ఇదివరకే కట్టిన ఇండ్లు, ఫ్లాట్లు అమ్మడుకాక, కొత్త ప్రాజెక్టులు ముందుకు రాక రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తున్నది. అమ్మేవారున్నా కొనేవారు లేక వెలవెలబోతున్నది. పెద్దా, చిన్న తేడా లేకుండా అన్ని సంస్థలూ సంక్షోభంలో చిక్కుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. గత నవంబర్ నాటికి, అంతకు ముందరి ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్లు 12 శాతం, అమ్మకాలు 7 శాతం తగ్గిపోయినట్టు ‘నైట్ ఫ్రాంక్ ఇండియా’ గత డిసెంబర్లో విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది. అధిక విలువ కలిగిన ఆస్తుల విక్రయం స్వల్పంగా (3 శాతం) పెరిగినప్పటికీ మధ్య, దిగువ ఆదాయ వర్గాలకు ఉద్దేశించిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు మొత్తం మీద తగ్గినట్టు ఆ నివేదిక తెలిపింది. నిజానికి రెండో రకం రిజిస్ట్రేషన్లే ఎక్కువగా ఉంటాయనేది తెలిసిందే.
ఈ నివేదికే కాకుండా పలు ఇతర సర్వేలూ రియల్ రంగంలో మాంద్యాన్ని పట్టిచూపాయి. ప్రభుత్వ గణాంకాలు చూసినా ఇదే తెలుస్తుంది. 2023తో పోలిస్తే 2024లో హైదరాబాద్ చుట్టుపక్కల 16 స్థానిక సంస్థల పరిధిలో రియల్ ఎస్టేట్ అనుమతుల సంఖ్య 36 శాతం తగ్గడం కొత్త ప్రాజెక్టుల పరిస్థితికి అద్దం పడుతున్నది. గత జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో హైదరాబాద్లో కొత్త లాంచింగ్లు 54 శాతం, అమ్మకాలు 42 శాతం తగ్గాయి. మెట్రో నగరాల్లో ఇదే అత్యధిక తగ్గుదల అని ‘ప్రాప్-ఈక్విటీ సంస్థ’ వెల్లడించింది. ఫలితంగా రియల్ రంగం మీదే ఆధారపడిన బిలర్లు, బ్రోకర్లు మాత్రమే కాకుండా అనేక అనుబంధ వృత్తులవారూ తీవ్ర నిస్పృహకు గురవుతున్నారు. రైతు ఆత్మహత్యలు,ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు నిత్యవార్తలవుతుండటం చూస్తున్నాం. ఇప్పుడు రియల్టర్ల ఆత్మహత్యలూ పెరుగుతుండటం గమనార్హం. అమ్మకాలు లేక, అప్పులు పెరగడంతో గతవారం వేణుగోపాలరెడ్డి అనే రియల్టర్ ఆత్మహత్య చేసుకున్న వార్త రియల్ రంగాన్ని కుదిపేసింది. సర్కారు అనుసరిస్తున్న నిర్లక్ష్య పూరిత విధానాలే ఇలాంటి ఆత్మహత్యలకు కారణమని విపక్షాలు ధ్వజమెత్తాయి.
బీఆర్ఎస్ పాలనలో దశాబ్ద కాలంగా పైపైకి పోయిన రియల్ ఎస్టేట్ రంగం ఏడాది కాలంగా సమస్యల పాలువుతున్నది. స్థూలంగా చెప్పాలంటే కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ధోరణి రోజురోజుకూ పెరిగిపోవడం యాదృచ్ఛికం అనలేం. హైడ్రా తరహా దుందుడుకు విధానాలు రియల్ రంగంలో సృష్టిస్తున్న గందరగోళం అమ్మకాలపై ప్రభావం చూపుతున్నది. ఇండ్ల కొనుగోలును సామాన్యులు నిరంతరంగా వాయిదా వేసుకుంటున్నారు. ఇలా ఓ వైపు అమ్మకాలు తగ్గిపోతుండటం, మరోవైపు రుణాల మంజూరుపై బ్యాంకులు ఆసక్తి చూపకపోవడం రియల్టర్లకు పెను సమస్యగా మారుతున్నది. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ముందూవెనుక చూసుకోకుండా చేపడుతున్న కూల్చివేతలు, బాధితుల ఆర్తనాదాలు కొనుగోళ్ల సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి. బహిరంగ మార్కెట్ స్తబ్ధతకు ఇది ఆజ్యం పోస్తున్నది. సర్కారు సకాలంలో మేలుకుని ప్రజలకు నమ్మకం, రియల్ రంగానికి భరోసా కల్పించకపోతే విశ్వనగరంలా భాసిల్లే హైదరాబాద్లో రియల్ సంక్షోభం తీవ్రమయ్యే ప్రమాదమున్నది.