ఒక రాష్ట్రంలో సకల రంగాలూ ఉన్నత స్థితిలో ఉండి, అభివృద్ధి పథంలో పయనిస్తే ఆ రాష్ట్రం మెరుగైన స్థితిలో ఉన్నట్టు. అన్ని రకాల అవాంతరాలను అధిగమిస్తూ, ఆ ప్రాంత ప్రజలు అంతకు ముందు కన్నా ఆర్థికంగా ఉన్నతంగా ఉంటే ఆ ప్రాంతం స్వర్ణయుగంలో ఉన్నదని చెప్పుకుంటాం. అలాంటి వాంఛనీయమైన స్థితి ఇప్పుడు తెలంగాణలో అలరారుతున్నదనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్న కోరిక బలంగా ఉండి, అంతే దృఢ సంకల్పంతో, చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి పథం వైపు పరుగు పెట్టడాన్ని ఎవరూ ఆపలేరు. ఆ ప్రాంత నాయకుడికి ఇలాంటి కోరిక, సంకల్పం, చిత్తశుద్ధి ఉంటేనే సరిపోదు. ఆ దిశలో ప్రయాణించే పనిమంతులు కూడా అతనికి తోడుగా అన్నీ విధాలా సహకరించాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. అయి నా ఏదో సినిమాలో అన్నట్టు, ‘కిసీ చీజ్ కొ అగర్ సచ్చే దిల్ సే చాహే తో సారె కాయనాత్ ఉసే తుం సే మిలానే కి కోషిష్ మే లగ్ జాతీ హై’. మనం దేన్నయినా మన హృదయ పూర్వకంగా, స్వచ్ఛమైన మనసుతో కావాలనుకుంటే, అంతరిక్షంలో ఉన్న శక్తులు కూడా మనకు సహకరిస్తూ దాన్ని పొందేట్లు చూస్తాయి. దృఢ సంకల్పానికి ఉన్న శక్తి అటువంటిది.
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక, అన్ని రంగాల్లో దేశంలోనే ఉన్నతంగా మన రాష్ర్టాన్ని నిలబెట్టుకోవాలన్న తపన మన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్నందువల్లే, అనేకానేక పథకాల రచనకు పూనుకొని వాటిని అమలు పరుస్తున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ర్టానికి అత్యం త అవసరమైన మౌలిక వసతులు, వనరులు కల్పించినట్లయితే, ఆ తర్వాత ఆ రాష్ర్టాన్ని ఎంతవరకైనా అభివృద్ధి చేయవచ్చని మనసారా తలపోసి, ఆ దిశగా ప్రయాణం ప్రారంభించారు. అందువల్లనే నిరంతర విద్యుత్తు సరఫరా, నీళ్లు సమృద్ధిగా ఉండేట్టు చేయడం ప్రప్రథమ అవసరంగా భావించి వాటిని అమలు చేశారు.
ఇలాంటి కొత్త ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చినవే వివిధ రంగాలకు చేయూత నిచ్చే రకరకాల పథకాలు. రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, కాళేశ్వరం, పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్లు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు మొదలైనవి. పారిశ్రామిక రంగ అభివృద్ధి కూడా ఒక రేంజ్లో దూసుకు పోవాలంటే, ఇదివరకు అమల్లో లేని ఒక కొత్త పద్ధ్దతి ప్రవేశ పెట్టాలన్న ఆలోచనతో పుట్టుకొచ్చింది టీఎస్ ఐపాస్.
ఒక పరిశ్రమ లేదా ఓ కంపెనీ పెట్టాలంటే అవసరమైన విభాగాల నుండి అనుమతులూ పొందడానికి నానా అవస్థలు పడవలసి వచ్చేది. కాలయాపన ఎక్కువై, వ్యయభారం కూడా మితి మీరేది. వివిధ కంపనీల నుంచి పెట్టుబడులు ఆశించినపుడు, వారికి అవలీలగా, అనుమతులు లభ్యమయేట్టు చూడాల్సిన బాధ్యత మనదేనని గుర్తెరిగి టీఎస్ ఐపాస్ అనే నూతన విధానాన్ని మన రాష్ట్రం ప్రవేశ పెట్టింది. నమోదు చేసుకున్న 15 రోజుల్లోనే అన్ని పరిశీలించి అనుమతులు ఇవ్వడం ఐపాస్ ముఖ్య ఉద్దేశం. తద్వారా పరిశ్రమల స్థాపనకు ముందుకు వెళ్లొచ్చనేది దాని సారాంశం.
పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే విద్యుత్తు సరఫరా నిరంతరంగా అందిస్తున్నాం. అనువైన వాతావరణం కల్పిస్తున్నాము. ఇంత సౌకర్యంగా ఉన్న విధాన నిర్ణయం వల్ల, రాష్ట్రం సులభ వ్యాపార విధానంలో మొదటి ర్యాంక్ సంపాదించింది కూడా. పెట్టుబడి పెట్టడానికి వందల, వేల కంపెనీలకు ఉత్సాహం పెరిగి రూ.కోట్లలో పెట్టుబడి రూపంలో మన రాష్ర్టానికి తరలి వస్తున్నాయి.
రాష్ట్రంలో గడచిన తొమ్మిదేండ్లలో కొత్తగా 23 వేల పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి. వీటి ద్వారా 17.53 లక్షల ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయి. రూ.2.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఐటీలో దాదాపు రూ.77 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఒక్క 2022-23 లోనే రూ.2.41 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి.
దేశంలోని ఐటీ రంగంలో తెలంగాణ వాటా ( ఉమ్మడిఏపీ ) 2014 లో 9.83 శాతంగా ఉంటే, 2022-23 నాటికి 16.77 శాతానికి పెరిగింది. ఐటీరంగంలో కొత్తగా ఏర్పడిన ఐటీ ఉద్యోగాలు 44 శాతంగా రికార్డు అయ్యింది. ఐటీ ఎగుమతులు 2022-23లో 31.4 శాతంగా నమోదైంది. జాతీయ సగటు 9.3 శాతం కన్నా ఎంతో ఎక్కువగా వృద్ధి జరగడం గర్వించదగ్గ విషయం. గత ఏడాదిలో ఐటీ ఎగుమతులు రూ.1.8 లక్షల కోట్ల నుంచి రూ.2.41 లక్ష కోట్లకు పెరిగాయి. ఐటీరంగంలోని ఎగుమతుల పెరుగుదలను తెలంగాణలో ‘భగ్గుమన్న ఐటీ ఎగుమతులు’ EXPLOSIVE EXPORTS గా వర్ణించబడింది. దీని వల్ల ఐటీ, ఐటీస్ రంగాలకు తెలంగాణ ఒక గమ్యంగా తయారైందనటంలో ఆశ్చర్యమేమీ లేదు.
‘నేటి యువకులు చాలా చురుకైన వారు. మెరికల్లాంటి వారు. వారిలో నైపుణ్యాలకు కొదువ లేదు. అందుకని మనం ఉద్యోగాల వెంట పడకుండా, మనమే ఉద్యోగాలను ఎందుకు సృష్టించుకోకూడదు’ అంటూ యువకులకు సందేశాన్ని ఇచ్చారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. పలు సందర్బాల్లో వారిలో ఉత్సాహం నింపి, అలాంటి నైపు ణ్యం కలిగిన వారిని స్టార్ట్ అప్లను చేపట్టే విధంగా ప్రోత్సహించేందుకు ఇన్నోవేషన్ ఎకో సిస్టంను ప్రవే శ పెట్టారు. దీనికింద ఈ దిశలోనే పనిజేయడానికి వివిధ పాలసీలతో టీ-హబ్, టీ-వర్స్, టీఎస్ఐసీ ( తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్), ఆర్ఐసీహెచ్ (రిసర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ అఫ్ హైదరాబాద్), వీ హబ్ (విమన్ ఎంటర్ప్రైనర్షిప్ ) అని కొన్ని వ్యవస్థలను ఆవిష్కరించారు. వీటివల్ల ఇప్పుడు యువకుల్లో నూతనోత్సాహం నిండి కొత్త కొత్త కంపెనీలు చిన్నవి, పెద్దవి అన్నీ ఆవి ష్కృతమౌతూనే ఉన్నాయి.
– మాచెర్ల వాణీ మనోహర్ 99896 20452