మహిళల హక్కుల కోసం ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) అర్ధ శతాబ్దకాలంగా పనిచేస్తున్నది. 1974లో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థినుల చొరవతో ఆవిర్భవించిన ఈ సంఘం మొదట మహిళలపై వేధింపులు, అసభ్య సాహిత్యానికి, వరకట్న హత్యలకు వ్యతిరేకంగా పోరాడింది. ఆ తర్వాత అధిక ధరలు, అవినీతి, నిరుద్యోగానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాలుపంచుకున్నది. పురుషాధిక్యతకు వ్యతిరేకంగా పోరాడే మహిళా సంఘాలు అవసరమని.. కార్మిక, కర్షక వర్గాలతో కలిసి పోరాడాలనే ఉద్దేశంతో ఏర్పడిన అభ్యుదయ మహిళా సంఘం ఆ తర్వాత ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ)గా మారింది.
POW | ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు పురుషాధిపత్యానికి వ్యతిరేకంగా, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో సమానత్వం కోసం, శ్రామికవర్గ మహిళల విముక్తి కోసం పోరాడుతూనే ఉన్నది. మహిళల ఆర్థిక స్వావలంబన మహిళా సాధికారతను, సమానత్వ హక్కును ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం రోజురోజుకు తగ్గిపోతున్నది. పలు రంగాల్లో పురుషులతో సమానంగా వేతనాలు పొందడం లేదు. ఆశావర్కర్లుగా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులుగా లక్షలాది మంది మహిళలు శ్రమదోపిడీకి గురవుతున్నారు. మోదీ సర్కార్ తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలు కార్మికవర్గ హక్కులను కాలరాస్తున్నాయి. వ్యవసాయం కార్పొరేటీకరణ వల్ల రైతులు భూములను కోల్పోతున్నారు. తద్వారా వ్యవసాయ రంగంలో మహిళల ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.
దేశంలో మహిళా హక్కులపై గతంలో ఎన్నడూ లేనంతగా దాడులు జరుగుతున్నాయి. ఇంటాబయట మహిళలు ఎదుర్కొంటున్న హింస, దౌర్జన్యాలకు అంతులేకుండా పోతున్నది. మల్లయోధులపై లైంగికవేధింపులకు పాల్పడిన బీజేపీ నేత, మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదు చేయడానికి పోరాడాల్సి వచ్చింది. ఆయనపై పోరాడిన సాక్షిమాలిక్ తనకు తానుగా పోటీల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వినేశ్ ఫోగట్ కేవలం 100 గ్రాముల బరువు కారణంగా కుట్రపూరితంగా ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురయ్యారు. బిల్కిస్ బానోపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన దుర్మార్గులకు క్షమాభిక్ష పెట్టడమే కాకుండా సన్మానాలు చేస్తున్నారు. మణిపూర్‌లో మహిళలపై దాడులు, నగ్న ఊరేగింపులు జరుగుతున్నాయి. వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్న మానవ హక్కుల కార్యకర్త అరుంధతి రాయ్ లాంటివారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలైనా మహిళలకు ఇచ్చిన అనేక వాగ్దానాలను నెరవేర్చలేదు. తక్కువ ధరకే గ్యాస్, ఉచిత విద్యుత్తు, పింఛన్లు, రేషన్‌కార్డులు, మహిళలకు ఆసరా లాంటి హామీలను ఇప్పటికీ అమలు చేయలేదు. రాష్ట్రంలో మహిళలు, పసిపిల్లలు, వికలాంగులు, ట్రాన్స్జెండర్లపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటిని వెంటనే అరికట్టాల్సి ఉన్నది.
స్త్రీల వైద్యం, విద్య, ఉద్యోగ, వివాహ తదితర అంశాలకు సంబంధించి పితృస్వామిక ఆధిపత్య బంధనాలను ముందుకుతెస్తున్న మోదీ కార్పొరేటీకరణ, మనువాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. మోదీ ఫాసిస్టు పాలనా విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక అవకాశాలను రక్షించుకోవడానికి పోరాటాలను బలోపేతం చేయాల్సిన తరుణంలో ప్రగతిశీల మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర ఏడో మహాసభలను నిర్వహిస్తున్నది. మహిళా ఉద్యమ కర్తవ్యాలను నిర్దేశించుకోబోతున్న ఈ సభలు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1, 2 తేదీల్లో హైదరాబాద్‌లో జరుగనున్నాయి. ప్రముఖులు పాల్గొననున్న ఈ మహాసభలను విజయవంతం చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గం విజ్ఞప్తి చేస్తున్నది.