సిరిసిల్లలోని ప్రతిష్ఠాత్మక, చారిత్రక సహకార విద్యుత్తు సరఫరా సంస్థ (సెస్) ప్రస్థానం ముగిసిందా? సహకార రంగంలో 57 ఏండ్లుగా నడుస్తున్న సెస్‌ను టీజీఎన్పీడీసీఎల్లో విలీనం చేస్తూ తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి తీసుకున్న నిర్ణయంతో ఈ ప్రశ్న తతలెత్తుతున్నది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విలీనాన్ని వ్యతిరేకిస్తూ సెస్ పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించినా, కేసు నడుస్తుండగానే, విలీనంపై కాంగ్రెస్ సర్కార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. ఆరు దశాబ్దాల సహకార సంస్థకు ముగింపు పలికింది. సెస్ ఘన చరిత్ర, క్షేత్రస్థాయి వాస్తవాలు, సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయడంలో కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ పాత్ర ఏమిటి? అనేది చర్చనీయాంశంగా మారింది.
ఆర్థిక సంస్కరణలు, ప్రైవేటీకరణ గ్రామీణ భారతంలో సాధించిన మార్పులు నామమాత్రమేనని చెప్పాలి. దీంతో పేదరిక నిర్మూలనలోనూ పెద్దగా ఉపయోగపడలేదు. ఈ నేపథ్యంలో సామాజిక అభివృద్ధిలో సంఘటిత, సహకార వ్యవస్థలు కీలకంగా పని చేశాయి. సహకార వ్యవస్థ ప్రజల ప్రయోజనాల కేంద్రంగా పని చేసే నిజమైన ఆర్థిక నమూనా. సహకార సంఘాలను పెట్టుబడిదారులు కాకుండా, సంఘాల్లోనే సభ్యులే సమర్థత, సమానత్వంతో నడుపుతారు. ఆరు దశాబ్దాలుగా నడుస్తున్న అలాంటి ఒక సహకార సంస్థనే సిరిసిల్లలోని సెస్. మూడు లక్షల మంది వినియోగదారులు ఉన్న సెస్ సిరిసిల్ల తాలూకా పరిధిలో, ప్రస్తుత సిరిసిల్ల జిల్లా పరిధిలో తన సేవలను అందిస్తూ వస్తున్నది.
కానీ సెస్ నిర్వీర్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. ఇందులో భాగంగానే సెస్ లైసెన్స్‌ను పొడగించకుండా సెస్‌ను ఏడాది నిర్వహించాలంటూ ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)కు బాధ్యతలు అప్పగించింది. ఈ ఆదేశాలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. అనంతరం విద్యుత్తు సరఫరాలో సెస్ పాలవకవర్గం అధికారాలను, బాధ్యతలను ఎన్పీడీసీఎల్ హస్తగతం చేసుకున్నది. ఇప్పుడు ఏకంగా సెస్‌ను ఎన్పీడీసీఎల్లో విలీనం చేస్తూ టీజీఈఆర్సీ ఉత్తర్వులు వెలువరించింది. అంటే సహకార రంగంలో వెలుగులు పంచుతున్న సెస్‌ను ప్రభుత్వమే చేజేతులా నిర్వీర్యం చేసింది. ఇప్పుడు సెస్ సభ్యులు నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయారు. సెస్ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడకూడదు, సెస్ అంటే సభ్యులు, ప్రజల ఆత్మగౌరవం. చర్య కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్నది కాదు. ప్రజల ఆస్తిని ప్రభుత్వం ఏకపక్షంగా ఎన్పీడీసీఎల్లో విలీనం చేయడం సమంజసం కాదు. ఇది అప్రజాస్వామికం, చట్ట వ్యతిరేకం.
సెస్ చరిత్రను అర్థం చేసుకోవాలంటే ఒకనాడు సిరిసిల్లను పట్టి పీడించిన కరువు గురించి తెలుసుకోవాలి. సిరిసిల్ల ప్రాంతంలో కరువు విలయతాండవం చేయడంతో ప్రజలంతా తీవ్ర విషాదకరమైన జీవితాలను అనుభవించేవారు. రైతులు తమకున్న కొద్దిపాటి పొలాలకు నీరు పారించుకునేందుకు రెక్కలు
ముక్కలు చేసుకొని మోట కొట్టేవాళ్లు. మగ్గంపై చేనేత వృత్తిని కొనసాగిస్తూ ప్రజలు చిక్కిపోయేవాళ్లు.
