సరిగా 40 ఏండ్ల క్రితం నాటి విషయం గుర్తుకువస్తున్నది. అది 1985వ సంవత్సరం. ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడైన రాహుల్‌గాంధీ తండ్రి రాజీవ్‌గాంధీ అప్పుడు దేశానికి ప్రధానమంత్రి. దురదృష్టవశాత్తు ఇతరుల కారణంగా బోఫోర్స్ కేసులో ఇరుక్కుని పదవిని కోల్పోయారు తప్ప అది ఆయన పూనిక వల్ల జరిగిన అవినీతి కాదు. కాకపోతే వారిని కాపాడజూశారు. యథాతథంగా తను ఉత్తముడే గాక, మంచి పనులు, తనకన్న ముందటి ప్రధానుల కన్న భిన్నమైన పనులు దేశం కోసం కొన్ని చేశారు. అందుకు చాలా ప్రశంసలు కూడా పొందారు. అటువంటి మంచి పనులలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఒకటి. ఆ విషయాన్ని ఇప్పుడు ఆయన కుమారుడు రాహుల్‌గాంధీకి గుర్తుచేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఆ చట్టం గురించి రాహుల్‌గాంధీకి తెలియదని కాదు. 1970లో జన్మించిన ఆయనకు, ఆ చట్టాన్ని 1985లో చేసినప్పుడు 15 సంవత్సరాల వయసు. కనుక, విషయం తెలియకపోయే అవకాశం లేదు. అంతకు 18 ఏండ్ల క్రితం 1967లో హర్యానాలో గయాలాల్ అనే ఎమ్మెల్యే కేవలం రెండు వారాలలో మూడుసార్లు పార్టీలు మారడంతో ‘ఆయారాం, గయారాం’ అనే ఈసడింపు మాట వాడుకలోకి రావడం, అధికారం కోసం సభ్యుల పార్టీ ఫిరాయింపులు, తమ అధికారాన్ని కాపాడుకునేందుకు రాజకీయ పార్టీలు దానిని ప్రోత్సహించడం, ఆ క్రమంలో పదవీ ప్రలోభాలు, ధన ప్రలోభాలు విచ్చలవిడిగా మారిన నేపథ్యంలో, రాజీవ్‌గాంధీ ఆ చట్టం చేశారు. కనుకనే ఆయనకు దేశవిదేశాలలో కూడా ప్రశంసలు లభించాయి. ఇదంతా కూడా రాహుల్‌గాంధీకి, ఆయన తల్లి సోనియాగాంధీకి పూర్తిగా తెలిసి ఉంటుందనే భావించాలి. ఆ చట్టాన్ని తర్వాత కాలంలో అదే కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు భ్రష్టు పట్టించాయన్నది వేరే విషయం. అంతమాత్రాన రాజీవ్‌గాంధీ పేరు చరిత్రలో చెరిగిపోదు. కాకపోతే, తను చేసిన మంచిని భంగపరిచిన పార్టీలలో కాంగ్రెస్ పేరు కూడా కనిపిస్తుంది.
అటువంటి రాజీవ్‌గాంధీ 1991లో హత్యకు గురైన తర్వాత 36 సంవత్సరాలకు ఆయన ఏకైక కుమారుడు, రాజకీయ వారసుడు అయిన రాహుల్‌గాంధీ, తన తండ్రి వారసత్వానికి అర్పిస్తున్న ఘనమైన నివాళిని గమనించినప్పుడు, ఆశ్చర్యం కలుగుతుంది. పార్టీలో అంతర్గతంగా కొంత వ్యతిరేకత ఉండి, తొందరపాటు తగదన్న సూచనలు వచ్చినప్పటికీ వాటిని తోసిపుచ్చి, ప్రజాస్వామ్యం కోసం, పార్లమెంటరీ వ్యవస్థ కోసం 52వ రాజ్యాంగ సవరణను చేయడమే గాక, దానిని రాజ్యాంగపు 10వ షెడ్యూలులో చేర్చిన ఆ తండ్రి ఎక్కడ? ఈ కుమారుడు ఎక్కడ? అనే ప్రశ్న ముందుకు వస్తుంది. అనగా, ఏ ‘ఆయారాం గయారాం’ సంస్కృతికి వ్యతిరేకంగానైతే తండ్రి ఆ నాటి చట్టం చేశారో, అదే సంస్కృతితో లాభపడేందుకు, అధికార ప్రయోజనాలు పొందేందుకు కుమారుడు తిరిగి అదే మార్గాన్ని అనుసరిస్తున్నారన్న మాట.
