నిలబడ్డ చెట్లన్నీ మనవి కావు
గాలి వీచేవేవో కాయలు కాసేవేవో
కనిపెట్టగలగాలి
నిలబడ్డ చెట్లన్నీ మనవి కావు
ఓట్లు అడుగుతున్న చెట్లన్నీ మనవి కావు
కొన్ని కూల్చేటివి ఉంటాయి
కొన్ని మధ్యలోనే అమ్ముడుపోయేటివి ఉంటాయి
వాటంతటికవే కూలిపోయేటివి ఉంటాయి
కొన్ని మన ప్రాణం తీసేటివి ఉంటాయి
మన రాజ్యాంగాన్ని మార్చేటివి ఉంటాయి
ప్రజాస్వామ్యాన్ని బానిసను చేసేటివి ఉంటాయి
సంతలో నకలివేవో నాణ్యతవేవో
నమ్మకానివేవో
వెండివేవో రాగివేవో గుర్తించినట్లు
దమ్మానికి చోటునిచ్చే చెట్టును గుర్తించండి
ఎప్పుడూ మోసపోవద్దు ఎప్పుడూ ఓడిపోవద్దు
ఒక్కసారైనా ప్రజలు గెలవాలి
ప్రతిసారి పెట్టుబడిదారుడే గెలుస్తున్నాడు
అవినీతిపరుడే శాసనమవుతున్నాడు
హంతకుడే కుర్చెక్కుతున్నాడు
దొంగనే ధర్మధ్వజమైతున్నాడు
నిలువునా ముంచేవాడే
మూల పురుషుడు అవుతున్నాడు
ఎప్పుడిట్లెందుకైతుందో
ప్రతిసారి మాట్లాడుతున్నాము
మాట్లాడుకుంటూనే ఉన్నాము
రాస్తూనే ఉన్నాము ఆడి పాడుతూనే ఉన్నాము
అయినా విఫలమవుతున్నాము
చైతన్యమంతా
చెట్టు కింద మొలువని మొక్కల్లా
మాయమవుతున్నాము
నిప్పుల్లో ఎగతోయబడిపోతున్నాం
తడిలో మురిగిపోతున్నాము
ఎండలో వాడిపోతున్నాము
ఆలోచించండి ప్రజలారా విజ్ఞతతో
ఆలోచించండి!
రక్తాన్ని తాగుతున్న జలగలెవరు?
రక్తాన్ని దానం చేస్తున్న మానవులు ఎవరు?
చెరువును నింపుతున్నది ఎవరు?
చెరువులో ఇండ్లు కట్టుకుంటున్నదెవరు?
న్యాయానికి రోడ్డును వేస్తున్నది ఎవరు?
రోడ్డును తనింటికే మలుపుకున్నదెవరు?
చెట్లెప్పుడుంటావి
చెట్లెప్పుడూ పాడుతుంటావి
చెట్లెప్పుడూ అభయమిస్తుంటాయి
మనల్ని గుర్తించే చెట్టును గుర్తుంచుకోవాలికూరాడును
ఎడంకాలితో తన్నే పాటకు చరమగీతం పాడాలి
బొడ్రాయిని నిలబెట్టినట్లు
ఊరును నిలిపే ప్రజా దరువుకే
గండదీపం మోయాలి
– వనపట్ల సుబ్బయ్య
94927 65358