దక్షిణాదిలోని కీలకమైన రెండు రాష్ర్టాలు తమిళనాడు, కేరళం, ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, తూర్పు రాష్ర్టాలైన అస్సాం, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలకు ఏప్రిల్ నెలాఖరులోగా జరిగే ఎన్నికలు దేశ రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టనున్నాయి. మే 4న ఫలితాలు వెలువడే ఈ ఐదు ప్రాంతాల శాసనసభ ఎన్నికల ఫలితాలు మరోసారి కొన్ని ప్రాంతీయ పార్టీల బలాన్ని నిరూపించబోతున్నాయి. ఒక్క అస్సాం మినహా ఈ రాష్ర్టాల్లో ప్రధాన జాతీయపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల బలం నామమాత్రమే. మిగిలినచోట్ల సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఈ రెండు పార్టీలకు లేదు. ఐదింటిలో కాస్త పెద్ద రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో ప్రాంతీయపక్షమైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వరుసగా నాలుగోసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి సిద్ధమవుతున్నది.
బెంగాల్ సరిహద్దు రాష్ట్రమైన అస్సాంలో గత పదేండ్లుగా పాలకపక్షమైన బీజేపీ మూడోసారి మళ్లీ గెలిచే అవకాశాలున్నాయని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. రాజకీయంగా కీలకమైన దక్షిణాది పెద్ద రాష్ట్రం తమిళనాడులో ప్రధాన ప్రాంతీయ పార్టీ, డీఎంకే అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని పార్టీ రెండోసారి విజయం సాధించగలననే ధీమాతో ముందుకు సాగుతున్నది. ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకేలో చీలికలు, ఆ పార్టీ పొత్తుపై ఆధారపడిన బీజేపీకి సొంతంగా బలం పెరుగపోవడం స్టాలిన్ రెండోసారి విజయం సాధించే అవకాశాలను పెంచుతున్నాయి.
కేరళంలో కమ్యూనిస్టుల (సీపీఎం) నాయకత్వంలోని ఎల్డీఎఫ్ వరుసగా మూడోసారి (2016, 2021 తర్వాత) 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందనే అంచనాతో పరిశీలకులు ఉన్నారు. సీపీఎం నేత పినరయి విజయన్ పదేండ్ల సుపరిపాలన, బీజేపీతో రహస్య ఒప్పందాలతో కాంగ్రెస్ అనుసరిస్తున్న దిగజారుడు రాజకీయాలు ఎల్డీఎఫ్ విజయానికి దారితీయవచ్చని అంచనా. ఎన్నికలు జరిగే నాలుగు రాష్ర్టాల్లో అతి చిన్నదైన అస్సాంలో బీజేపీ తొలిసారి 2016లో అధికారం కైవసం చేసుకున్నది. ప్రస్తుత ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మాజీ నేత హిమంతా బిశ్వ శర్మ తొలిసారి సీఎం పీఠమెక్కారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడే ఆయన వివాదాస్పదమైన నాయకుడు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ జరుగుతున్న ఏకైక రాష్ట్రం ఇప్పుడు అస్సాం ఒక్కటే. బంగ్లాదేశ్ సరిహద్దు రాష్ట్రమైన అస్సాంలో ముస్లింల జనాభా దాదాపు 34 శాతానికి పైగా ఉండడం, ముస్లింలు క్రమేపీ కాంగ్రెస్‌కు దూరమై ఆలిండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్)కు దగ్గరవడం బీజేపీకి మేలు జరిగే ఉన్నాయి.
విదేశీ పౌరులకు వ్యతిరేకంగా వచ్చిన ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించిన ‘ఆసు’ నేతల ప్రాబల్యంలోని అస్సాం గణ పరిషత్ (ఏజీపీ) గతంలో అధికారంలోకి వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ పార్టీ బలహీనపడి బీజేపీకి భాగస్వామిగా మారడం కాషాయ పార్టీని పాలకపక్షంగా మార్చింది.
పశ్చిమ బెంగాల్లో పోటీ ప్రధానంగా కిందటిసారిలా టీఎంసీ, బీజేపీ మధ్యనే ఉంటుందని తెలుస్తున్నది. 1977 నుంచి 2011 వరకూ 34 ఏండ్లు సీపీఎం నాయకత్వంలోని వామపక్షాలు అధికారంలో ఉండగా, 2011, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, వామపక్ష ఫ్రంట్ మధ్య ప్రధాన పోటీ జరిగింది. 2016 నుంచి కాషాయ పార్టీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌కు ప్రత్యామ్నాయం లేదా ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఈ తూర్పు రాష్ట్రంలో చారిత్రకంగా ముస్లింల జనాభా ఉత్తరాది రాష్ర్టాలతో పోల్చితే చాలా ఎక్కువ. దాదాపు 27 శాతానికి పైగా ముస్లింలు నివసిస్తున్న కారణంగా బీజేపీ మైనారిటీలపై వ్యతిరేకతను జనంలో రెచ్చగొట్టే పద్ధతి అనుసరించింది. ఫలితంగా 2016 ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలు గెలుచుకున్నది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం 77కు పెరిగింది. 2017లో జరిగిన కాంథీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఎంసీకి ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ అవతరించింది. కేవలం ఉనికి కోసమే, లెఫ్ట్‌ఫ్రంట్, కాంగ్రెస్ కూటమి ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేస్తున్నాయి.