ఆత్మలు, ఆకాశం నుంచి చూడటాలు అనే మాటలను నమ్మనక్కరలేదు గాని, ఆ చట్టం వల్ల రాజీవ్‌గాంధీ చరిత్రలో నిలిచిపోయారని పైన అనుకున్నాము గనుక, తను ఆ చరిత్ర పుటలలోంచి వర్తమానంలోకి తొంగిచూసే పక్షంలో ఆయన మనసు తప్పక క్షోభించగలదని చెప్పవచ్చు. రాహుల్‌గాంధీ పతనపు తీరు కూడా ఆ తర్వాతి పుటలలో ఎక్కడో నమోదవుతుంది గనుక, ఇరువురి మధ్య వ్యత్యాసమేమిటో భావి తరాలు తెలుసుకొని వివేచించగలవు. విశేషమేమంటే, తండ్రి చేసిన సవరణను చేర్చి ఉన్న రాజ్యాంగం ప్రతినే పట్టుకొని తిరుగుతున్నారు ఆ కుమారుడు.
ప్రస్తుతపు తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు ఉదంతంలో అర్థంకాని మిస్టరీ ఏమీ లేదు. న్యాయశాస్త్ర కోవిదులకు, దేశ అత్యున్నత న్యాయస్థానపు న్యాయమూర్తులకు బోధపడని న్యాయపరమైన చిక్కుముడులేమీ అందులో లేవు. కావాలంటే ఇరుపక్షాల న్యాయవాదదురంధరులు, అంతిమంగా తమ తీర్పులో న్యాయమూర్తులు సంక్లిష్టమైన వివరణలను ఎన్నయినా ఇవ్వవచ్చు. వాటన్నింటిని జాగ్రత్తగా, ఓపికగా చదివితే మనకు బోధపడే విషయాలు తప్పకుండా ఎన్నయినా ఉంటాయి.
కానీ, మొత్తం ఉదంతపు పిండితార్థాన్ని ఏ సామాన్యుడైనా రెండు ముక్కలలో సులభమైన భాషలో చెప్పగలడు. అది ఈ విధంగా ఉంటుంది: బీఆర్ఎస్ పక్షాన అసెంబ్లీకి ఎన్నికైనవారిలో 10 మంది ఏదో ఆశించి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ను బలహీనపరచాలని వారికి ఏవో ఆశలు చూపి చేర్చుకున్నది. ఆ పని పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి వ్యతిరేకమని చేరినవారికి, చేర్చుకున్నవారికి కూడా తెలుసు. ఆ చట్టాన్ని కచ్చితంగా వర్తింపజేస్తే తమ సభ్యత్వాలు రద్దవుతాయని తెలుసు. అయినప్పటికీ రకరకాల ఉపాయాలతో అట్లా జరగకుండా ఉండేందుకు ఛప్పన్నారు ప్రయత్నాలు చేస్తున్నారు. చమత్కారపు వాదనలు చేస్తున్నారు.
కాంగ్రెస్ కూడా. బయట రాజకీయంగా చేసే ఎదురువాదనలు ఒకటి కాగా, స్పీకర్ త్వరగా నిర్ణయించడానికి వీలుకాని పరిస్థితులు సృష్టించడం మరొకటి. ఇక కింది కోర్టులు, పై కోర్టులు, ఇంకా పై కోర్టులలో వీలైనంత సాగదీస్తూపోవడం ఇంకొకటి. చివరకు, సుప్రీంకోర్టు జూలై 31న తన తుది తీర్పులో వ్యాఖ్యానించినట్లు, ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగిసే వరకు విషయం సాగుతుండటం. ‘ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్’ అన్నట్లుగా విషయం ముగియడం. రాజీవ్‌గాంధీ ప్రభుత్వం చట్టం చేసిన తర్వాత ఈ 40 సంవత్సరాలలో కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఈ పని చేశాయి. కానీ, కాంగ్రెస్ పార్టీ తన నాయకుడి ఆదర్శాన్ని నిలిపిందెక్కడ, ఆయనకు నివాళిని అర్పించిందెక్కడ అనేది ప్రశ్న. సూటిగా చెప్పాలంటే ఆయనకు వెన్నుపోటు పొడుస్తున్నారు.
ఇదే ప్రశ్న రాహుల్‌గాంధీకి కాంగ్రెస్ నాయకుడిగానే గాక, రాజీవ్‌గాంధీ కుమారుడిగా ఎదురవుతున్నది. ఇంకా చెప్పాలంటే రాజీవ్ భార్యగా సోనియాగాంధీకి కూడా. చట్టం జరిగినప్పుడు రాహుల్ ఇంకా యుక్త వయస్కుడు కాలేదని మినహాయింపు ఇవ్వదలచినా, అది ఆమెకు వర్తించదు. ఇప్పుడు ఇద్దరికీ వర్తించదు. ఆ పని ఇతరులు చేశారు గనుక తామూ చేస్తామనడం టక్కరి వాదన అవుతుంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక విధానంలో అనేక విషయాలు ఇమిడి ఉన్నాయి. ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ నియమనిబంధనలు, రాజకీయంతోపాటు నైతిక విలువలు కూడా. ఆ విలువలు తమను ఎన్నుకున్న ప్రజల పట్ల కూడా. ఒకవేళ ఫిరాయింపులు ప్రలోభాల కారణంగానైతే చట్టపరమైన అంశాలు సైతం వస్తాయి.
చట్టం చేయబూనినప్పుడు రాజీవ్‌గాంధీ ఏమేమి చర్చలు చేసి ఉంటారో మనకు తెలియదు గానీ, ఇవన్నీ అనివార్యంగా ప్రస్తావనకు వచ్చి ఉంటాయి. వీటిలో వ్యక్తిగత నైతికతలు, రాజకీయ నైతికతలు, తమ ప్రజల పట్ల నైతికతలు అనే మూడూ ఉంటాయి. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో తక్కిన అన్నింటికన్న ఈ మూడు విధాలైన నైతికతలే ముఖ్యమైనవి. అందుకే గాంధీజీ స్వాతంత్య్రోద్యమ క్రమంలో, స్వాతంత్య్రానంతరం కూడా పాటించవలసిన విషయాలలో అన్నింటికన్న నైతికతలు ప్రధానమన్నారు. గాంధీ కుటుంబానికి గల ఆ పేరుతో గాంధీజీకి ఏ సంబంధం లేదని తెలిసిందే. ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్‌గాంధీ అయినందున ఆ ఇంటి పేరు వచ్చింది. అయినప్పటికీ, ఆ పేరు ఉన్నందుకైనా వారు తగిన నైతికతలను పాటించడం మంచిది. అందులోనూ రాజీవ్‌గాంధీ అందుకు అనుగుణమైన చర్యను ఫిరాయింపుల విషయంలో తీసుకున్నందుకు.
తెలంగాణ ఫిరాయింపులకు సంబంధించి రాహుల్‌గాంధీ కాని, సోనియాగాంధీ కాని ఎటువంటి నీతినిజాయితీలు చూపుతున్నట్లు లేదు. పరిస్థితిని సరిదిద్దడం అంతకన్న లేదు. రాష్ట్ర నాయకత్వానికి ఏ విధంగానైతే రాజకీయ ప్రయోజనాలు తప్ప మరేమీ అక్కరలేదో, వారిద్దరికి కూడా అదే పరమావధి అని భావించాలి. రాజీవ్‌గాంధీకి అదే తగిన నివాళి అన్నది వారి ఆలోచనగా తోస్తున్నది. అందుకు వారిని నిందించలేమేమో కూడా. ఒకప్పుడు మొత్తం దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన పార్టీ ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నదో రాయడం కూడా అనవసరం. భవిష్యత్తు సైతం ఆశాజనకంగా లేదు. రాహుల్‌గాంధీ వంటి బలహీనుని నాయకత్వాన, కనీసం ప్రస్తుత బలం నిలబడినా గొప్ప విషయమే అవుతుంది. అందువల్ల నైతికతలు పనిచేయవు మరి. రాజీవ్ ఆత్మ అశాంతికి గురైతే వారు చేయగలిగిందీ లేదు.
ఇదంతా అట్లుంచి, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు విధించిన మూడు నెలల గడువు నాటికి ఏమి జరగవచ్చునన్నది ఉత్కంఠగా మారింది. నిర్ణయమైతే జరగాలి. కానీ, అది సభ్యులను అనర్హులుగా ప్రకటించేది అవుతుందా? అటువంటి నిర్ణయం కోర్టు తీర్పులో లేదు, అసెంబ్లీ నిర్ణయం ఆ విధంగా ఉండాలనే నిర్దేశమూ లేదు గనుక ఏమి కావచ్చు? తీర్పులకు నిర్వచనాలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. అంతిమంగా విషయం, మళ్లీ న్యాయమూర్తులే సూచించినట్లు, పార్లమెంటు పరిధిలో అన్నీ స్పష్టంగా చట్టం చేయవలసినదిగా మిగులుతుందా? ఈలోగా పరిష్కారం లభించాలంటే జరగవలసింది సోనియా, రాహుల్‌గాంధీలు రాజీవ్‌గాంధీ స్ఫూర్తిని ఆవాహన చేసుకొని పది మంది సభ్యత్వాలను రద్దు చేయడమే.
– టంకశాల అశోక్