Telangana | ఒక్కడే నాయకుడు.. నాలుగు కోట్ల జనాభా. పోరాడి సాధించుకున్న తెలంగాణ. దేశానికే ఆదర్శమైన ఆలోచనలు- పథకాలు. అంతర్జాతీయ ప్రామాణిక సంస్థల ప్రశంసలు. ఉద్యమ నాయకుడికి క్షీరాభిషేకాలు. దేశ ప్రధాని సైతం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో కొనియాడారు. మరి ఇప్పుడు కాలికి బలపం కట్టుకొని అనేక అసత్యాలను ప్రచారం చేసి ఎట్టకేలకు అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, గవర్నర్‌తో అసత్యాలు చెప్పించడం, అప్పులు ఆరు లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయంటూ సమావేశాలు- సమీక్షలు నిర్వహించడం, గత ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే కదా! ప్రజానీకాన్ని, మేధావులను తప్పుదోవ పట్టించడానికే కదా!
ఓటర్లు పిచ్చోళ్లని, వాళ్లకు నిజాలు చెప్పినా నమ్మరని, అబద్ధాలే తీయగా ఉంటాయని, వాళ్లు ఏది అడిగితే అది ఇస్తామని, మళ్లీ వాళ్ల జేబులే కొడతామని విస్పష్టంగా పదేండ్ల కిందటే ప్రస్తుత సభా నాయకుడు ఓ వేదిక ద్వారా చెప్పారు. మరి ఇప్పుడు అప్పులపై నానా యాగీ చేయడమెందుకు? కొన్ని అంశాలను సీబీఐకి అప్పగిస్తామని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని పదేపదే చెప్పడం హర్షించదగ్గ విషయమే. 1991లో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టింది కాంగ్రెస్ కాదా? అప్పులు పెరిగిపోయి.. అప్పులే పుట్టని స్థితిలో ఐఎంఎఫ్ నుంచి అప్పు తెచ్చింది కాంగ్రెస్ కాదా? భారత ఆర్థిక వ్యవస్థను ప్రైవేటీకరణ చేసింది కాంగ్రెస్ కాదా? ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆనాటి ప్రతిపక్షాలు నిరసన తెలిపింది నిజం కాదా? నూతన ఆర్థిక విధానాలతో భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విలీనం చేయవచ్చని అప్పట్లో చెప్పిందెవరు? దారిద్య్రం నిర్మూలన వైపుగా అభివృద్ధిని వేగవంతం చేయవచ్చని చెప్పింది కాంగ్రెస్ కాదా? పెరిగిపోతున్న కార్మిక శక్తికి విస్తృతస్థాయిలో ఉద్యోగాలు కల్పించవచ్చని, ప్రపంచ మార్కెట్లో పోటీని తట్టుకోగల రీతిలో ఎక్కువ మంది కార్మికులకు ఉపాధి కల్పించగల ఉత్పత్తి వ్యవస్థను రూపొందించవచ్చని చెప్పింది కాంగ్రెస్ కాదా? నాడు ప్రతిపక్షాలు మొత్తుకుంటుంటే.. అప్పులు ఆస్తులను సృష్టిస్తాయని, ఉద్యోగాలు కల్పిస్తాయని, దారిద్య్రం పోతుందని చెప్పింది కాంగ్రెస్ కాదా?
1991 -2009 మధ్యకాలాన్ని ఒకసారి పరికిస్తే.. ఈ నూతన ఆర్థిక విధానాల లక్ష్యాలు నెరవేరకపోగా ఆకాశాన్నంటే ధరలు ఒకవైపు, అంతులేని నిరుద్యోగం మరోవైపు పెరిగిపోవడాన్ని చూసి అవినీతి, బంధుప్రీతి- చీకటి బజారి అన్న శ్రీశ్రీ పాట గుర్తుకొస్తున్నది. 2జీ కుంభకోణం, ఆదర్శ హౌసింగ్ సొసైటీ, కామన్వెల్త్ తదితర కుంభకోణాలు ఆనాటి కాంగ్రెస్ పాలకుల పుణ్యమే కదా! ఆనాటి కుంభకోణాల పాలనే నేడు కాంగ్రెస్ చెప్తున్న ప్రజా పాలన. బాజాప్తాగా తమపై న్యాయ విచారణ చేయాలని బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడమే ప్రజాపాలనకు సూచిక. ఒకవేళ తప్పు చేస్తే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామని బహిరంగంగా ప్రకటించడమే అసలైన ప్రజాపాలన.
ఈ దేశంలో భూ సంస్కరణ వైఫల్యానికి ప్రధాన కారణం కాంగ్రెస్ కాదా? వామపక్ష భావజాలాన్ని లేకుండా చేసింది కాంగ్రెస్ కాదా? ఇది గత ప్రభుత్వాన్ని సమర్థించడం కాదు. ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రజలకు ప్రజాప్రతినిధులకు తెలియజేయటం. ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలైన శాసన, కార్య నిర్వాహక, న్యాయ, మీడియా తలుచుకుంటే, త్యాగనిరతి ఉంటే దారిద్య్రం పోదా? వట్టి మాటలు కట్టిపెట్టవోయి- గట్టి మేలు తలపెట్టవోయి! అన్న గురజాడ అప్పారావు మనోవాంఛను నెరవేర్చండి.
అప్పుల గురించి కొంత సూత్రబద్ధంగా చెప్పాలి. వర్ధమాన దేశాలను అభివృద్ధి పథంలో తీసుకురావాలంటే లోటు బడ్జెట్ విధానాన్ని అనుసరించాలని జీవీ కిమ్స్ అనే ఆర్థికవేత్త సూచించారు. ఈ లోటును పూడ్చటానికి వివిధ మార్గాలు ఉన్నప్పటికీ అప్పులే ప్రధాన మార్గాలుగా ప్రభుత్వాలు ఎంచుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ లోటు బడ్జెట్ విధానాన్ని ఎంచుకున్నది. మార్కెట్ అప్పులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పులు, కేంద్ర ప్రభుత్వ అప్పులు, ప్రభుత్వ సెక్యూరిటీలను బ్యాంకుల ద్వారా అమ్మకం తదితర మార్గాల్లో లోటును పూడ్చుకుంటూ తెలంగాణ అభివృద్ధి పథంలో పయనించింది. ఈ సెక్యూరిటీల మెచ్యూరిటీ కాలాన్ని 10 ఏండ్ల నుంచి 20 ఏండ్లకు పెంచినా మార్కెట్లో విశేష స్పందన లభించింది. అప్పులు పెరిగిన మాట వాస్తవమే. కానీ, మిగతా రాష్ర్టాలతో పోలిస్తే అప్పుల విషయంలో 28 రాష్ర్టాల జాబితాలో మన తెలంగాణ చివరి నుంచి ఐదో స్థానంలో ఉన్నది. దేశ జీడీపీలో అప్పుల నిష్పత్తి 27.3 శాతం ఉండగా మన రాష్ట్ర అప్పుల నిష్పత్తి 21 శాతమే. అంతర్జాతీయంగా చూసుకుంటే.. ఈ నిష్పత్తి జపాన్‌లో 230 శాతం, గ్రీస్‌లో 182 శాతం, పోర్చుగల్‌లో 120 శాతం, అమెరికాలో 107 శాతం, సింగపూర్‌లో 110 శాతంగా ఉన్నది. కేంద్రం అప్పులు 156 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
తెలంగాణ విషయానికి వస్తే అప్పులతో సంపద సృష్టి జరిగింది. అప్పులు తెచ్చి గత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అనేక ప్రాజెక్టులు నిర్మించింది. పారిశ్రామిక రంగ అభివృద్ధికి కావాల్సిన మౌలిక వసతులను సమకూర్చింది. మరోవైపు సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్ర తలసరి ఆదాయం, దేశ తలసరి ఆదాయాన్ని మించిపోయింది. అనేక రాష్ర్టాలు మన పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయి.
రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. రైతు రాజయ్యాడు. పారిశ్రామిక, సేవా రంగాలు వృద్ధి చెందాయి. అన్నింటి మూలంగా పదేండ్లలో తెలంగాణలో ప్రజల కొనుగోలు శక్తి 41 శాతం పెరిగినట్టు అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల వరకు ఉద్యోగాలు కొత్తగా పుట్టుకొచ్చాయి. గత ప్రభుత్వం అప్పులు చేసిందని గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ సైతం అప్పులు చేయకుండా ప్రభుత్వాన్ని ఎవరూ నడపలేరని అంగీకరిస్తున్నది. అందుకే ప్రజానీకం, మేధావులు అప్పులకు సంబంధించిన సిద్ధాంతాలు, సూత్రాలను పరిశీలించి శాస్త్రీయతను భవిష్యత్తులోనైనా గమనించాలి.
-పొందూరు ప్రభాకర్ రావు
90106 31727