‘త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరుగబోతున్నది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతమున్న 119 నియోజకవర్గాలు.. 140 నుంచి 150 వరకూ పెరుగుతాయి. అదయ్యాక.. మహిళా రిజర్వేషన్ల చట్టం ప్రకారం 33 శాతం సీట్లు వాళ్లకే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది జరిగితే.. ఎవరి సీటు ఉంటదో? ఎవరి సీటు పోతదో? ఎవరికీ తెలియదు. అట్లాంటప్పుడు ఐదేండ్లపాటు ప్రతిపక్షంలో ఉంటే ఏమొస్తది? మా పార్టీలోకి రండి. అధికారాన్ని అనుభవించండి!’.. ఇదీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అధికార పక్షంలోని ఓ అగ్రనాయకుడు ఇస్తున్న ఆఫర్ అట! ఇంతకీ, ఆయన చెప్తున్నట్టు డీలిమిటేషన్ ఇప్పుడు జరిగే అవకాశముందా, లేదా? దీనిపై రాజకీయ విశ్లేషకులు, సెఫాలజిస్టులు ఏమంటున్నారు?
దేశంలో, రాష్ర్టాల్లో చట్టసభల నియోజకవర్గాల సంఖ్య, పరిధులను నిర్ణయించే డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) జరుగాలంటే, ముందు జనగణన జరుగాలి. దేశంలో 2011లో చివరిసారిగా జనగణన నిర్వహించారు. లెక్కప్రకారం 2021లో మళ్లీ దీన్ని చేపట్టాలి. అయితే, కరోనా సంక్షోభం, సార్వత్రిక ఎన్నికల పేరిట ఈ ప్రక్రియను కేంద్రం వాయిదా వేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు జనగణనను ఇప్పట్లో చేపట్టే అవకాశం లేదని కొందరు అంటుంటే, వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ ప్రక్రియ మొదలుకావొచ్చని మరికొందరంటున్నారు. దీంతో జనగణన, డీలిమిటేషన్‌పై మీమాంస మొదలైంది. ఈ నేపథ్యంలో.. అసలు జనగణన అంటే ఏమిటి? ఎలా చేపడుతారు? జనగణనకు, డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తవ్వడానికి ఎంత సమయం పట్టొచ్చు? అనే చర్చ జరుగుతున్నది.
చరిత్రలో మొదటిసారి వాయిదా: 1872లో బ్రిటిష్ పాలనలో దేశంలో జనగణన ప్రక్రియ మొదలైంది. ఇంతవరకూ ఈ ప్రక్రియ ఎన్నడూ వాయిదా పడలేదు. 1941లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనూ దీన్ని నిర్వహించారు. అయితే, చరిత్రలో తొలిసారిగా కరోనా కారణంగా జనగణన ప్రక్రియను కేంద్రం 2021లో వాయిదా వేసింది. ఇదే కరోనా సంక్షోభ సమయంలోనే పొరుగున ఉన్న బంగ్లాదేశ్, నేపాల్ సహా ప్రపంచంలోని 143 దేశాలూ జనగణన ప్రక్రియ చేపట్టాయి. భారత్‌లో మాత్రం అలా జరుగలేదు. దీంతో అప్పట్లోనే మోదీ సర్కారుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక, కరోనా తగ్గి మూడేైండ్లెనా కేంద్రప్రభుత్వం జనగణన ఊసే ఎత్తలేదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నిర్వహిస్తారనుకొన్న జన గణనను సార్వత్రిక ఎన్నికల పేరిట కేంద్రం మరోమారు వాయిదా వేసింది.
బడ్జెట్లో కోతతో మళ్లీ వాయిదా: నిజానికి ఈ ఆర్థిక సంవత్సరం జనగణన ఉంటుందేమోనని అందరూ భావించారు. అయితే, కేంద్రం ఈ ఏడాది బడ్జెట్లో జనగణనకు రూ.1,309.46 కోట్లను మాత్రమే కేటాయించింది. నిజానికి దేశవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు జనగణన చేపట్టాలంటే దాదాపు రూ.12 వేల నుంచి రూ. 15 వేల కోట్ల వరకూ నిధులు అవసరమవుతాయని నిపుణుల అంచనా. బడ్జెట్లో కేటాయించిన అరకొర నిధుల దృష్ట్యా ఈ ఆర్థిక సంవత్సరం జనగణన ఉండదని సుస్పష్టమైంది. దీంతో 2025-26 ఆర్థిక సంవతర్సరంలో జనగణన ఉండొచ్చేమోనని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.
