మాకియవెల్లి అనే ప్రముఖ ఇటాలియన్ రచయిత దుర్మార్గపు సిద్ధాంతం ప్రకారం-‘చెరువులో నిశ్శబ్దంగా ఉన్న నీటిని పైకి, కిందికి కదిలిస్తే, అందులో ఉన్న చేపలు భయంతో దిక్కుతోచక ఉపరితలానికి వస్తాయి. అప్పుడు జాలరి ఎలాంటి శ్రమ లేకుండా వాటిని తన వలలో వేసుకోవచ్చు’. ప్రస్తుత తెలంగాణ రాజకీయ దృశ్యాన్ని ఈ కోణం నుంచి చూసే..ఇక్కడ చెరువు-తెలంగాణ సమాజం అయితే, నీటిని కల్లోలపరుస్తున్నది-చంద్రబాబు, పవన్ కల్యాణ్, వారికి లోపాయికారిగా సహకరిస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. చేపలు-తెలంగాణ ప్రజలు, అస్తిత్వం, రాజకీయ చైతన్యం.
మాకియవెల్లి తన ‘ది ప్రిన్స్’ గ్రంథంలో చెప్పిన అత్యంత దుర్మార్గపు నియమం ఏంటంటే, ఒక సామ్రాజ్యాన్ని శాశ్వతంగా లొంగదీసుకోవాలంటే అక్కడి ప్రజల ఉమ్మడి చైతన్యాన్ని, సంస్కృతిని ముందుగా విచ్ఛిన్నం చేయాలి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ద్వయం సరిగ్గా ఇదే సూత్రాన్ని అమలు చేస్తున్నది. హైదరాబాద్‌లో తాము అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాలను కాపాడుకోవటం, రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకుండా చూడటం. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో శాంతిని విచ్ఛిన్నం చేసి అస్థిరపరచటం లాంటి లక్ష్యం కావచ్చు. కేసీఆర్ వస్తే తమ అక్రమాస్తుల పునాదులు కదులుతాయని భయపడే ఈ ఆంధ్రా శక్తులు, తెలంగాణ రాజకీయ క్షేత్రంలో రెచ్చగొట్టే సన్నివేశాలను సృష్టిస్తూ, కుల, వర్గ విభేదాల పేరిట, విగ్రహాల పేరిట, పదం లేదని..ఇలా ఎన్నో రూపాల్లో సాంస్కృతిక దాడులు.. నిరంతరం అలజడి సృష్టిస్తూనే ఉన్నారు.
మాకియవెల్లి సిద్ధాంతం ప్రకారం..ఒక బలహీనమైన పాలకుడు తన ఉనికిని కాపాడుకోవటానికి శత్రువులతోనైనా చేతులు కలుపుతాడు. ఇపుడు గుంపు మేస్త్రీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి, ప్రజల దృష్టిని మళ్లించటానికి ఈ ఆంధ్రా శక్తులు సృష్టిస్తున్న కృత్రిమ అలజడిని ఒక సాధనంగా వాడుకుంటున్నాడు. కానీ ఆయన గమనించని విషయం ఏమిటంటే..ఈ చెరువు పూర్తిగా కల్లోలమైతే నష్టపోయేది తెలంగాణ సమాజమే. బహుశా తెలిసే ఆయన చేస్తూ ఉండవచ్చు. ఈ శక్తుల అంతిమ వ్యూహం కేవలం రాజకీయ లబ్ధి మాత్రమే కాదు; హైదరాబాద్‌ను ఒక కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలనే వ్యూహం కూడా ఉండవచ్చని పలువురు తెలంగాణవాదుల వాదన. ఒకవేళ హైదరాబాద్ కేంద్ర పరిధిలోకి వెళ్తే, ఇక్కడి చట్టాలు మారిపోతాయి, స్థానిక ప్రభుత్వాల అధికారం పోతుంది. అప్పుడు తాము చేసిన భూదందాలు శాశ్వతంగా సురక్షితంగా ఉంటాయని ఈ జాలర్లు లెక్కలు వేసుకుంటున్నారు. వారు విసురుతున్న వల కేవలం హైదరాబాద్ మీదనే కాదు, తెలంగాణ ప్రజా చైతన్యంపై, దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ అస్తిత్వం మీద. ఇక్కడి ప్రజల రాజకీయ అవగాహనను గందరగోళంలో ముంచి, వారిని మానసికంగా బలహీనపరచటమే ఈ ఆటలోని పెద్ద చేప దురుద్దేశం. ఎప్పుడైతే ప్రజలు తమ హక్కులను మరిచి ఈ కృత్రిమ వివాదాల వలలో చిక్కుకుపోతారో, అప్పుడు ఈ శక్తులు అనుకున్న కుట్రలు సులభమ వుతాయి. తెలంగాణ ప్రజలు ఈ మాకియవెల్లి కుతంత్రాలను గుర్తించి, ఆ వలలో చిక్కకుండా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన తరుణమిది.
