ఆరోగ్య రంగం అంటే కేవలం దవాఖానలు, వైద్యులు, వైద్య కళాశాలలు మాత్రమే కాదు. ఒక బలమైన ప్రజారోగ్య వ్యవస్థకు అసలైన పునాది ప్రజల ఇంటి నుంచే ప్రారంభమవుతుంది. ప్రజలకు వ్యాధులు రాకముందే వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, అవసరమైన సమయంలో దవాఖానలకు తరలించడం, చికిత్స అనంతరం కూడా పర్యవేక్షించడం వంటి బాధ్యతలను గ్రామస్థాయిలో ఆశా వర్కర్లు నిర్వర్తిస్తున్నారు. ప్రజల ఇంటి ముంగిటే ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఆరోగ్య వ్యవస్థకు ఆశాకిరణాలుగా నిలుస్తున్నారు. వారికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడంలేదు.
ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు చాలా కీలకమైనవి. తమ పరిధిలోని ప్రతి కుటుంబంతోనూ ప్రత్యక్ష పరిచయం, వారి ఆరోగ్య పరిస్థితులపై ఆశావర్కర్లకు అవగాహన ఉంటుంది. అందుకే ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో వారు ఒక ముఖ్యమైన వారధిగా నిలుస్తున్నారు. గర్భిణులకు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించడం నుంచి పిల్లలకు టీకాలు వేయించడం వరకు, ప్రసవ సమయంలో తగిన వైద్య సేవలు అందేలా చూడటం నుంచి చిన్నారుల ఆరోగ్యం, పోషణపై అవగాహన కల్పించడం వరకు ఆశా వర్కర్ల పాత్ర విస్తృతమైనది.
ఒక కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు దవాఖానకు వెళ్లేలా ప్రోత్సహించడం, ప్రభుత్వ హాస్పిటళ్లలో అందుబాటులో ఉన్న సేవలను వివరించడం, చికిత్సను కొనసాగించేలా సూచనలు చేయడం వంటి బాధ్యతలను వారు నిర్వర్తిస్తున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు చాలా ముఖ్యమైనవి. దవాఖనాలకు వెళ్లడానికి కూడా వెనుకాడే కుటుంబాలకు అవగాహన కల్పించి, వైద్యం అందేలా చూడటంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజారోగ్యానికి మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు సవాలుగా మారుతున్నాయి. ఈ వ్యాధుల ప్రత్యేకత ఏమిటంటే చాలాసార్లు ప్రారంభదశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స ప్రారంభిస్తే తీవ్రమైన పరిణామాలను చాలా వరకు నివారించవచ్చు. ఇక్కడే ఆశా వర్కర్ల పాత్ర మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది.
30 ఏండ్లు పైబడిన అందరూ పరీక్షలు చేయించుకొనేలా ప్రోత్సహించడం, ఆరోగ్య ప్రమాదాలపై అవగాహన కల్పించడం, జీవనశైలిలో మార్పులపై సూచనలు ఇవ్వడం, అవసరమైన వారికి వైద్య సేవలు అందేలా చూడడంలో ఆశా వర్కర్లు కీలకంగా పనిచేస్తున్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి అధిక రక్తపోటు ఉన్నదని గుర్తిస్తే భవిష్యత్తులో గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలను నివారించే అవకాశం ఉంటుంది.
