బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం, హామీలను నీరుగార్చడం వంటివి పెచ్చరిల్లడంతో స్థానిక సంస్థల ఎన్నికల బహిష్కరణకు బీసీలు సిద్ధపడుతున్నారు. అయితే, ఇక్కడ మనం బీసీ రిజర్వేషన్ల అమల్లో ప్రభుత్వ వైఫల్యం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో పారదర్శకతపై అనుమానాలు, స్థానిక ఎన్నికల బహిష్కరణకు సంబంధించి న్యాయసమ్మతిని విమర్శనాత్మకంగా విశ్లేషించుకోవాలి.
బీహార్ ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్టు వస్తున్న ఆరోపణలు ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసింది. బీహార్ ఎన్నికలే కాదు, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇప్పుడు అనుమానం కలుగుతున్నది. కేంద్ర ఎన్నికల కమిషన్లో బీజేపీ అనుకూలుర నియామకం, ఈవీఎంల మానిప్యులేషన్, దొంగ ఓట్లు తదితర ఆరోపణలున్నాయి. ఇవి బీహార్లో బీజేపీ విజయానికి కారణాలని విమర్శకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన అధీనంలో ఉంచుకోవడం పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదు. ఇది ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతం లేని వాతావరణాన్ని సృష్టిస్తున్నది. తమ ఓటుహక్కు సరిగ్గా వినియోగించబడుతుందనే నమ్మకాన్ని బీసీ సామాజికవర్గాలు కోల్పోయాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల బహిష్కరణ ఒక నిరసన రూపంగా ఉద్భవిస్తున్నది.
విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం (వాస్తవానికి 56 శాతం కంటే ఎక్కువే ఇవ్వాలి) రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే, సరైన విధానాన్ని అనుసరించకపోవడంతో రిజర్వేషన్ల జీవోను కోర్టులు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ కొత్త నాటకానికి తెరలేపింది. పార్టీపరంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కొన్ని బీసీ సంఘాలను కాంగ్రెస్ లోబర్చుకున్నది. ఇది బీసీ సమాజాన్ని మోసగించడమే. ఓట్లు కొల్లగొట్టేందుకు గతంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఎన్నో హామీలిచ్చింది. కానీ, వాటిని అమలు చేయకుండా కాలయాపన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ రాజకీయ హక్కుల సాధన కోసం బీసీ సమాజం ఎన్నికలను బహిష్కరించడం ఒక సహేతుకమైన నిర్ణయంగా కనిపిస్తున్నది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్య పాలనకు కీలకమే. కానీ, స్థానిక ఎన్నికల్లో న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించకపోవడం, రిజర్వేషన్ల వాగ్దానాన్ని అమలు చేయకపోవడం వంటివి బీసీలను నిరాశపరిచాయి. ఈ తరుణంలో బీసీ సమాజం అసంతృప్తిని, నిరసనను వ్యక్తం చేసే శక్తివంతమైన సాధనంగా ఎన్నికల బహిష్కరణ మారింది. ఈ బహిష్కరణ ద్వారా రిజర్వేషన్ల అమలుకు చట్టపరమైన మార్గాలనే అన్వేషించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చు. ఈ బహిష్కరణతో స్థానిక సంస్థల ఎన్నికల న్యాయబద్ధతపై ప్రభుత్వం అనేక ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు, బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా, బీసీలు దూరంగా ఉండే ఈ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తాయి. దీనిపై ప్రజాస్వామ్యయుత చర్చ కూడా జరుగుతుంది. దీంతో బీసీ రిజర్వేషన్లను చట్టంలో నిక్షిప్తం చేసే దిశగా ఒత్తిడి పెరుగుతుంది.
రిజర్వేషన్ల అమలుకు కోర్టులు అభ్యంతరం తెలిపాయనేది ఉత్త అబద్ధపు ప్రచారమే. వాస్తవానికి రాజ్యాంగానికి లోబడి చట్టం చేస్తే కోర్టులు జోక్యం చేసుకోలేవు. అంటే, చట్టం చేయకుండా ఉద్దేశపూర్వకంగా బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం అడ్డుకున్నదని అర్థమవుతూనే ఉన్నది. ఇప్పటికైనా సీరియస్గా పరిగణించి బీసీ రిజర్వేషన్లను చట్ట పరిధిలోకి తీసుకురావడానికి నిజాయితీతో కృషి చేయాలి. లేకపోతే బీసీ సమాజం అసంతృప్తి మరింత తీవ్రమై ప్రజాస్వామ్యానికి మరిన్ని సవాళ్లు ఎదురయ్యే ప్రమాదమున్నది.
– చరిత