ఇంత శ్రమ చేసినా తీవ్రమైన పేదరికంలో, చీకట్లలోనే మగ్గిపోయేవాళ్లు. ఆ ప్రాంతంలోని కొందరు ప్రజానాయకుల ఆలోచనతో జనం సంఘటితమయ్యారు. 1969లో సహకార విద్యుత్తు సరఫరా సంస్థ (సెస్)కు అనుమతి తీసుకొని, 1970లో కార్యకలాపాలు ప్రారంభించారు. సెస్ ఏర్పాటులో సిరిసిల్ల ప్రాంతంలోని కోటిన్నర మంది ప్రజల కృషి ఉన్నది. జనం స్వచ్ఛందంగా శ్రమదానం చేశారు. దీంతో సెస్ అద్భుతంగా పట్టాలెక్కింది. సిరిసిల్ల అభివృద్ధికి సెస్ స్థాపన తొలి అడుగు అని చెప్పవచ్చు. పూర్తిస్థాయిలో విద్యుత్తు సరఫరా కలిగిన ప్రాంతంగా సిరిసిల్ల దేశంలోనే గుర్తింపు పొందింది. పాలకమండలి సమర్థత, సభ్యుల మద్దతుతో సెస్ స్వయం సమృద్ధి కలిగిన సహకార సంస్థగా ఎదిగింది. సెస్‌లో సభ్యుల సంఖ్య 3 లక్షలు దాటింది. మొదట్లో సెస్‌లో సభ్యుల వాటా రూ.7 కోట్లుగా, సామూహిక ఆస్తుల విలు వ 300 కోట్లుగా ఉండేది. ప్రజలు సమష్టిగా కృ షికి సెస్ వేదికగా నిలిచింది. కరెంటు మోటార్లతో నడిచే మరమగ్గాల పరిశ్రమలు అభివృద్ధి చెందా యి. బియ్యం గిర్నీలు, ఇతర పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ప్రజలకు ఉపాధి అవకాశాలు, పరిశ్రమల్లో ఉత్పత్తి పెరిగింది. అలాగే ప్రజలకు శారీరక శ్రమ భారం గణనీయంగా తగ్గిపోయింది.
నిజాం కాలంలో సాయుధ రైతాంగ పోరాటంలో పోరాడిన యోధుడు చెన్నమనేని రాజేశ్వర్‌రావు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. సెస్ స్థాపనలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. సెస్ ఏర్పాటు సమయంలో అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్‌ను, నాటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని ఒప్పించారు. సిరిసిల్ల తాలూకాలో సెస్ కార్యకలాపాలను పూర్తిస్థాయిలో అమలు చేసి, రైతులు, చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు విశేషంగా కృషి చేశారు. రాజేశ్వర్‌రావు తర్వాత సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహించిన జువ్వాడి నర్సింగరావు, గొట్టె భూపతి, అధికారుల నిస్వార్థ సేవల ఫలితంగా సహకార రంగంలో సెస్ అద్భుతంగా రాణించింది. నాటి ప్రజానాయకుల పో రాటం, అవిశ్రాంత కృషి, ప్రజల సంఘటిత శక్తి, వినియోగదారుల భాగస్వామ్యంతో సెస్ అద్భుతమైన సంస్థగా నడుస్తున్నది. ఒక దీపస్తంభంగా వెలుగులు పంచుతున్నది. కానీ కాంగ్రెస్ సర్కార్ సహకార రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కంక ణం కట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది. ఇందులో భా గంగానే సెస్ విద్యుత్తు లైసెన్స్‌ను మరో ఐదేండ్లు పొడగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రస్తుతం సంక్షోభానికి కారణం. కాంగ్రెస్ పాలకులు సెస్ దీపస్తంభాన్ని ఆర్పివేయడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా సెస్ ఏర్పాటులో మహనీయుల దార్శనికత, త్యాగాలు, కృషిని స్మరించుకోవాలి.
సిరిసిల్ల ఎమ్మెల్యేలుగా సీహెచ్ రాజేశ్వర్‌రావు సీపీఎం నుంచి ప్రాతినిధ్యం వహించినా, ఆ తర్వాత జే నర్సింగరావు, జీ భూ పతిరావు కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించినా సెస్ పట్ల, సెస్ అభివృద్ధి పట్ల వారి దృక్ప థం ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగానే ఉన్న ది. నేటి పాలకులు ఆ స్ఫూర్తిని కొనసాగించాలి.
సమైక్య రాష్ట్రంలో గతంలో సెస్ అనేక తీవ్రమైన సంక్షోభాలను, మౌలిక సంస్కరణలను ఎదుర్కొన్నది. కాలపరీక్షను ఎదుర్కొంటూ ఆరు దశాబ్దాలుగా స్థిరంగా నిలిచి, జాతీయ స్థాయిలో విశేషమైన పేరును సంపాదించింది. ప్రభుత్వ విద్యుత్తు సంస్థలతో పోల్చితే సెస్ ద్వారా సరఫరా మెరుగ్గా జరుగుతున్నది. సెస్ పరిధిలో వినియోగదారుల తలసరి విద్యుత్తు వినియోగం 1,600 కిలోవాట్స్ కాగా, ఎన్పీడీసీఎల్ పరిధిలో ఈ మొత్తం 1,268గా ఉన్నది. సెస్లోని ఒక్కో ఉద్యోగి 666 సర్వీస్‌లు/కనెక్షన్లకు పని చేస్తుంటే, విద్యుత్తు బోర్డు పరిధిలోని ఒక్కో ఉద్యోగి 586 సర్వీస్‌లు/కనెక్షన్లకు పని చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్స్, ఇతర మరమ్మతులు ఏవైనా సెస్ పరిధిలో యుద్ధ ప్రాతిపదికన జరుగుతాయి. సెస్ పరిధిలోని ప్రతీ మండలానికి ఉన్న డైరెక్టర్ జవాబుదారీగా వ్యవహరించడమే ఇందుకు కారణం. ఆర్థిక వనరుల విషయానికి వస్తే, ప్రభుత్వం సెస్‌కు రూ.600 కోట్లు రుణం చెల్లించాల్సి ఉన్నది. సోలార్ విద్యుదుత్పత్తి ప్రణాళికలపైనా సెస్ దృష్టి పెట్టింది. ఇండియా-జర్మనీ సోలార్ ప్రాజెక్టులో భాగంగా పైలట్ వెంచర్ కోసం సెస్ ఎంపికయింది.
ఈ ఏడాది జూన్‌లో డీపీఆర్ పూర్తయితే, వినియోగదారులే ఉత్పత్తిదారులుగా మారుతారు. అంటే ప్రభుత్వం నుంచి విద్యుత్తును కొనుగోలు చేయాల్సిన అవసరముండదు. కాబట్టి ప్రభు త్వం ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన సెస్ సేవలను విస్మరించడం సమంజసం కాదు. ప్రభుత్వ వైఖరికి ప్రజాస్వామిక స్ఫూర్తికి, సహకార సంఘాల చట్టానికి విరుద్ధం. సెస్‌ను ఎన్పీడీసీఎల్లో విలీనం చేయకుండా యథాతథంగా కొనసాగించాలి. దేశవ్యాప్తంగానే కాకుం డా, ప్రపంచ వ్యా ప్తంగా సంస్థలు ప్రజలను భాగస్వాములు చేయడంలో విఫలమవుతున్న ఉదంతాలను గమనించవచ్చు. ఇలాంటి తరుణంలో సెస్ పరిరక్షణకు, సేవల బలోపేతానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్ర జలు, వినియోగదారులు అందరిపై ఉన్నది. చరిత్రలో ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ధీటుగా ప్రతిఘటించిన చరిత్ర కలిగిన ప్రాంతం మనది. లక్షలాది మంది శ్రమతో ఎదిగిన సిరిసిల్ల సెస్‌ను కాపాడుకుందాం.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే)
– చెన్నమనేని రమేశ్