రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా రయ్యిరయ్యిమని ప్రగతి పథంలో పరుగులు తీయించిన కేసీఆర్ అంటే ప్రత్యర్థుల గుండెల్లో దడ. ఒకరు కేసీఆర్ గుర్తులు చెరిపేస్తానని శివాలు తొక్కుతుంటే మరొకరు ఎక్స్పైరీ డేట్ అని ఎగిరెగిరిపడుతున్నారు. ఎవరెన్ని చెప్పినా రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ కీర్తి, ప్రతిష్ఠలు చెరిపేస్తే చెరిగిపోయేవి కాదు. అవి నీటి మీది రాతలు కాదు, శిలాక్షరాలు. కేసీఆర్ పాలన సాధించిన అద్భుత విజయాలు కాంగ్రెస్ హామీలు, బీజేపీ తీర్మానాల తరహాలో నీటి మూటలు కావు, అద్వితీయ సువర్ణాక్షరాలు. ఇది నిన్న నిజం, నేడు నిజం, ఎన్నడూ నిజమే. అద్దం లాగే అంకెలు కూడా అబద్ధం చెప్పవు. ప్రజల అనుభవాలు భ్రమలు కావు. ఆర్థికవేత్తల విశ్లేషణలు, ప్రజల తలపోతల నిండా ఇప్పటికీ కేసీఆరే కనిపించడం యాదృచ్ఛికం ఏమీ కాదు. వెనుకబాటుతనం వారసత్వంగా పొందిన సరికొత్త రాష్ర్టాన్ని ఆదర్శంగా, అన్నపూర్ణగా తీర్చిదిద్దిన చరిత్ర కేసీఆర్‌ది.
అడ్డగోలు హామీలతో ప్రజలను మాయచేసి అధికారాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకున్నది కానీ ప్రజలను మెప్పించలేక చతికిల పడుతున్నది. ప్రజలు కేసీఆర్ ప్రభుత్వమే ఉంటే ఎంత బాగుండునని పదే పదే యాది చేసుకుంటున్నారు. మరోవైపు నిపుణులూ కేసీఆర్ పాలనను తలచుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమాలను సమతూకం చేస్తూ సాధించిన విజయ పరంపరపై నిన్నటి ప్రశంసలు, అవార్డులే కాదు నేటికీ వెల్లువెత్తుతున్న మెచ్చుకోళ్లు ప్రత్యర్థులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. కేసీఆర్ సారథ్యంలో దాదాపు పదేండ్ల పాటు తెలంగాణ అభివృద్ధిలో వేసిన అంగలను విశ్లేషకులు, నిపుణులు ఇప్పటికీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తుండటం మనం చూస్తున్నాం.
కేసీఆర్ హయాంలో ప్రగతికి చిరునామాగా తెలంగాణ మారిందని, దేశానికి ఓ నమూనాలా నిలిచిందని ఆర్థికవేత్త, ఫైనాన్స్ ప్లానర్ ముత్తుకృష్ణన్ తాజాగా కితాబివ్వడం విశేషం. ముఖ్యం గా వార్షిక వృద్ధి రేటు 8 శాతంగా ఉండటం, తలసరి ఆదాయంలో జాతీ య సగటుకన్నా యాభై శాతానికి పైగా ఆధిక్యత సాధించడాన్ని ఆయన ప్రస్తావించారు. మళ్లీ గెలిచి ఉంటే రాష్ట్రం నూతన శిఖరాలను అధిరోహించి ఉండేదని ముత్తుకృష్ణన్ పేర్కొనడం గమనార్హం. తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిని కేస్ స్టడీగా తీసుకొని అధ్యయనం చేయాలన్నది ఆయన అభిప్రాయం. తన వ్యాఖ్యల ద్వారా ప్రస్తుత కాంగ్రెస్ పాలకుల పనితీరును ఆయన చెప్పకనే చెప్పారు.
నిజానికి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే ఎక్కడెక్కడి నుంచో అధికారులు, ఆర్థికవేత్తలు ఇక్కడికి వచ్చి ఈ నమూనాను అధ్యయనం చేసి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరింత లోతుగా అధ్యయనం జరగాలనడం ముదావహం. మరి తాము అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇంకా కేసీఆర్ పరిపాలన గురించే అబ్బురంగా చెప్పుకోవడం కాంగ్రెస్ పాలకులకు ఎందుకు నచ్చుతుంది? అందుకే ఆనవాళ్లు చెరిపేస్తామంటూ ఆకాశం మీదకు బాణాలు వేస్తున్నారు. అవి తిరిగి వచ్చి తమకే గుచ్చుకుంటే ఎగిరెగిరి పడుతున్నారు. కరెంటులో, కల్యాణలక్ష్మిలో, పింఛనులో, రైతుబంధులో, రుణమాఫీలో.. ఇలా అడుగడుగునా కేసీఆర్ సారే యాదికొస్తుంటే కల్లబొల్లి కాంగ్రెస్ నేతలకు చురుక్కుమని అనిపించడంలో వింతేముంది? కేసీఆర్ పరిపాలన ప్రాభవం దేశానికి ఓ పాఠం. అది కాంగ్రెస్ నేతలకు గుణపాఠమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు.