రాష్ట్రంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) ఇప్పుడు రాజకీయ చదరంగంలో పావులుగా మారాయి. గడువు ముగిసిన సంఘాలకు ఎన్నికలు నిర్వహించాల్సింది పోయి, నామినేటెడ్ పద్ధతిలో కమిటీలను వేయాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చకు దారితీస్తున్నది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు రాజకీయ సమీకరణాలు అనుకూలంగా లేవు. దీంతో హస్తం పార్టీ పాలకుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. రైతుభరోసా, రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం, అన్ని పంటలకు క్వింటాల్‌కు బోనస్ 500 చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు కేవలం సన్న వడ్లకు మాత్రమే చెల్లిస్తామని చెప్పడం ఇందుకు ప్రధాన కారణాలు. అది కూడా ఒక్క పంటకు చెల్లిస్తే మరో పంటకు ఎగనామం పెట్టింది కాంగ్రెస్ సర్కార్. దీనితో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకున్నది.
కాంగ్రెస్ సర్కార్ స్థానిక ఎన్నికలపై దాటవేత ధోరణి అనుసరిస్తున్నది. ప్రస్తుతం ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో ఎన్నికలకు వెళ్తే, ఫలితాలు ప్రతికూలంగా వస్తాయని జంకుతున్నది. రైతుల ఆగ్రహం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై పడుతుందని కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత అలా ఉంటే, అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లయినా పదవులు దక్కలేదని ద్వితీయ శ్రేణి నాయకులు ఆగ్రహంగా ఉన్నారు. కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. వారికి తక్షణమే ‘రాజకీయ ఉపాధి’ కల్పించడమే లక్ష్యంగా ఈ నామినేటెడ్ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తున్నది. సహకార రంగం అనేది ‘రైతుల కోసం, రైతుల ద్వారా’ నడవాల్సిన వ్యవస్థ. 97వ రాజ్యాంగ సవరణ ప్రకారం సహకార సంఘాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. అయితే రైతులు తమ ప్రతినిధులను తామే ఎన్నుకొనే అవకాశాన్ని ప్రభుత్వం లాగేసుకుంటున్నది. కేవలం అధికార పార్టీకి చెందిన నాయకులను, అనుచరులను ఈ కమిటీల్లో కూర్చోబెట్టడం ద్వారా సహకార సంఘాల నిధులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొనే ప్రమాదమున్నదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
గతంలోనూ సమైక్య రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పుడు కోర్టులు జోక్యం చేసుకొన్న దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ అదే పునరావృతమయ్యేలా కనిపిస్తున్నది. ప్రతిపక్షాలు ఈ నిర్ణయంపై భగ్గుమంటున్నాయి. ‘ఎన్నికలను ఎదుర్కొనే దమ్ము లేకనే దొడ్డిదారిన పదవులను పంచుకుంటున్నారు’ అని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. సహకార సంఘాల్లో రాజకీయ జోక్యం పెరిగితే, అర్హులైన రైతులకు అందాల్సిన రుణాలు, సబ్సిడీలు కేవలం అధికార పార్టీ సానుభూతిపరులకే దక్కే ప్రమాదం ఉన్నది. ఈ ధోరణి వ్యవస్థను నిర్వీర్యం చేసే అవకాశం ఉన్నది. సహకార రంగాన్ని బలోపేతం చేయాలంటే పారదర్శకమైన ఎన్నికలే ఏకైక మార్గం. అలా కాకుండా కేవలం రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పించే వేదికలుగా వీటిని మారిస్తే, అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ తీస్తుంది. మరి ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటుందా లేక మొండిగానే ముందుకు వెళ్తుందా అనేది వేచి చూడాలి.
– పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే