దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని, జాతీయ పార్టీలైన తమది మాత్రమే ఎదురులేని ఆధిపత్యం కావాలని కాంగ్రెస్, బీజేపీ కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నాయి. అది నెరవేరేది కాదని ఇప్పటికే అనేకసార్లు రుజువైంది. ఈ రెండు జాతీయ పార్టీలు తమ సొంత బలంతో అధికారానికి రాలేక ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోక తప్పని దశ వచ్చిన తర్వాత సైతం, ఒకవైపు వాటిపై ఆధారపడుతూనే మరొకవైపు వాటిని బలహీనపరిచి, చీల్చి, కబళించే వ్యూహాలను సాగిస్తూ వస్తున్నారు. ఆయా పరిస్థితుల్లో ఈ వ్యూహాలు అప్పుడప్పుడు పనిచేసి ప్రాంతీయ పార్టీలు బలహీనపడిన సందర్భాలు లేకపోలేదు. కానీ, అవి చిరంజీవుల వలె తిరిగి అంతలోనే పైకి లేస్తూ జాతీయ పార్టీలకు తమతో కలిసి నడవక తప్పని విధిలేని స్థితిని సృష్టిస్తున్నాయి. కొద్దిరోజుల కిందటి మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఫలితాలు అందుకు తాజా ఉదాహరణ.
ఎదురుగా ఉన్న సీట్ల లెక్కలే ఆ మాట చెప్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ రెండు ప్రాంతీయ పార్టీలతో, కాంగ్రెస్ మూడు పార్టీలతో పొత్తులు కలిసాయి. ఝార్ఖండ్‌లోనూ ఇరువురూ అదే పనిచేశారు. ఆ రెండింటిలో గెలిచిందెవరు ఓడిందెవరు, ఎవరికెన్ని సీట్లు వచ్చాయి అన్నవి కాదు ప్రశ్నలు. ఇరువురు కూడా ఒంటరిగా పోటీ చేయలేకపోయారు, ప్రాంతీయ పార్టీలతో పొత్తు తప్పదనుకున్నారనేది విషయం. అట్లా భావించి బీజేపీ ఎన్డీయేని, కాంగ్రెస్ పార్టీ యూపీఏని ఏర్పాటుచేసుకోవటం మొదలై రెండు నుంచి మూడు దశాబ్దాలు గడిచాయి. వాటి బలహీనతలు అం తకు మరో దశాబ్దం ముందు నుంచి ఆరంభమయ్యాయి.
ఆ బలహీనతలకు మూలాలను వెతకాలంటే ఇంకొక రెండు దశాబ్దాలు వెనుకకు వెళ్లాలి. ముఖ్యంగా కాంగ్రెస్‌కు సంబంధించి. స్వాతం త్య్రం వచ్చినప్పటి నుంచి అది మన దేశాన్ని పాలిస్తున్న పార్టీ గనుక. ఆ విధంగా ఇది కనీసం అరవై ఏండ్ల చరిత్ర. బలహీనతల మూలాలు అప్పటివి కాగా, ప్రాంతీయ పార్టీలతో పొత్తులు తప్పవనుకునే విధిలేని స్థితి బీజేపీకి పూర్వరూపమైన జనసంఘ్‌కు నేషనల్ ఫ్రంట్ వేదికగా 1989లో ఏర్పడగా, కాంగ్రెస్‌కు యూపీఏ వేదికగా 2004లో ఎదురైంది. ఈ విధిలేని స్థితి ఉభయులకు కూడా ఈ 2024లోనూ కొనసాగుతున్నదనేది గుర్తించవలసిన విషయం.
అంతే ముఖ్యమైన మరొక విషయం ఏమంటే, ఈ స్థితి నుంచి బీజేపీ, కాంగ్రెస్‌లలో ఏదీ కూడా కనుచూపు మేరలో బయటపడే అవకాశాలు లేవు. ఇది ఏదో జోస్యం వంటిదో లేక ఆశాభావం లాం టి మాటో కాదు. జాతీయస్థాయి పరిస్థితులను, వివిధ రాష్ర్టాల పరిస్థితులను గమనించినప్పుడు తోచేది ఇదే. పరిస్థితులు అంటే ఏమిటి? ఇందు లో ప్రధానంగా గమనించవలసినవి రెండున్నా యి. మొదటిది కాంగ్రెస్, బీజేపీ రెండూ కూడా తమ అస్తవ్యస్త విధానాలు, అసమర్థ పాలనలు, అవినీతి కారణంగా, తాము అధికారంలో ఉండిన సమయాలలో ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోవటం. అదే స్థితి ఇప్పటికీ ఉండటం. వైఫల్యాల నుంచి, గత పరాజయాల నుంచి పాఠాలు నేర్వకపోవటం. ఇది మొదటిది కాగా, ప్రజలలో పలురకాల చైతన్యాలు, వాటితో పాటు ఆకాంక్షలు పెరుగుతుండటం. ఏ పార్టీ పట్ల, నాయకుని పట్ల కూడా ఒకప్పటి వలె గుడ్డిగా అనుసరించే విధేయతలు లేకుండా పోతుండటం. ఈ పరిణామాల ఫలితంగా వ్యక్తిగత ప్రయోజనాల నుంచి తమ ప్రాంతీయ ప్రయోజనాల వరకు ప్రధానం అవుతుండటం. ఇది రెండవది.
ఇవి రెండూ మౌలికమైన స్థితులు. తక్కినవ న్నీ వీటికి లోబడి వీటి చుట్టూ తిరిగేవే. కాంగ్రె స్, బీజేపీలలో ఎవరు ఏ నినాదాలు ఇచ్చినా, ఏ మ్యానిఫెస్టోలు ప్రకటించినా, ఎవరితో పొత్తులు పెట్టుకున్నా, మరేమి ఎత్తుగడలు వేసి నా, ఏ సిద్ధాంతాలు మాట్లాడినా, ఎటువంటి అజెండాలు తెరపైకి తెచ్చినా, అన్నీ కూడా ఈ రెండు వైఫల్యాలను, బలహీనతలను అధిగమించి, ప్రజలను నమ్మించి, అంతిమంగా అధికారం సంపాదించటానికి మాత్రమే. తిరిగి గుర్తుచేసుకోవాలంటే, తమ అస్తవ్యస్త విధానా లు, అసమర్థ పాలనలు, అవినీతి కారణంగా కోల్పోయిన ప్రజల విశ్వాసాన్ని పలు విధాలుగా వారిని మరొకమారు వంచించటం ద్వారా సంపాదించి, అధికారం చేజిక్కించుకోవటం కోసమే. అదేవిధంగా, ప్రజలలో పెరుగుతున్న చైతన్యాలను, వారి సరికొత్త ఆకాంక్షలను మభ్యపెట్టి, ఏ పార్టీ పట్ల కూడా స్థిరంగా లేకుండాపోయిన విధేయతలను అధిగమించి ఎన్నికలు గెలవటం కోసమే.
అందులో సఫలమవుతారా లేదా అన్నది వేరే ప్రశ్న. ఒకసారి కావచ్చు, మరోసారి కాకపోవ చ్చు. వారు ఆ వలయంలోంచి బయటపడలేరన్నది మాత్రం గుర్తించవలసిన ప్రధాన విష యం. బయట పడాలంటే పైన పేర్కొన్న రెండు పరిస్థితులను అధిగమించాలి. ఆ పనిచేయటం వారికి సాధ్యమయ్యేది కాదు. తమ స్వార్థ ప్రయోజనాలు నెరవేరేందుకు అస్తవ్యస్త విధానాలు, అసమర్థ పాలన, అవినీతి, ప్రజల మేలు కోసం చిత్తశుద్ధితో పనిచేయకపోవటం, వారి చైతన్యాలను, ఆకాంక్షలను పట్టించుకోకపోటం, పక్కదారి పట్టించటం, ప్రాంతాల ఫెడరల్ అవసరాలను, హక్కులను హరించి అధికార కేంద్రీకరణలు చేయటం వంటివన్నీ వారికి ఒక తప్పనిసరి అవసరం. తమ స్వార్థ ప్రయోజనాల ప్రాతిపదికగా వారికి ఏర్పడిన స్వభావమది.
ఒకవైపు ఇది ఆ రెండు పార్టీల స్వభావం ఎట్లా అయిందో, మరొకవైపు దేశంలోని ప్రాంతాలకు, అక్కడి ప్రజలకు ఫెడరలిజం తమ స్వభావంగా మారింది. ఈ స్వభావం అనే దానిలోకి అనేకం వస్తాయి. తమ ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రయోజనాలు, చరిత్ర, సంస్కృతి, ఆకాంక్షలు, ప్రత్యేక గుర్తింపులు మొదలైనవన్నీ.
ఒకవైపు ఇది ఆ రెండు పార్టీల స్వభావం ఎట్లా అయిందో, మరొకవైపు దేశంలోని ప్రాంతాలకు, అక్కడి ప్రజలకు ఫెడరలిజం తమ స్వభావంగా మారింది. ఈ స్వభావం అనే దానిలోకి అనేకం వస్తాయి. తమ ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రయోజనాలు, చరిత్ర, సంస్కృతి, ఆకాంక్షలు, ప్రత్యేక గుర్తింపులు మొదలైనవన్నీ. మరొకవైపు జాతీయపార్టీలకు జాతీయ ప్రయోజనాల పేరిట జాతీయస్థాయి ఆర్థికశక్తుల ప్రయోజనాలు, అనగా పెద్ద ధనవంతులు వ్యాపారాల వారు, వారితో సంబంధాలుండే విదేశీ ఆర్థికశక్తులు ప్రధానమవుతాయి. తమ యూనిటరిస్టు పెత్తందారీతనం ప్రధానమవుతుంది. అందుకు తగిన విధానాలతో పరిపాలిస్తూ అందుకోసం ప్రాంతాల ప్రయోజనాలను, ఆకాంక్షలను బలిపెట్టజూస్తారు. రెండింటి మధ్య వ్యతిరేకతలన్న వి, లేదా వైరుధ్యాలన్నవి అక్కడ మొదలవుతాయి.
జాతీయ పార్టీలు, నాయకత్వాలన్నవి నిజం. జాతీయ దృష్టితో మొత్తం అన్ని ప్రాంతా ల ప్రయోజనాలను, వైవిధ్యతలను దృష్టిలో ఉంచుకొని ప్రజాస్వామికంగా పాలించినట్టయి తే, అది మన రాజ్యాంగం చెప్పిన సహకార ఫెడరలిజం అవుతుంది. ఇండియా వంటి వైవిధ్య దేశంలో ప్రాంతాలు, వాటి ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలకు మధ్య సహకార సమన్వయాలు ఎంత అవసరమో స్పష్టంగా గుర్తించినందువల్లనే రాజ్యాంగ రచయితలు బలమైన కేంద్రం, బలమైన రాష్ర్టాలు, సహకార ఫెడరలిజం అనే సూత్రీకరణలను ఎంతో ముందుచూపుతో రాజ్యాంగంలో చేర్చారు.
కానీ, పైన చెప్పుకున్నట్టు కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఈ సూత్రీకరణలను తమ ప్రయోజనాల కోసం ఉల్లంఘిస్తూ రావటం వల్లనే తడబడుతున్నాయి. తరచూ ఓడుతున్నాయి. అధికారాన్ని సంపాదించేందుకు ప్రాంతీయ పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితులను తమకు తామే సృష్టించుకున్నాయి. కొన్ని దశాబ్దాల కిందటే మొదలైన ఈ స్థితి నుంచి నేటికీ పాఠాలు నేర్చుకోవటం లేదు.
అందుకే, ప్రాంతీయ శక్తులు, పార్టీలు ఫెడరలిజం సూత్రాల ప్రాతిపదికగా ఈ సువిశాల వైవిధ్య దేశంలో చిరంజీవులవుతున్నాయి. వాటిని తుద ముట్టించేందుకు కాంగ్రెస్, బీజేపీలలో ఏది ఎన్ని ఎత్తుగడలు వేసినా అది ఎంతమాత్రం సాధ్యం కావటం లేదు. సంఘ్‌పరివార్, బీజేపీ నాయకత్వాలు హిందూత్వ పేరిట ఆ పనిచేయవచ్చునని సాగించిన ఆలోచన సైతం పెండ్యులం కదలికల వలె మిగిలిపోవటం తప్ప, దశాబ్దాలు గడిచినా ప్రాంతీయతలను, ఫెడరలిజాన్ని గోవాల్కర్ తన ‘బంచ్ ఆఫ్ థాట్స్’లో రాసినట్టు అంతం చేయలేకపోయాయి. ఆ విషయంలో కాంగ్రెస్ వలెనే ఈ శక్తులు కూడా పైన పేర్కొన్న తమ స్వార్థాలు, బలహీనతల వల్ల విఫలమవుతూ వస్తున్నాయి. మున్ముందు సఫలం కాగల సూచనలూ లేవు. వాటి స్వభావంలోనే అది ఉన్నది. కనుక ప్రాంతీయతలు, ప్రాంతీయశక్తులు, పార్టీలు చిరంజీవులు.
– టంకశాల అశోక్