రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అంకుర (స్టార్టప్) సంస్థలకు అడ్డాగా మారుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇన్నోవేషన్ పాలసీ అమలు మొదలు టీ-హబ్, వీ హబ్, బయో హబ్ లాంటి సంస్థలకు రూ.13 వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం ‘స్టార్టప్ తెలంగాణ’ పేరుతో ఎన్నోరకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నది. తద్వారా హైదరాబాద్ నగరం వినూత్న ఆవిష్కరణలకు కేంద్ర బిందువు అవుతున్నది. కొత్త ఆలోచనలతో వచ్చేవారికి ఇక్కడి ఇంక్యుబేటర్లు అండగా ఉంటున్నాయి.
టీ-హబ్‌తో మొదలు: రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఐటీరంగంలో అనూహ్య మార్పులు జరిగాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘టీ-హబ్’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. సరికొత్త ఆలోచనలున్న నవతరం యువతకు, ఆ ఆలోచనను వ్యాపార సంస్థగా కార్యరూపం దాల్చడం కోసం కావలసిన ఫండింగ్ అందించే సంస్థలకు మధ్య వారధిగా టీ-హబ్ పనిచేస్తున్నది. ఈ సంస్థ ద్వారా ఇప్పటికే వెయ్యికి పైగా కొత్త సంస్థలు పురుడు పోసుకున్నాయి. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన ఔత్సాహికులు ఇక్కడ స్టార్టప్‌లను ఏర్పాటు చేసేందుకు ముందుకువస్తున్నారు. 2016లోనే రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవేషన్ పాలసీని రూపొందించి అమలుచేస్తున్నది. ఆ పాలసీలో భాగంగానే ప్రభుత్వం కేవలం ఐటీ రంగంలోనే కాకుండా ఫార్మా, బయో, మెడికల్, అగ్రికల్చర్, ఉమెన్, సామాజిక అంశాల్లో ప్రత్యేకంగా స్టార్టప్‌లను ఏర్పాటుచేసేందుకు వీలుగా వేర్వేరు ప్రాంతాల్లో ఇంక్యూబేటర్లను ఏర్పాటుచేయించారు. దాని ఫలితంగానే ఇటీవల గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ నివేదికలో తెలంగాణకు ప్రత్యేక స్థానం లభించింది.
అంకుర సంస్థలకు నగరం అడ్డాగా మారడానికి ప్రభు త్వం ప్రత్యేక కృషి చేస్తున్నది. అందుకే ఐటీ రంగంలో ఇంతటి ప్రగతి సాధ్యమైంది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ దీనిపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. అందుకే తాజాగా రాష్ట్రంలో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు రూ.1,300 కోట్లతో నిధిని సమకూర్చబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఔత్సాహికుల్లో ఉత్సాహం నింపినట్టయింది. సాంకేతిక నైపుణ్యం కలిగిన యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా, యువతనే ఉద్యోగాలను స్పష్టించేలా ప్రభుత్వం స్టార్టప్‌లను ఏర్పాటు చేస్తుండటం హర్షణీయం, ఆహ్వానించదగిన పరిణామం.
ఫలిస్తున్న కృషి: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి రోజురోజుకు ఫలిస్తున్నది. స్టార్టప్ సంస్థల అభ్యున్నతి ఫలితాలు కళ్ళముందు కనబడుతున్నాయి. స్టార్టప్ జినోమ్, గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నెట్వర్క్ కలిసి ఇటీవల ఆసియా మొత్తానికి స్టార్టప్‌లపై నిర్వహించిన సర్వేలో ఐదు విభాగాల్లో తెలంగాణ టాప్ ర్యాంకులను తన ఖాతాలో వేసుకున్నది. ఇది రాష్ర్టానికే గర్వకారణం. ఈ సంస్థలు ఇటీవల విడుదల చేసిన ‘గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్టు- 2021’లో టాప్-15 ర్యాంకుల్లో తెలంగాణ స్థానం సంపాదించింది. ఫండింగ్‌లో టాప్-20 స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఆవిష్కరణలు, పనితీరు, ప్రతిభ విభాగాల్లో తెలంగాణ ఆసియాలోనే టాప్-30లో నిలిచింది. ఈ నేపథ్యంలో స్టార్టప్‌లను మరింత ప్రోత్సహించే లక్ష్యంతో ‘స్టార్టప్ తెలంగాణ’ పేరుతో ప్రభుత్వం ఇటీవల వెబ్‌సైట్‌ను ప్రారంభించి మరో అడుగు ముందుకేసింది. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్‌ను ఏర్పాటు చేసింది. ఆలోచనలు కోకొల్లలుగా ఉండి.. పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్న నేటితరం యువత తమ కలల కంపెనీలను ప్రారంభించుకోవడానికి అడుగుముందుకేసే సమయం ఆసన్నమైంది. యువత లక్ష్యం నెరవేర్చడంలో ప్రభు త్వం తెలంగాణ ప్రభుత్వం సఫలీకృతమవుతుందనడం లో ఏ మాత్రం సందేహం లేదు.
శ్రీనివాస్‌గౌడ్ ముద్దం