బీఆర్ఎస్ హయాంలో విడుదల చేసిన గ్రూప్-1, 2, 3, 4 పోస్టుల నియామక ప్రక్రియలు దాదాపుగా పూర్తయ్యాయి. గ్రూప్-4 నియామక ప్రక్రియ తొమ్మిది నెలల కిందట ముగిసింది. గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ ఇటీవల విడుదలైంది. గ్రూప్-2 అభ్యర్థుల సెలక్షన్ అయిపోయింది. ఇక గ్రూప్-1కి ఎంపికైన అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, దానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తున్నది. మొత్తం మీద గ్రూప్-1, 2, 3, 4 ప్రక్రియ పూర్తయింది. అయితే, ఏ కోర్టు కేసులు లేని గ్రూప్-2, 3, 4 అపాయింట్మెంట్లో నిరుద్యోగులకు పూర్తిగా న్యాయం చేయాల్సిన బాధ్యత పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఉంది. గ్రూప్-2లో 763 పోస్టులకు ఐదు లక్షల మందికి పైగా, గ్రూప్-3లో 1,375 పోస్టులకు సుమారు ఐదున్నర లక్షల మంది, గ్రూప్-4లో ఎనిమిది వేల పోస్టులకు ఎనిమిదిన్నర లక్షల మంది అభ్యర్థులు పోటీపడ్డారు. గ్రూప్-1లో 563 పోస్టులకు సుమారు నాలుగు లక్షల మందికి పైగా పరీక్షలు రాశారు. ఈ పోస్టులకు ఎంపికైనవారిలో ఇంకా జాయిన్ కాని వారు చాలామంది ఉన్నారు.
ఉదాహరణకు గ్రూప్-1కి ఎంపికైన అభ్యర్థి ఇప్పటికే సివిల్స్‌కి ఎంపికైతే గ్రూప్-1లో ఒక ఖాళీ ఏర్పడుతుంది. అలాగే గ్రూప్-2కి ఎంపికైన అభ్యర్థి, గ్రూప్-1కి కూడా ఎంపికయ్యే ఆస్కారం లేకపోలేదు. ఈ లెక్కన గ్రూప్-2లో ఒక ఖాళీ ఏర్పడుతుంది. ఇదే విధంగా గ్రూప్-3, 4లలో కూడా అనేక ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రకారం ప్రతి గ్రూప్‌లోనూ బ్యాక్లాగ్ వేకెన్సీలు ఏర్పడే ఆస్కారం ఉంటుంది. చాలామంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరైనప్పటికీ ఒకటి, రెండు మార్కుల కారణంగా ఉద్యోగాలు రాలేదు. ఈ నేపథ్యంలో ఇలా ఏర్పడిన ఖాళీలను మెరిట్ లిస్ట్‌లో ఉన్న తదుపరి అభ్యర్థితో భర్తీ చేస్తే బాగుంటుంది.
ఉద్యోగాలకు ఎంపికైనప్పటికీ చాలామంది జాయిన్ అవ్వరు. వాటిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ బ్యాక్లాగ్ పోస్టులుగా పేర్కొంటుంది. వాటిని ఎప్పుడో విడుదలయ్యే తర్వాతి నోటిఫికేషన్లో పొందుపరచడం సరికాదు.
గ్రూప్-1, 2, 3, 4 అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి. కాబట్టి, ఎంపికైన అభ్యర్థులందరూ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక చివరి తేదీని నిర్ణయించాలి. ఆ తేదీలోపు కేటాయించిన శాఖల్లో జాయిన్ అవ్వాలని ఆదేశాలు జారీచేయాలి. తద్వారా చివరి తేదీ నాటికి ఖాళీల సంఖ్యపై స్పష్టత వస్తుంది. ఆ తర్వాత ఆయా ఖాళీలను ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఉన్న మరికొంత మందితో భర్తీ చేయాలి. ఇలా చేయడం వల్ల మరికొంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. గ్రూప్ పరీక్షలకు లక్షల మంది పోటీపడ్డారు. మెరిట్ లిస్టులో ఉన్నవారు కూడా కష్టపడి చదువుకుని పరీక్షలు పాసైనవారే. వీరిలో చాలామంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరై ఉంటారు. ఆయా క్యాటగిరీలను బట్టి కేవలం ఒకటి, రెండు మార్కుల తేడాతో ఉద్యోగానికి ఎంపిక కాలేదు. ఇలాంటి వారితో సెకండ్ లిస్ట్ విడుదల చేసి మిగిలిన పోస్టులను భర్తీ చేయాలి. తద్వారా చాలామంది నిరుద్యోగులకు న్యాయం చేసినట్టవుతుంది.