జనగణన ప్రక్రియ ఇలా..: జనగణనను రెండు దఫాల్లో నిర్వహిస్తారు. మొదటిది హౌస్ లిస్టింగ్ (ఇంటింటి సర్వే). రెండోది జనాభా గణన. ఇంటింటి సర్వేలో ఇంటి నంబర్, ఇల్లు రకం, యజమాని పేరు, వివరాలు, యజమాని కులం, జననాలు, మరణాలు, లింగం, వృత్తి, ఆదాయం, వలసలు.. ఇలా 35 అంశాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. రెండో దశలో 30 అంశాల్లో ఒక్కో వ్యక్తి వ్యక్తిగత వివరాలను పూర్తిస్థాయిలో సేకరించి ప్రత్యేకంగా రికార్డు చేస్తారు. 2011 జనగణన మొత్తం ప్రక్రియ పూర్తవ్వడానికి 11 నెలల సమయం పట్టింది. హౌస్లిస్టింగ్కు 8 నెలల సమయం కాగా, రెండో దఫా పూర్తవ్వడానికి మూడు నెలల సమయం పట్టింది. అలా ఏప్రిల్ 1, 2010లో ప్రారంభమైన జనగణన ప్రక్రియ మార్చి 31, 2011న పూర్తయింది. అయితే, ఇప్పుడు చేపట్టబోయే జనగణనను మొబైల్ అప్లికేషన్ల సాయంతో పూర్తిగా డిజిటైజేషన్ పద్ధతిలో చేపడుతామని హోంమంత్రి అమిత్‌షా చెప్తున్నారు. దీంతో జనగణన ప్రక్రియ పూర్తిచేయడానికి గతంతో పోలిస్తే ఈసారి తక్కువ సమయమే పట్టొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
2011లో జనగణన చేపట్టే సమయంలో ఆధార్ కార్డుల వివరాలు లేవు. నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ (ఎన్పీఆర్) డేటా అందుబాటులో లేదు. అయితే, ఇప్పుడు ఆ సమాచారం ప్రభుత్వం దగ్గర ఉన్నది. దీంతో తక్కువ సమయంలోనే జనగణన పూర్తవ్వవచ్చని చెప్తున్నారు. అయితే, జనగణన ఎప్పుడు మొదలుపెడుతారన్న విషయమే తేలాల్సి ఉన్నది.
బౌండరీస్ డెడ్‌లైన్ మళ్లీ వాయిదా?: జనగణన ప్రక్రియ మొదలవ్వడానికంటే ముందు జిల్లాలు, తహసిల్లు, పట్టణాలు, మునిసిపాలిటీల పరిధులను మార్చకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వం జనగణన నిబంధనలు, 1990 రూల్ 8(4) ప్రకారం.. ఫ్రీజ్ అడ్మినిస్ట్రేటివ్ బౌండరీస్ పేరిట ఓ డెడ్‌లైన్‌ను విధిస్తుంది. ఈ డెడ్‌లైన్ ముగిసిన మూడు నెలల్లోపు సిబ్బందికి ట్రైనింగ్‌ను పూర్తిచేసి సాధారణంగా జనగణన ప్రక్రియను మొదలుపెడతారు. డిసెంబర్ 2020 నుంచి ఇప్పటికే 9 సార్లు ఈ డెడ్‌లైన్‌ను పొడిగించిన కేంద్రం.. చివరగా జూన్ 30, 2024ను డెడ్‌లైన్‌గా నిర్ణయించింది. అంటే, ఒకవేళ మరో పొడిగింపు ఉండకపోతే, వచ్చే అక్టోబర్‌లో జనగణన ప్రక్రియ ప్రారంభం కావచ్చు. అయితే, జనగణనకు అవసరమైన నిధులను ఈ బడ్జెట్లో కేటాయించకపోవడంతో.. ఈ ఆర్థిక సంవత్సరం జనగణన ఉండకపోవచ్చుననే అభిప్రాయం కలుగుతున్నది. దీంతో ఫ్రీజ్ అడ్మినిస్ట్రేటివ్ బౌండరీస్ డెడ్‌లైన్‌ను కేంద్రం మరోసారి పొడిగించవచ్చని నిపుణులు చెప్తున్నారు.
