సుమారు 30 వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులిచ్చిన సందర్భంగా, వారితో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటుచేసి, తమ ప్రభుత్వం సాధించిన ఘనకార్యాన్ని వివరించారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, ఆ సమయంలో ప్రైవేటు ఉపాధ్యాయులనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, దశాబ్దాలుగా ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తున్న నాలాంటి అనేకమంది ప్రైవేటు ఉపాధ్యాయులను తీవ్రంగా నిరాశపరచడమే కాకుండా అవమానించేలా ఉన్నాయి.
ఇంటర్ పాస్ లేదా డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థులతో ప్రైవేట్ పాఠశాలలు నిర్వహింపబడుతున్నాయని ఒక రాష్ట్ర ప్రభుత్వాధినేత స్వయంగా పేర్కొనడం ఏం సబబు? ఆయన అట్లా మాట్లాడవచ్చా? ఒకవేళ అదే నిజమైతే, డిగ్రీ ఫెయిలైన వారితో ప్రైవేటు బడులు నడుస్తుంటే, అది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా? మరి సంబంధిత అధికారులు ఏం చేస్తున్నట్టు? ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల విద్యార్హతలతో పాటు టెట్ సర్టిఫికెట్లను ఏటా విద్యాశాఖ అధికారులు పరిశీలించిన తర్వాతనే, ప్రభుత్వం ఆ పాఠశాలకు గుర్తింపు ఇస్తుందన్న విషయం ముఖ్యమంత్రికి తెల్వకపోతే ఎట్లా? ఒకవేళ ఉపాధ్యాయుల, విద్యార్థుల సంఖ్య ఉండాల్సిన నిష్పత్తిలో లేకున్నా, పనిచేస్తున్న ఉపాధ్యాయుల అర్హతలలో లోపాలున్నా, వసతుల లేమి ఉన్నా, సంబంధిత జిల్లా అధికారులు ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేయడం లేదా?
ప్రైవేటు ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం మూడు రకాల పరీక్షల్లో నెగ్గవలసి ఉంటుంది. 1.ప్రభుత్వానికి తమ అర్హతలను చూపించడం. 2.తాము పనిచేసే పాఠశాలకు మంచి ర్యాంకులు సంపాదించడం. 3.ఈ టీచర్ బాగా చదువు చెప్తాడన్న పేరును విద్యార్థుల్లోనూ, తల్లిదండ్రుల్లోనూ సంపాదించుకోవడం. ఏడాదికి 11 నెలలు మాత్రమే ఉద్యోగంలో ఉండే ప్రైవేటు టీచర్‌కు ఈ మూడూ సాధించకుంటే వచ్చే ఏడాది ఉద్యోగం ఉంటదో ఉండదో తెల్వదు! ప్రభుత్వ టీచర్లలా ఒకసారి ఉద్యోగం సంపాదిస్తే జీవితాంతం దిలాసాగా ఉండే పరిస్థితి కాదు వారిది. వారు ఎప్పటికప్పుడు అప్డేట్ కావడం తప్పనిసరి.
ఈ విషయాన్ని విస్మరించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ప్రైవేట్ పాఠశాలలో విద్యాబోధన చేసే ఉపాధ్యాయులు ఇంటర్ పాస్ లేదా డిగ్రీ ఫెయిల్‌గా ఉంటారనడం ఎంతవరకు సమంజసం? ఇది అరకొర జీతాలతో జీవన భారాన్ని మోస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులను అవమానించడం కాదా? అసలు రాష్ట్రంలోని ప్రజలందరినీ సమదృష్టితో చూడవలసిన ప్రభుత్వ అధినేత ప్రైవేటు ఉపాధ్యాయులనీ, ప్రభుత్వ ఉపాధ్యాయులనీ వేరుచేసి చూడటం ఎంతవరకు సబబు? ఉపాధ్యాయుడు అంటే విద్యాబోధన చేసేవారు అనే కదా అర్థం. అనేకానేక కారణాల వల్ల ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం పొందనంత మాత్రాన అవమానింపబడాల్సిందేనా? సంఘటిత శక్తిగా మారి రాజకీయాలను శాసిస్తున్న ప్రభుత్వ టీచర్లంటే వారికి భయం, భక్తి ఉండటాన్ని అర్థం చేసుకోగలం. కానీ, దానికి ప్రైవేటు టీచర్లను అవమానించడం ఎందుకు? ఒకరిని గొప్ప చేయడానికి మరొకరిని అవమానించడం అవసరమా? తేనెటీగలతో పెట్టుకోవద్దు అనుకుంటున్న ముఖ్యమంత్రికి చలిచీమలు కూడా ప్రమాదకరమే అన్న విషయం తెలియదా?
ప్రభుత్వ టీచర్లే అన్నిరకాలుగా సమర్థులైతే, ప్రైవేటు టీచర్లు డిగ్రీ ఫెయిల్ గాైళ్లెతే మరి ప్రజలు తమ పిల్లలను ప్రైవేటు బడుల్లో చేర్పించడానికే ఎందుకు ముందుకొస్తున్నరు? నాణ్యమైన విద్య అందించకపోతే ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు పెరుగుతున్నట్టు?
రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లోనే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నదన్న విషయం సాక్షాత్తు ముఖ్యమంత్రే ఒప్పుకొన్నారు కదా. మరి ఇంటర్ పాస్, డిగ్రీ ఫెయిల్ ఉపాధ్యాయులను, చదువు చెప్పేందుకు అనర్హులని ముఖ్యమంత్రి ఎకసెక్కాలాడుతున్నవారినే సమాజం, తల్లిదండ్రులు ఎందుకు నమ్ముతున్నట్టు? ఇలా నమ్ముతున్న తల్లిదండ్రుల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారన్న విషయం నిజం కాదా! ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తి ఈ విషయాలను గమనించాలా వద్దా? ఇవాళ ప్రైవేటు టీచర్లు, ప్రైవేటు బడులు లేకుండా కేవలం ప్రభుత్వ పాఠశాలలతోనే తెలంగాణ విద్య అవసరాలను ప్రభుత్వం తీర్చగలదా? ప్రభుత్వ టీచర్లు అంత సమర్థులే అయితే మళ్లీ టెట్ రాయడానికి ఎందుకు వెనుకాడుతున్నట్టు? వారిని ప్రభుత్వం ఎందుకు వెనకేసుకువస్తున్నట్టు? రాష్ట్రంలో పిల్లల విద్యావసరాలకు తగినట్టుగా ప్రభుత్వం పాఠశాలలను పెట్టదు. మెగా డీఎస్సీలని హామీ ఇచ్చి మరీ మాట తప్పుతారు. రాష్ట్రంలో మంజూరు చేసే బీఈడీ సీట్లకు, నింపే టీచర్ పోస్టులకు పొంతన ఉండదు. మరి బీఈడీ పాస్ అయి, సర్కారీ ప్రభుత్వం దొరకక, విద్యా బోధనకు అర్హత తెచ్చుకున్న వ్యక్తి అటు ప్రభుత్వ ఉద్యోగమూ దక్కక, ఇటు మీతో మాటలు పడుతూ ప్రైవేటు ఉద్యోగం చేయలేక ఏం చేయాలి ముఖ్యమంత్రి గారూ!!
– శ్రీ