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఏఐడీఎంకే, బీజేపీ కూటమికి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అసలు విజయావకాశాలు కనిపించడం లేదు. 2019 పార్లమెంటు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేసిన ఏఐడీఎంకే, బీజేపీ కూటమికి ఓటమి తప్పలేదు. 2023లో రెండు పార్టీలూ కూటమి నుంచి వైదొలిగాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో విడివిడిగా పోటీచేసి రెండు పార్టీలూ దెబ్బతిన్నాయి. ఫలితంగా ప్రస్తుత తమిళ శాసనసభ ఎన్నికల సందర్భంగా మరోసారి ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయి. సీఎం స్టాలిన్ దాదాపు 60 ఏండ్లుగా రాష్ట్రంలో అమలవుతున్న ద్రావిడ పక్షాల జన సంక్షేమ పథకాలను అమలు చేయడంతో డీఎంకే కూటమికి ప్రజానీకం ఆదరణ లభిస్తున్నది.
సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీతో పొత్తుకు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ప్రయత్నించినప్పటికీ ఈ పార్టీ బలం ఎంత అనేది సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. గతంలో తమిళనాట ఎన్నికల్లో రెండుసార్లు ఒంటరిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలవడం వల్ల డీఎంకే కూటమిలో కొనసాగడానికే కాంగ్రెస్ నిర్ణయించుకున్నది.
మొదటి 40కి పైగా అసెంబ్లీ సీట్లు కావాలన్న తన డిమాండ్ నుంచి బాగా దిగి వచ్చింది. ఏఐడీఎంకే నేపథ్యం ఉన్న మాజీ సీఎం పన్నీర్‌సెల్వం కిందటేడాది చివరిలో కొత్త పార్టీ పెట్టి, ఇటీవల డీఎంకేలో చేరడం స్టాలిన్ కూటమికి అదనపు బలం. దివంగత సినీ హీరో ‘కెప్టెన్’ విజయ్‌కాంత్ స్థాపించిన డీఎండీకే కూడా ఈమధ్య డీఎంకే కూటమిలో చేరడం ద్రవిడ శక్తుల పునాది విస్తరించినట్టయింది. డీఎంకే కూటమికి విజయావకాశాలను గణనీయంగా పెంచింది. కేరళంలో వరుసగా పదేండ్ల్లు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగి రికార్డు నమోదు చేసుకోవడానికి దగ్గరవుతున్నారు సీపీఎం (లెఫ్ట్‌ఫ్రంట్) సీఎం పినరయి విజయన్. ఆయన నాయకత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్డీఎఫ్) మూడోసారి మెజారిటీ సాధించి అధికారం నిలబెట్టుకుంటుందని రాజకీయ పండితులు జోస్యం చెబుతున్నారు. విజయన్ సీఎం అయ్యాక జరిగిన 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అంతకుముందు శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలకు ప్రవేశంపై ఇచ్చిన న్యాయస్థానం తీర్పును కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకున్నది. ఫలితంగా అప్పుడు కేరళంలోని మొత్తం 20 లోక్‌సభ సీట్లలో 19 యూడీఎఫ్ ఖాతాలో పడ్డాయి. కానీ పదేండ్లుగా ఎంత ప్రయత్నించినా బీజేపీ తన హిందుత్వ సిద్ధాం తంతో ఈ రాష్ట్రంలో పాగా వేయలేకపోయింది.
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ సభ్యుల సంఖ్య 33. మొత్తం 30 స్థానాలు కాగా, నామినేటెడ్ సభ్యుల సంఖ్య 3. రెండు ప్రాంతీయ పార్టీలైన ఆలిండియా ఎన్.రంగస్వామి కాంగ్రెస్, డీఎంకేలకు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ భాగస్వాములు. ప్రస్తుతం సీఎం ఎన్.రంగసామి నాయకత్వంలోని ఎన్ఆర్సీ, బీజేపీ (ఎన్డీఏ) కూటమి అధికారంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లాను ఆనుకొని ఉన్న యానాం అసెంబ్లీ స్థానం పుదుచ్చేరిలో అంతర్భాగం. ఈ చిన్న కేంద్రపాలిత ప్రాంతంలో తెలుగువారి జనాభా దాదాపు ఆరు శాతం వరకు ఉన్నది. పాత ఆనవాయితీ ఈసారి కూడా కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమి విజయం సాధించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.
కేరళలో వరుసగా పదేండ్ల్లు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగి రికార్డు నమోదు చేసుకోవడానికి దగ్గరవుతున్నారు సీఎం పినరయి విజయన్. ఆయన నాయకత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్డీఎఫ్) మూడోసారి మెజారిటీ సాధించి అధికారం నిలబెట్టుకుంటుందని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు.