తుంది. ఈ సర్టిఫికెట్ ఆధారంగానే కార్మికులను ఉంచాలా, తొలగించాలనేది నిర్ణయిస్తారు. అత్యంత కీలకమైన ఈ విభాగానికి సంబంధించి అధిపతిని కూడా ప్రైవేట్ వ్యక్తినే నియమించాలని సింగరేణి సంస్థ నిర్ణయించడం సరికాదు. చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ పోస్టును కాంట్రాక్టు పద్ధతిలో నియమించేందుకు ఉద్యోగ ప్రకటనను జారీచేసింది. అయితే అన్ఫిట్ సర్టిఫికెట్లను అడ్డం పెట్టుకుని కార్మికులను తగ్గించే కుట్రలో భాగంగానే చీఫ్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్గా ప్రైవేట్ వ్యక్తిని నియమించేందుకు పూనుకున్నదనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాలపై పునరాలోచించాలి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలి.
నిశితంగా పరిశీలిచిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వ్యూహాత్మకంగా సింగరేణిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి తీసుకువెళ్లడానికి అడుగులు వేస్తున్నాయన్నది తేటతెల్లమవుతున్నది. ఇకనైనా సింగరేణి యాజమాన్యం తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలి. ప్రైవేట్ వ్యక్తులకు కాంట్రాక్ట్ పద్ధతిలో విభాగాధిపతులకు అప్పగించడం వంటి పనులను వీడనాడాలి. ప్రైవేటు వ్యక్తుల ఆధిపత్యంలోకి సింగరేణి సంస్థ వెళ్లకుండా ఆదిలోనే అడ్డుకోవాలి. ప్రైవేట్వ్యక్తుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ను సంస్థ, ప్రభుత్వం తక్షణమే రద్దుచేయాలి.