చుంచుపల్లి, సెప్టెంబర్ 30 : భూ రీ సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం చుంచుపల్లి మండలంలో పర్యటించిన ఆయన చుంచుపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామ పరిధిలోని 2,027 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించిన సర్వేను వేగవంతం చేసి, భూ సరిహద్దులు, రికార్డులను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. అనంతరం చుంచుపల్లి తండా ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు.
విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. మేధో వైకల్యం కలిగిన, పాఠశాలకు హాజరుకాలేని విద్యార్థులకు ఇంటి వద్దే విద్యాబోధన అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం, తాగునీరు, పారిశుధ్యం, విద్యాబోధన తదితర అంశాలను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన విద్య, సురక్షితమైన వాతావరణం కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ నాగరాజు, సర్వే అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

భూ రీ సర్వేను సకాలంలో పూర్తి చేయాలి : కలెక్టర్ అంకిత్