జనగణనకు కేంద్రం విముఖం?!: జనగణన చేపట్టడానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు సుముఖంగా లేనట్టు మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనగణనతో పాటు కులగణన కూడా జరపాలని డిమాండ్ ఉంది. ఇప్పటికే అనేక రాష్ర్టాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటొద్దని ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కులం అనే అంశం దేశంలో బలంగా వేళ్లూనుకొన్నది. అయితే, మతం ఆధారంగా రాజకీయాలు చేస్తున్న బీజేపీ.. ఇప్పటికిప్పుడు కులగణన చేపడితే, తమ ఓటుబ్యాంకు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉన్నదని భావిస్తున్నదని కొందరు అంటున్నారు. అందుకే కులగణన భయంతో జనగణనను కేంద్రం ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తున్నదని చెప్తున్నారు. ఒకవేళ కులగణనపై ఎన్డీయే సర్కారు ముందుకు వెళ్దామనుకొన్నప్పటికీ, బీసీ జనాభా సంఖ్య వెల్లడై కోటాల పెంపు డిమాండ్ ముందుకొస్తే, రిజర్వేషన్ల పరిమితి తొలగింపునకు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. రాజ్యసభలో మెజారిటీ లేని పాలకపక్షాన్ని ఇదొక విధంగా ఆత్మరక్షణలో పడేస్తుందన్న వాదనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. కులగణన, జనగణన, డీలిమిటేషన్, మహిళలకు 33 శాతం కోటా వర్తింపు .. ఇవన్నీ ఇప్పటికిప్పుడు జరిగే అవకాశం లేదని నిపుణుల మాట. కాగా విభజన చట్టం ప్రకారం.. తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనను నిజానికి పదేండ్ల కిందటే చేయాలి. అయితే, అది జరుగలేదు. ఇప్పుడు చేస్తారా? అనేది కూడా మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
జనగణనతో డీలిమిటేషన్‌కు లంకె : డీలిమిటేషన్ చట్టం-2002 ప్రకారం.. 2026లో డీలిమిటేషన్ ప్రక్రియను మొదలుపెట్టాలంటే అంతకుముందే జనగణన ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. పెరిగిన సాంకేతికతను పరిగణనలోకి తీసుకుంటే, జనగణనకు ఏడు నెలలు, కులగణన కూర్పునకు ఒక నెల, డీలిమిటేషన్‌కు మరో మూడు నెలలు.. అలా 11 నెలల్లో ఈ మొత్తం ప్రక్రియను పూర్తిచేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం : డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే, ఉత్తరాది రాష్ర్టాలకు మేలు జరుగగా.. దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజిస్తారు. అంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ర్టాలకు ఎక్కువ లోక్‌సభ సీట్లు, తక్కువ జనాభా ఉన్న రాష్ర్టాలకు తక్కువ సీట్లను కేటాయిస్తారు. 70వ దశకంలో జనాభా నియంత్రణ చేపట్టాలన్న కేంద్రం పిలుపుతో దక్షిణాది రాష్ర్టాలు జనాభా నియంత్రణ పాటించగా, ఉత్తరాదిలో జనాభా విస్ఫోటనం జరిగింది. ఇప్పుడు ఈ అధిక జనాభాయే ఉత్తరాదికి లాభంగా మారింది. అయితే, తలసరి ఆదాయం, జీఎస్డీపీ, వడ్డీల చెల్లింపు, పన్ను రాబడులు, దేశ జీడీపీలో వాటా ఎక్కువగా ఉన్న దక్షిణాది రాష్ర్టాలకు జనాభా ప్రాతిపదికన చేస్తున్న ఈ డీలిమిటేషన్‌తో నష్టమేనని నిపుణులు చెప్తున్నారు. జనాభా సాకుతో దక్షిణాదికి అన్యాయం చేయవద్దని అంటున్నారు.
రెండు పద్ధతుల పరిశీలన : డీలిమిటేషన్ ప్రక్రియ కోసం కేంద్రం రెండు పద్ధతులను పరిశీలిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఉన్న 543 లోక్‌సభ సీట్లను అలాగే ఉంచి.. జనాభా ప్రాతిపదికన రాష్ర్టాల మధ్య సీట్ల సర్దుబాటు చేయడం ఒకటైతే, లోక్‌సభ సీట్లను 543 నుంచి 848కి పెంచడం మరొకటిగా అంచనా వేస్తున్నారు. అయితే, ఈ రెండు విధానాల్లోనూ దక్షిణాదికి జరిగేది అన్యాయమేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.