రాజస్థాన్ రైతులు కోతల్లేని కరెంటు కావాలంటూ రోడ్డెక్కడం కాంగ్రెస్ పాలనకు అద్దం పడుతున్నది. ఆ పార్టీ అధికారంలో ఉన్నది పిడికెడు రాష్ర్టాల్లో. అన్నిచోట్లా కరెంటు కోతలపై హాహాకారాలు వినిపిస్తుండటం గమనార్హం. ఉచితం మాట దేవుడెరుగు.. కరెంటు ఇస్తే చాలని కాంగ్రెస్ రాష్ర్టాల రైతులు అంటున్నారు. జోధ్పూర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ముందు రైతుల ధర్నా ఆరో రోజు పూర్తి చేసుకుంది. గతంలో ఇలాంటి ఆందోళనలు తలెత్తినప్పుడు అధికారులు ఏవేవో హామీలిచ్చి నచ్చజెప్పేవారు. కానీ ఈసారి తమ డిమాండ్ నెరవేరే వరకు కదిలేది లేదని రైతులు భీష్మించుకొని కూర్చున్నారు.
రైతుల ఆందోళనకు భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) మద్దతు తెలిపింది. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పరిపాలనలో కొనసాగిన రాజస్థాన్ రైతు దైన్యం ఇలా ఉంటే ఇటీవలే బీజేపీని ఓడించి అధికారం చేపట్టిన కర్ణాటకలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కరెంటు కోతలు నిత్యకృత్యమయ్యాయి. బెంగళూరు మహానగరంలోనే ఆరేడు గంటలు కరెంటు జాడ లేకుండా పోతున్నది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల గురించి చెప్పేదేంముంది? కోతలు తగ్గిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హమీలన్నీ కోతలేనని ప్రజలు నిర్ధారణకు వస్తున్నారు. తమ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైందని కర్ణాటక ప్రజలు వాపోతున్నారు.
కాంగ్రెస్ రికార్డు అలా ఉంటే కొత్త రాష్ట్రమైన తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో కరెంటు కోతలను ఎత్తి అవతల పారేసిన సంగతి ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఉపాధి కల్పనలో పెద్దన్నగా ఉన్న ఎవుసానికి ఏంకావాలో కాంగ్రెస్ నేతలకు తెల్వదు. ఎలా సరఫరా చెయ్యాలో అంతకంటే తెలియదు. అయినప్పటికీ అవతలి వారికి వంకలు పెట్టడానికి సదా తయ్యారే. ఇగురం తెలియకపోయినా ఎగిరెగిరి పడటం కాంగ్రెస్ నేతలకు పరిపాటే. తమకు చేతకానిది ఇతరులు సాధిస్తే భరించలేక కుళ్లుకుంటారు. రైతులకు మూడు గంటల కరెంటు చాలని పీసీసీ అధ్యక్షుడు అనడం ఇలాంటిదే!ఒకప్పుడు తెలంగాణ వస్తే కరెంటు కోతలే దిక్కు.. కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని ఆ పార్టీ పెద్దలు వంకర మాటలు మాట్లాడిన సందర్భాలున్నాయి. ఇప్పుడా పెద్దలు వచ్చి కరెంటు తీగలు ముట్టుకుంటే తెలుస్తుంది తెలంగాణ పవర్ ఏమిటో.
స్వరాష్ట్రం ఏర్పడి అధికార పగ్గాలు చేపట్టగానే సీఎం కేసీఆర్ ముందుగా దృష్టి నిలిపింది కరెంటు మీదనే. ఉత్పత్తి మెరుగుపర్చి సరఫరాను సరిచేసి దారిలో పెట్టారు. తదనంతర కాలంలో 24 గంటల ఉచిత కరెంటుతో దేశానికే ఆదర్శంగా నిలిచారు. శతాధిక వృద్ధ కాంగ్రెస్ పార్టీ మాత్రం సడుగులిరిగి పరిపాలనపై పట్టు కోల్పోయింది. గొరగంగ మిగిలేది జుట్టు అన్నట్టు.. ఉన్న ఆ నాలుగు రాష్ర్టాల్లో కరెంటు ఇవ్వలేక సతమతమవుతున్నది. బూటకపు మాటలతో ప్రజలను వంచించే పార్టీకి కోతలు, పిచ్చికూతలకు మించి ఏమి చాతనవుతుంది? మూడు పంటల బీఆర్ఎస్ కావాల్నా లేక మూడు గంటల కాంగ్రెస్ కావాల్నా? అని సీఎం కేసీఆర్ వేసిన ప్రశ్నకు విజ్ఞులైన ఓటర్లు సరైన సమయంలో, సరైన సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.