మధుమేహాన్ని ప్రారంభ దశలో గుర్తిస్తే క్రమబద్ధమైన ఆహారం, వ్యాయామం, మందులు, వైద్య పర్యవేక్షణ ద్వారా అనేక సంక్లిష్టతలను అడ్డుకోవచ్చు. అదేవిధంగా క్యాన్సర్కు సంబంధించిన అనుమానాస్పద లక్షణాలను ముందుగానే గుర్తించి, సంబంధిత వైద్య కేంద్రాలకు వెళ్లేలా ప్రజలను ప్రోత్సహించడం కూడా ఎంతో ప్రాణరక్షకమైన చర్య. అందువల్ల ఆశా వర్కర్ల సేవలను కేవలం ఆరోగ్య కార్యక్రమాల అమలులో భాగంగా చూడటం సరికాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య రంగంలో మౌలిక వసతుల విస్తరణకు కేసీఆర్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకున్నది. ప్రతి జిల్లాకూ వైద్య కళాశాల, కొత్త దవాఖానలు, ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసింది. వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన సేవలను విస్తరించింది. ఈ నేపథ్యంలో బలమైన కమ్యూనిటీ ఆరోగ్య వ్యవస్థ నిర్మాణంలో ఆశా వర్కర్లు సమర్థంగా పనిచేస్తున్నారు. ప్రజలు దవాఖానకు వెళ్లాల్సిన అవసరం రాకముందే ప్రజల ఇండ్ల వద్దనే ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. అందుకే తెలంగాణలో భవిష్యత్తు ప్రజారోగ్య విధానంలో ఆశా వర్కర్ల పాత్రను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది.
భవిష్యత్తులో డిజిటల్ హెల్త్ రికార్డులు, మొబైల్ యాప్స్, టెలీ మెడిసిన్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ప్రజారోగ్యాన్ని మరింత సమర్థవంతంగా మార్చగలదు. సాంకేతికతకు మానవ ప్రమేయం తోడైతేనే ప్రజలకు పూర్తి ప్రయోజనం చేరుతుంది. ప్రజలతో నేరుగా మాట్లాడే ఆశా వర్కర్లు ఈ డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలో కీలక భాగస్వాములుగా మారగలరు. ప్రతి కుటుంబ ఆరోగ్య పరిస్థితినీ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ, ప్రమాదంలో ఉన్న వ్యక్తులను గుర్తించి, అవసరమైన వైద్య సేవలకు అనుసంధానం చేయగలరు. ప్రజారోగ్య వ్యవస్థలో ఆశా వర్కర్ల బాధ్యతలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ, వారి పారితోషికం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత వంటి అంశాలపై అనేక ఆందోళనలు ఉన్నాయి. ఆశా వర్కర్లు సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టాల్సిరావడం బాధాకరమైన విషయం.
ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం పనిచేస్తున్న వారికి తగిన గౌరవం, గౌరవప్రదమైన పారితోషికం, సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత. వారికి ఇచ్చిన హామీలను అమలు చేసి, ఆశా వర్కర్లకు నెలకు రూ.18,000 పారితోషికం అందించడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు కల్పించాలి. ప్రజారోగ్య వ్యవస్థ నిర్మాణంలో కీలకమైన వారిని కేవలం ఉద్యోగులుగా చూడకూడదు.
ఎన్ని వ్యాధులను ముందుగానే గుర్తించగలిగాం? ఎన్ని ప్రాణాలను కాపాడగలిగాం? ప్రజలను ఎంత ఆరోగ్యంగా ఉంచగలిగాం? అనే అంశాలు విజయవంతమైన ఆరోగ్య వ్యవస్థలో నిర్మాణంలో కీలకమైన ప్రమాణాలు. ఆ ప్రమాణాల ప్రకారం చూస్తే ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు అమూల్యమైనవి. ప్రజల ఆరోగ్యం కోసం ఇంటింటికీ తిరుగుతున్న ఆశా వర్కర్లకు న్యాయం చేయడం అంటే తెలంగాణ ప్రజల ఆరోగ్యానికి న్యాయం చేయడమే. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న ఆశాకిరణాలకు తగిన గౌరవం, గౌరవప్రదమైన పారితోషికం, సామాజిక భద్రత కల్పించాలి. తెలంగాణ ప్రజారోగ్య వ్యవస్థకు వారి సేవలను మరింత బలోపేతం చేయాలి.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ మాజీ ఎంపీ)
-బోయినపల్లి వినోద్ కుమార్