మొదటిది: ఎరను చూసి లొంగిపోవద్దు&జాలరి విజయం చేపల ఆవేశం మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ శక్తులు కల్పిస్తున్న తీవ్ర వివాదాలు తెరపైకి వచ్చినపుడల్లా ప్రజలు ఎమోషనల్ కాకుండా ప్రశాంతంగా ఉండాలి. ఆ వివాదాలన్నీ హైదరాబాద్ మీద కుట్ర నుంచి, వారి అక్రమ భూసామ్రాజ్యాల రక్షణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించటానికి వేసిన కృత్రిమ ఎరలు అని గుర్తించటమే మొదటి విజయం. ప్రజలు స్పందించటం మానేస్తే, జాలరి ఆట సాగదు.
రెండవది: బురద నీటిని నిజాలతో శుభ్రం చేయటం& నీటిని కల్లోలపరిచినప్పుడు అపోహలు, అబద్ధాలు తొందరగా వ్యాపిస్తాయి. దీనికి విరుగుడు ‘నిజాల వెల్లడి’. తెలంగాణలోని అపారమైన రాజకీయ చైతన్యం ఉన్న యువత, సామాజిక మాధ్యమాలు, మేధావులు ప్రతి ఒక వివాదం వెనుక ఉన్న ఆర్థిక, భూసంబంధిత ప్రయోజనాలను విశ్లేషించి ప్రజల ముందు పెడుతూనే ఉండాలి. సంయమనం కోల్పోకుండా రాజకీయ డ్రామాలను, హైదరాబాద్‌లోని ల్యాండ్ బ్యాంకుల రక్షణ ప్రణాళికలను ఆధారాలతో సహా బట్టబయలు చేయటం ద్వారా ఆ బురద నీటిని మళ్లీ స్వచ్ఛంగా మార్చవచ్చు.
మూడవది: ‘తెలంగాణ అస్తిత్వాన్ని’ రక్షణ కవచంగా మార్చుకోవటం… మాకియవెల్లి సిద్ధాంతం ప్రకారం చేపలను విడివిడి గుంపులుగా విడగొడితేనే వల వేయటం సులువవుతుంది. ఇక్కడి ప్రజలను కూడా కులాలు, పార్టీల పేరుతో విడగొట్టాలని చూస్తున్నారు. దీనికి విరుగుడు-మనమంతా ఒక్కటే అనే ‘తెలంగాణ అస్తిత్వ’ భావనను బలంగా పట్టుకుని ఉండటం. ఏ సమస్య ఎదురైనా ‘దీనివల్ల తెలంగాణ సార్వభౌమత్వానికి, ఇక్కడి ప్రజలకు లాభమా? నష్ట మా?’ అనే ఒక్క కోణం నుంచి ఆలోచిస్తే, శత్రువులు విసిరే విభజిత వలలు ముక్కలైపోతాయి.
చివరిగా: అసలైన సమస్యలపై పాలకులను నిలదీయాలి. ప్రభుత్వం ఆంధ్రా శక్తుల నాటకాలకు సహకరిస్తే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్తామనే హెచ్చరికను పంపాలి. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ మళ్లీ రావటం ఖాయమనే ఆ శక్తులకు తెలిసిందే. చెరువులో చేపలన్నీ ఆందోళన, భయం లేకుండా, ఏకతాటిపై ఉండి, వలను స్పష్టంగా చూడగలిగితే..ఆ జాలరి ఎంత ప్రయత్నించినా ఒక్క చేపను కూడా పట్టలేడు. తెలంగాణ సమాజం తన చారిత్రక చైతన్యంతో నిశ్శబ్దంగా ఉంటూనే ఈ కుట్రను గమనిస్తే, ఆ జాలర్లు తమ వలలను సర్దుకుని ఖాళీ చేతులతో వెనుతిరగక తప్పదు.